Online Puja Services

ఆమె ఒక్క నమస్కారం ఐదుగురికి ప్రాణదానం చేసింది.

3.15.3.154

ఆమె ఒక్క నమస్కారం ఐదుగురికి ప్రాణదానం చేసింది.
లక్ష్మీ రమణ 

నమస్కారం చేయడం మన భారతీయుల సంస్కారం . ఒక్క నమస్కారం అహాన్ని నాశనం చేసేస్తుంది. ప్రేమని పెంపొందించి , ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని నాశనం చేసేస్తుంది. పూర్వం ఒకరాజు మరోరాజుని యుద్ధంలో సంహరించే పరిస్థితి గనక వస్తే, ఆ ముందరి రోజు రాత్రి ఓడిపోతాడనుకున్నా రాజు భార్య , గెలుస్తారనుకున్నా రాజుని యుద్ధశిబిరంలో కలుసుకొని, ఆయన చేతికి రాఖీ కట్టి , నా భర్తని చంపొద్దని, పాటి భిక్ష పెట్టమని వేడుకునేవారట ! కానీ ఈ సంఘటన మాత్రం మహాభారతం లోనిది . 
 
భీష్ముడు పాండవ, కోరావులకి పితామహుడు . మహావీరుడు కూడా ! ఆయన ధనుస్సుని ధరించి ఉండగా, ఆయనకీ ఎదురుగా నిలబడి యుద్ధం చేయగలవాడు ముల్లోకాల్లోనే లేదని ప్రతీతి . ఇక ఆయన ముందర పాండవులు ఒక లెక్కకాదు . ఆ విషయం దుర్యోధనుడికి తెలియని విషయం కాదు . 

కురుక్షేత్రం మొదలయ్యాక,  ఒక రోజు దుర్యోధనుడు అన్న వ్యంగ్యమైన మాటలకు బాధపడుతూ, "భీష్మ పితామహ" ఇలా ప్రకటించాడు. "నేను రేపు పాండవులను చంపుతాను" అన్నారు . ఆయన ఆ మాట అన్నారని తెలిసిన వెంటనే, పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. ఎందుకంటె  భీష్ముని సామర్ధ్యాల గురించి వారందరికీ తెలుసు. ప్రాణభయంతో పాండవులు కలవరపడ్డారు. 

అప్పుడు శ్రీ కృష్ణుడు తరుణోపాయం ఉపదేశించాడు . ద్రౌపదిని తన వెంటపెట్టుకొని భీష్ముని శిబిరానికి తీసుకువెళ్లారు. కృష్ణ పరమాత్మ శిబిరం వెలుపల నిలబడి,  ద్రౌపదిని లోపలి పంపించాడు .  ‘లోపలికి వెళ్లి మీ తాతగారికి నమస్కరించమ్మా ! దాని వల్ల నీ భర్తలైదుగురికీ ప్రాణదానం చేసిన దానివవుతావు’ . అని చెప్పి పంపించాడు . 

ద్రౌపది లోపలికి వెళ్లి భీష్మ పితామహునికి నమస్కరించింది . వెంటనే ఆయన  "అఖండ సౌభాగ్యవతి భవ" అని ఆశీర్వదించారు. ఆ తర్వాత  “అమ్మా ! ఇంట రాత్రి వేళ, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ? పాండవులు కుశలమేకదా ! కృష్ణ పరమాత్మ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారా ? “ అని అడిగారు . 

    అప్పుడు ద్రౌపది” అవును పితామహ, మీ ఆశీర్వాదం కోసం నేను వచ్చాను . అఖండ సౌభాగ్యవతిగా మీరు నన్ను ఆశీర్వదించిన విషయాన్ని మరువకండి. కృష్ణుడు శిబిరం బయటే ఉన్నారని” చెప్పింది .

భీష్ముడు బయటికి వచ్చి కృష్ణ పరమాత్మకు నమస్కరించి “ పరంధామా , మీరు పాండవుల వైపున ఉండగా వారికి ఎటువంటి ఆపదా వాటిల్లదని నాకు బాగా తెలుసు. అందుకే నేను దుర్యోధనునితో అలా చెప్పాను . ద్రౌపదికి ఇచ్చిన మాటని మీ సాక్షిగా తప్ప”నని మాట ఇచ్చారు . 

అప్పుడు శ్రీకృష్ణులు అన్నారూ “ అమ్మా ! నువ్వు మీ తాతకు ఒకసారి వెళ్లి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు" అని చెప్పారు .  

అలా నమస్కారం ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది . అహాన్ని నాశనం చేసి ఇంట్లో శాంతి భద్రతలని నెలకొల్పుతుంది . అందుకే మన పెద్దలు రోజూ భర్తకి నమస్కారం చేయమని , అత్తమామలకు నమస్కారం చేయమని చెప్పారు . బహుశా ఇలా చేయడం వల్ల కనీసం ఒక యాభై శాతం కుటుంబాలలోనైనా శాంతి, శౌఖ్యాలు విరాజిల్లుతాయేమో చూడాలి . 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore