Online Puja Services

భీముడంతడివాడికి కూడా సాధ్యం కాని పని !

18.119.131.72

భీముడంతడివాడికి కూడా సాధ్యం కాని పని !
సేకరణ 

ఒకరోజు ద్రౌపది, భీముడు గంధమాధన పర్వతచరియలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముని కోరింది. ద్రౌపది కోరిన సౌగంధికా పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు.

అలా వెళుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఈ శబ్ధాలను అక్కడ ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడని గ్రహించాడు. తమ్ముని పరీక్షించాలన్న ఆలోచన ఆ వాయునందనుడికి వచ్చింది .  వెంటనే, గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న చెట్లను పెరికి దారికి అడ్డం వేసాడు. తాను కూడా దారికి అడ్డంగా పడుకుని తోకను విలాసంగా ఆడించసాగాడు. భీముడు అక్కడికి వచ్చి హనుమంతుని చూసి సింహనాదం చేసాడు.

ఆ శబ్ధానికి హనుమంతుడు కళ్ళు తెరిచి ఎవరయ్యా నీవు? పెద్దవాడిని, అలసిపోయి ఉన్న వృద్ధుడిని ఇలా  పడుకుని ఉంటే, నీవారీతిగా అరవడం సరైనదేనా ? అడవిలో ఉన్న పండ్లు ఫలాలు తిని వెళ్ళు. అంతేకానీ  ఇలా అరవకు అన్నాడు హనుమంతుడు. భీముడు నేను పాండురాజు పుత్రుడను, ధర్మరాజు తమ్ముడిని. నా నామధేయం భీమసేనుడు. నేను ఒక పని మీద వెళుతున్నాను. నాకు దారి వదులు అన్నాడు. హనుమంతుడు నేను ముసలి వాడిని, కదలలేను. నీవే నా తోకను పక్కన పెట్టి, నీ దారిన నీవు వెళ్ళచ్చు కదా అన్నాడు.

భీముడు అదెంత పని అని తోకను ఒక్క చేత్తో ఎత్తి పెట్టబోయాడు. తోక కదల లేదు. రెండు చేతులు ఎత్తి పట్టుకుని ఎత్తబోయాడు. అప్పుడూ కదల లేదు. భీముడు అది చూసి ఆశ్చర్య పోయాడు. భీముడు హనుమంతునితో, అయ్యా! మీరెవరో నాకు తెలియదు. కాని మీరు మహాత్ములు. నన్ను మన్నించండి అన్నాడు. హనుమంతుడు భీమునితో భీమా! నేను హనుమంతుడిని, నీ అన్నను. రావాణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్ళి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలిపాను. రాముడు రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నన్ను మెచ్చి చిరంజీవిగా ఉండమని దీవించాడు.  అప్పటి నుండి నేను గంధమాధన పర్వతంపై నివసిస్తున్నాను అని చెప్పాడు. అది విన్న భీముడు సంతోషించాడు

అప్పుడు హనుమంతుడు:-
“భీమా! కృతయుగం లోధర్మం నాలుగు పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, వేదాలు తమ విధులు నిర్వర్తించారు. వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలకు పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాత్సర్యము, కోపము, భయం, సంతాపం, ప్రజాక్షయం, అవయవక్షయం లాంటివి లేవు. తరువాత త్రేతాయుగం ఆరంభమైంది. ధర్మం మూడుపాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు చేసే వారు, తపస్సులు చేసే వారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు. ద్వాపరయుగం వచ్చింది.

ధర్మం రెండు పాదాలతో నడిచింది. వేదములు, శాస్త్రములు విధించిన ధర్మము కామము అనుసరించబడ్డాయి. కాని ద్వాపరయుగంలో ప్రజలు మాటమీద నిలవరు, సత్యము శమము హీనమౌతుంది. ప్రజలు కామ్యార్ధం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజా రక్షణ చేస్తాడు. తరువాత వచ్చునది కలియుగం .

ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో సజ్జనులను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన వాటికి వశులై అధర్ములై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కాని వాటికి ఫలితం చాలా ఎక్కువగా ఉంటాయి అని హనుమంతుడు చెప్పాడు.

ఆతర్వాత ఆయనకీ అవసరమైన ఆ సౌగంధికా పుష్పాల ఆచూకీని కూడా ఆంజనేయులే ఈ విధంగా తెలియజేస్తారు . “భీమా నీవు కావాలి అనుకున్న సౌగంధికా పుష్పములు ఉన్న కొలనును యక్షుల, గంధర్వులు సంరక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్యప్రతాపాలు పనికి రావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు. దేవతలు భక్తికి లొంగుతారు కనుక ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్టించ బడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలవలన దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతల తృప్తి చెందితే సకాల వర్షాలు పడి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆలోచించి నిర్ణయించుకో. పిల్లలతో, గర్వం కలవారితో, నీచులతో వ్యర్ధ ప్రసంగం చెయ్యవద్దు. నిన్ను చూస్తే సంతోషం కలుగుతుంది.

భీమా! యుద్ధభూమిలో నన్ను తలచిన ఎడల నేను అర్జునిని రధం మీద ఉన్న ధ్వజంపై ఉండి మీకు విజయం కలగడంలో సహకరిస్తాను. అలాగే మీ ధైర్య సాహసాలు ప్రత్యక్షంగా చూస్తాను అన్నాడు. తరువాత హనుమంతుడు భీమునకు సౌగంధికా సరోవరానికి మార్గం చూపి వెళ్ళి పోయాడు. అలా హనుమంతుని తోకని కదిలించడం భీమసేనుడికి సాధ్యం కాకపోయినా , అనంతమైన ధర్మ సూక్ష్మాలని విశదపరచి, ఎన్నో వరాలని అనుగ్రహించి ఆశీర్వదిస్తారు భారతంలో అరుదెంచిన హనుమంతులవారు . 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore