Online Puja Services

అర్జనుడి పతాకం పైన కపివరుడు ఎలా వచ్చాడు ?

13.59.34.87

అర్జనుడి పతాకం పైన కపివరుడు ఎలా వచ్చాడు ?
- లక్ష్మీరమణ 

అర్జునుడు పాండవులలో మూడవ వాడు.  అతను పుట్టినప్పుడు “కుంతీ! నీ కుమారుడు పరమశివుడితో సరితూగేటంత శక్తిమంతుడు అవుతాడు.  ఇంద్రుని లాగా అజేయుడు అవుతాడు.  రాజులందరినీ జయించిన తరువాత, మూడుసార్లు అశ్వమేధం చేస్తాడు.  శివుని ప్రసన్నం చేసుకుని, పాశుపత దివ్యాస్త్రాన్ని సంపాదిస్తాడు” అని ఆశరీరవాణి పూల వానలు కురిపిస్తూ పలికింది.అదీకాక, అర్జనుడికి తన విద్య మీద అపారమైన నమ్మకం . ఒకింత గర్వం కూడా ! అది అర్జనుడు తన విల్లంబులతో, విద్య  నేర్చుకొనే నాటి నుండీ సాధించిన విజయాలవల్ల సంప్రాప్తించింది కూడా కావొచ్చు .  
 
పాండవులు చిన్నప్పుడు కౌరవుల తో కలిసి హస్తినాపురంలో ఉండేవారు.  బాల్యంలోనే అర్జునుడు అస్త్రవిద్య, సంగీతము నాట్యము క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.  మొదట అర్జునుడికి ధనుర్వేదంలో పాఠాలు చెప్పింది, బాణాలు  వేయటం నేర్పించింది శుక మహర్షి.  తరువాత కృపాచార్యుడు ఆ తరువాత ద్రోణుడు అర్జునుడిని మేటి విలుకానిగా మార్చారు. 

ఒకసారి ద్రోణుడు ఆయన శిష్యులు గంగానదిలో స్నానం చేస్తూ ఉండగా ఆచార్యుని కాలిని  ఒక తిమింగలం పట్టుకుంది.  శిష్యులందరూ ఎంత ప్రయత్నించినా తిమింగలం పట్టు నుంచి గురువుగారిని విడిపించలేకపోయారు.  చివరికి అర్జునుడు వేసిన బాణంతో తిమింగలం ద్రోణుని వదిలి పలాయనం చితగించింది.  ద్రోణుడు సంతోషించి అర్జునుడికి బ్రహ్మశిరాస్త్రం ఉపదేశించాడు.  ఆ ఆస్త్రాన్ని మానవులు మీద ప్రయోగించడానికి వీల్లేదు.  మానవతీతమూర్తుల మీదే అది పని చేస్తుంది. 

ఇలా ఇదిలా ఉండగా, దుర్యోధనుడికి పాండవులందరినీ హతమార్చి రాజ్యం మొత్తం చేజిక్కించుకోవాలన్నా దురాశ కలిగింది. వాళ్లందర్నీ వారణావతం అనే పట్టణానికి పంపాడు.  పాండవులకి దుర్యోధనుడి కుట్ర తెలిసిపోయింది అక్కడి నుంచి యుక్తిగా తప్పించుకుని వాళ్ళందరూ బ్రాహ్మణ వేషాలతో ఏక చక్రపురం చేరారు.  ఆ సమయంలో పాంచాల రాజు దృపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం చాటించాడు.  స్వయంవరం పంటపం ఎంతో సొగసుగా నిర్మించారు.  ఉక్కు తీగలతో పురిపెట్టిన అల్లెత్రాడు గల పెద్దవిల్లు ఒకటి వేదిక మీద ఉంచారు.  ఆ విల్లు వంచి, నారిని సంధించి, బాణం ఎక్కుపెట్టి పైన చాలా ఎత్తులో ఉన్న చేపను ఒకే దెబ్బలో కొట్టాలి. మధ్యలో ఒక చక్రం గిర్రున తిరుగుతూ ఉంటుంది.  దానికి ఏమాత్రం తగలకుండా, దాని మధ్యగుండా బాణం వెయ్యాలి. అలా వేయగలిగిన యోధున్ని ద్రౌపతి పెళ్లాడుతుంది.  

దుర్యోధనుడు, కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు వంటి యోధాను యోధులు ఆ స్వయంవరం మహోత్సవానికి హాజరయ్యారు.  బ్రాహ్మణ వేషాలలో ఉన్న పాండవులు వెళ్లారు.  క్షత్రియ వీరులు రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యారు.  కర్ణుడు విర్రవీగుతూ వెళ్లి , వెల్లికిలా  పడ్డాడు.  చివరికి మారువేషంలో ఉన్న అర్జునుడు ధనస్సు ఎత్తి, చాలా తేలికగా లక్ష్యాన్ని కొట్టగలిగాడు.  పాంచాలి అర్జునుడి మెడలో వరమాల వేసింది. ఇటువంటి మరెన్నో విజయాలు అర్జనుడిలో అతని విద్యమీద గౌరవాన్ని , ఒకింత అతిశయాన్ని కలిగించి ఉండొచ్చు . ఆ అతిశయమే  అర్జునుడికి  కపికేతనం ఏర్పడడానికి కారణమయ్యి ఉండొచ్చు . 

ఆ చిత్రమైన కథ ఏమిటంటే, ఒకసారి దేశయాత్రకు వెళ్లిన అర్జునుడు రామేశ్వరం నుంచి లంక వరకు శ్రీరాముడు నిర్మించిన వారధిని చూసి విస్తుపోయాడు.  అయితే, వంతెన నిర్మాణానికి కోతుల సాయం తీసుకోవడం మాత్రం అర్జునుడికి నచ్చలేదు. “ గొప్ప ధనుర్విద్యా నిపుణుడైన శ్రీరామచంద్రుడు బాణాలతో వంతెన నిర్మించుకో వలసింది” అనుకున్నాడు. సముద్ర తీరాన కూర్చుని రామాయణం పఠిస్తున్న ఒక పండితుడి దగ్గరకు వెళ్లి ఇదే ప్రశ్న వేశాడు.  ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయాడు.  

అప్పుడు ఒక కోతి పిల్ల వచ్చి “శ్రీరాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే, కోతులన్నీ దానిమీద నడిచి ఉంటే ఆ వారధి ఆనాడే కుప్ప కూలి ఉండేది” అని సమాధానం ఇచ్చింది.  శ్రీరాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే కోతుల బరువుకే అది కూలటమా? అని సవ్యసాచి బెగ్గరగా నవ్వాడు.  కోతి పిల్లకి అతనికీ  మధ్య వాదోపవాదం చెలరేగింది.  రాముడి సంగతి అలా ఉంచు నేను బాణాలతో వంతెన కడతాను.  నువ్వు పడగొట్టగలిగితే, నేను అగ్నిలో దూకి ప్రాణాలు విడుస్తాను.  ఒకవేళ నేను గనుక  జయిస్తే, ఎప్పటికీ మీ వానర జాతి అంతా నాకు బానిసలుగా సేవకులుగా ఉండాలి.  సరేనా! అన్నాడు.  సరేనంది ఆ మర్కటం.  అర్జునుడు బాణాలతో వంతెన ఏర్పరిచాడు.  కోతి అడుగుపెట్టగానే అది పుటుక్కుమంది.  మళ్ళీ వంతెన కట్టాడు.  మళ్ళీ కూలిపోయింది. ఇలా ఎన్ని సార్లు చేసినా ఫలితం లేకపోయింది . ఫక్కునవ్విందా మర్కటం . 

రోషపడ్డాడు అర్జనుడు .  తన అవివేకానికి చింతించాడు.  మంట చేసి ఆ జ్వాలల్లోకి దూకటానికి సంసిద్ధుడయ్యాడు.  

ఇంతలో ఒక బాలుడు వచ్చి “న్యాయమూర్తిగా వ్యవహరించే పెద్దమనిషి లేకుండా, మీరు వేసుకున్న పందెం ధర్మసమ్మతం కాదు.  నీ ఆత్మ త్యాగం చెల్లదు.” అన్నాడు.  అర్జునుడు అతని మాటలు వినకుండా మంటల్లోకి దూకపోతుంటే, “సరే మరోసారి పందెం కాయండి. ఈసారి నేను న్యాయం చెబుతాను.  అప్పుడు కూడా ఓడిపోతే, ఇక మీ ఇష్టం” అన్నాడు బాలుడు.  వానరమూ, అర్జునుడు అందుకు సరేనన్నారు.  అర్జునుడు మళ్ళీ వంతెన నిర్మించాడు.  పిల్ల కోతి చకచకా ఎక్కి నిలబడింది.  ఈసారి వంతెన చెక్కుచెదరలేదు.  పిల్ల కోతి శరీరాన్ని పెంచింది.  పర్వతమంత ఎత్తు ఎదిగింది.  అయినా వంతెన దొనక లేదు. 

ఆ  కోతికి అర్థమైంది.  వచ్చిన బాలుడు ఎవరో ! రామచంద్ర ప్రభూ ! అంటూ వెళ్లి బాలుడికి పాదాభివందనం చేసింది.  శ్రీకృష్ణా ! అంటూ వెళ్లి పార్ధుడు  కూడా బాలుడి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడా మురళీధరుడు  చిరునవ్వు నవ్వుతూ ఇద్దరినీ లేవనెత్తి,  ఇకమీదట అర్జునుడి పతాకం మీద నీ గుర్తు ఉంటుంది హనుమా! అని కోతిని ఆశీర్వదించాడు. 

ఆ తర్వాత శ్రీకృష్ణుని వీపుమీద తన బాణాలు గుర్తులు చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడికి సందేహ నివృత్తి చేశాడు వాసుదేవుడు . “ఒక్క హనుమ నడిస్తేనే బాణాల వంతెన కూలిపోయింది . అతంటి కపిసైన్యం, వీరాధివీరులూ నడవాలంటే ఆ వంతెన సరిపోదని రాములవారికి  తెలియదా పార్థా ! హనుమ నడిచేప్పుడు,  నిన్ను కాపాడుకోవడానికి నేను వెన్ను కాచాను . అందుకే ఇలా నా వీపు మీద నీవు నిర్మించిన వంతెన గుర్తులు పడ్డాయి” అని చెప్పారు . అశ్రుధారలు కురిపిస్తూ , ఆ శ్రీకృష్ణుని కాళ్లు కడిగి , తన అతిశయాన్ని ఆ పరంధాముని పాదాల మీద పెట్టాడు అర్జనుడు . అదీ కథ . 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya