Online Puja Services

చ్యవన మహర్షి అనుగ్రహంతో బొందితో స్వర్గాన్ని పొందిన చేపలు !

3.128.204.140

చ్యవన మహర్షి అనుగ్రహంతో బొందితో స్వర్గాన్ని పొందిన చేపలు !
- లక్ష్మి రమణ 

ఏడేళ్ళు సావాసం చేస్తే, వారు వీరవుతారని ఒక నానుడి. ఆ విధంగా సజ్జనుల సాంగత్యం చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఊహకికూడా అందనివి. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడంలో, విజ్ఞానాన్ని పొందడంలో  , విజ్ఞతని అలవర్చుకోవడంలో ఈ సావాసం ఎంతో ఉపకరిస్తుంది. చ్యవన మహర్షి   సావాసాన్ని అయాచిత అదృష్టంగా దక్కించుకున్న జలచరాలు , జాలర్ల కథని మహాభారతంలో నారద మహర్షి ధర్మరాజుకి వివరించారు. ఆ కథేమిటో తెలుసుకుందాం . 

చ్యవన మహాముని గంగా యమునల సంగమ ప్రదేశాన ధ్యాన సమాధిలో ఉన్నారు.  ఆ నీటిలోని చేపలు ఆయన శరీరమంతా ఎక్కి హాయిగా తిరగడం మొదలుపెట్టాయి.  ఆయన దయతో వాటిని మన్నించాడు.  వాటి చేష్టలకు మిన్నకున్నాడు.  అలా 12 ఏళ్లు గడిచిపోయాయి. ఒకసారి జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి వలవేశారు. చేపలతోపాటు చ్యవన మహర్షి కూడా ఆ వలలో చిక్కుకున్నారు. వలని పైకి తీసిన బెస్తలు ఆ మహామునిని చూసి భయపడ్డారు.  తప్పు క్షమించమని ఆయన కాళ్ళ మీద పడ్డారు. 

 అప్పుడు చ్యవనుడు ‘ఈ చేపలతో కొన్నేళ్లుగా సహవాసం చేయడం వల్ల వాటి మీద నాకు మక్కువ, హక్కు ఏర్పడ్డాయి. వాటితో సహా ప్రాణాలు విడవడం కూడా నాకు ఇష్టమే.  కనుక వాటితో పాటు నన్ను కూడా చంపేయండి. లేదా మీకు ఉపాయం చెబుతాను, ఈ చేపల్ని మీరు ఎలాగో అమ్ముకుంటారు కదా.  వాటితో పాటు నన్ను కూడా అమ్మేయండి’ అన్నారు.  

జాలర్లు భయపడుతూ వెళ్లి నహుష మహారాజుతో సంగతి చెప్పారు.  ఆయన భయ సంభ్రమాలతో మంత్రి, పురోహితులను వెంటబెట్టుకుని ఆ మహాముని దగ్గరకు వెళ్ళారు.  ‘మహాత్మా! తెలియక అపరాధం చేశారు బెస్తలు. వారి పాప పరిహారమేమిటో సెలవివ్వండి’ అని అర్థించాడు . అప్పుడా మహర్షి వినయంగా ‘మహారాజా బెస్తలు తమ వృత్తి ధర్మం చేశారు.  అందులో వారి తప్పేముంది? పాపం, వాళ్ళు చాలా శ్రమ పడ్డారు.  అందుచేత నా శరీరానికి తగిన వెల వాళ్లకి ఇవ్వు’ అన్నాడు. ఆయన మనసులో బెస్తలపట్ల కోపం లేనందుకు నహుష్యుడు సంతోషించాడు.  మంత్రిని పిలిచి ‘ఈ జాలర్లకు 1000 మాడలు ఇవ్వండి’ అన్నారు.  కానీ ముని కల్పించుకొని ‘ధర్మంగా ఇవ్వు మహారాజా’ అన్నారు. ఆ తర్వాత ఆ బేరం పదివేలు, లక్ష, కోటి దాటిపోయింది . చివరికి రాజు ‘నా రాజ్యంలో సగం ఇస్తాను’ అన్నారు. అది కూడా కాదంటే , రాజ్యమంతా ధారపోస్తానన్నారు. అయినా అది తనకి తగిన వెల కాదన్నారు చ్యవనమహర్షి. పైగా  ‘నువ్వు నీ మంత్రులు ఆలోచించుకొని తగిన వెల ఇవ్వండి’ అని చిరునవ్వులు చిందించారు .  

మహారాజు నహుషుడు విచారపడిపోయారు.  ఏంచేయాలో పాలుపోని స్థితిలో మంత్రులందరితో సమాలోచనలు మొదలుపెట్టారు. ఇంతలో అక్కడికి గవిజాతుడనే మహాముని విచ్చేశారు.  రాజుగారి తర్జనభర్జన గమనించి, సమస్య ఏమిటో అడిగి తెలుసుకున్నారు.  ‘మహారాజా చింత విడిచిపెట్టు.  గోవులకు, విప్రులకు భేదం లేదు. ఆ ఇద్దరూ  హవిస్సుకీ, మంత్రాలకూ ఆధారమైన వాళ్ళు.  సకల వేదాలకూ  ఆశ్రయమైన మహర్షికి వెల నిర్ణయించడం దుర్లభమైన పని. అటువంటి బ్రాహ్మణులతో సమానమైనదే గోవు కూడా.  కనుక, నీవు గోవుని వెలగా చెల్లించు.  సరిపోతుంది.’ అని ఆ చిక్కుముడికి సులువైన పరిష్కారం చూపారు. 

 అప్పుడు నహుషుడు చ్యవన మహర్షి దగ్గరికి వెళ్లి ‘మహాత్మా! నన్ను దయ చూడు.  మీకు వెలకట్టడం ఎవరికి సాధ్యం? మీకు వెలగా ఆ జాలర్లకు గోవుని ఇస్తాను అనుగ్రహించండి’ అని ప్రార్ధించారు. అందుకు చ్యవనుడు ఎంతగానో సంతోషించారు. ‘తగిన మూల్యమే నిర్ణయించావు.  అలాగే ఇవ్వు’అన్నాడు. నహుషుడు గోవును జాలర్లకి ఇచ్చాడు. కానీ ఆ జాలరులు గోవుతో సహా మహర్షి దగ్గరకు వెళ్ళి ‘ అయ్యా! మీరు  మమ్మల్ని చూసింది మొదలు మా మీద అనుగ్రహన్నీ కురిపిస్తున్నారు. మమ్మల్ని కరుణించి ఈ గోవును మీరే తీసుకోండి’ అని వేడుకున్నారు. వారి భక్తికి సంతోషించారు.  ‘సరే అలాగే ఇవ్వండి’ అని ఆ గోవును వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీరు, ఈ చేపలు స్వర్గానికి వెళ్ళండి అని దీవించారు. వెంటనే ఆ బెస్తలు, చేపలు కూడా సశరీరాలతో ఎగసి స్వర్గానికి వెళ్లారు. 

నహుషుడు, ఆయన పరివారము అది చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు చ్యవనుడు, గవిజాతుడు కలిసి నహుషుడ్ని పిలిచి ‘నీకు మేము చెరోక వరం ఇస్తాం.  ఏం కావాలో కోరుకో’ అన్నారు. ‘ మహర్షులారా !  మీరు తృప్తి పొందడం కంటే నాకేం కావాలి? అన్నాడు నహుషుడు. ‘రాజా నీకు ధర్మపరత్వం, దేవేంద్ర వైభవం కలుగుతాయి’ అని ఆశీర్వదించి వాళ్ళిద్దరూ అంతర్ధానమయ్యారు.  నహుషుడు పరమానంద భరితుడయ్యాడు. 

ఇలా సజ్జన సాంగత్యం వల్ల చేపలు , జాలర్లు మహా తపస్సు వాల్ల కూడా సాధ్యంకాని బొందితో స్వర్గానికి వెళ్లే అదృష్టాన్ని దక్కించుకున్నారు . ధర్మబద్ధంగా నడుచుకొన్నందుకు , మరో మహర్షి సాంగత్యంవలన ఒక భువి రాజైన నహుషుడు, దివి దేవేంద్రపదవిని చేపట్టగలిగాడు. కాబట్టి సజ్జన సాంగత్యం చేయమని , దానివలన ఉత్తమ ఫలితాలు ఉంటాయని చెబుతూ నారదుడు ధర్మరాజుకి ఈ కథ చెప్పాడు. శుభం . 

#chavanamaharshi #chyavana #nahusha #nahushudu #bharathamstories

Tags: chavanamaharshi, chavana, maharshi, chyavana, nahusha, bharatham, mahabharatham, mahabharatam, stories, 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya