Online Puja Services

గౌరీ పూజ చేస్తే కీచులాటలు సమసిపోతాయా ?

18.221.235.209

గౌరీ పూజ చేస్తే కీచులాటలు సమసిపోతాయా ?
-లక్ష్మీ రమణ 
 
ఇంట్లో పప్పులు , ఉప్పు, చింతపండూ  లేకపోయినా చాట పతిదేవుని ముఖపద్మాన్ని చేరుతుందని ఆయనకీ ఆమెకీ ఇద్దరికీ తెలుసు. ఒత్తిడి నిండిన ఉరుకూ పరుగుల జీవితాలు కదా ! పూర్వంలో అంటే, ఆడవారిది ఇంటి బాధ్యత . భర్తగారిది సంపాదించి పోషించే బాధ్యత . అప్పటికంటే, ఇప్పుడే కదా , భార్యాభర్తల బాంధవ్యానికి ప్రేమతోపాటు సహనం, ఓర్పు , ఆప్యాయత , అనురాగాల అవసరం ఎక్కువగా ఉన్నది. వాటిని పెంపొందించుకోమని చెప్పడమే , గౌరీపూజలో అంతరార్థం అన్నది పెద్దలమాట .   

వివాహానికి ముందు కన్యలు గౌరీ పూజ చేస్తారు. ఈ ఆచారం ఇంచుమించు భారతదేశమంతటా ఉంది. శ్రీ కృష్ణుడిని ప్రేమించి అతణ్ణే వివాహము చేసుకోదలచిన రుక్మిణీదేవి కూడా గౌరీపూజ చేసింది. అయితే గౌరీపూజే ఎందుకు చేయాలి? అని ఆడినప్పుడు శ్రీ కంచి పరమాచార్యుల వారు ఇచ్చిన వివరణ సారాంశం ఇలా ఉంది .

“ లక్ష్మీదేవి భర్త శ్రీ మహావిష్ణువు. అందం, చందం, అలంకారం, ఐశ్వర్యం ఉన్న మహాప్రభువు. ఆయనతో కాపురం నల్లేరు మీద బండిలా హాయిగా సాగిపోతుంది. మరి శివుడు అలా కాదే అయన స్మశానవాసి. పాములు మెడలో వేసుకుంటాడు. చేతిలో కపాలం ధరిస్తాడు. చూడడానికి మహ భయంకరంగా ఉంటాఢు. ఇంత బూడిద తప్ప అయనకు ఐశ్వర్యమేముంది కనుక? ఆయనతో కాపురం చేయడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో ఓపిక ఉండాలి. ఎన్నో అవమానాలు దిగమింగాలి. ఇంకోవైపు అసంతృప్తి చిహ్నలు కనిపించకూడదు, చిరునవ్వు చెరగకూడదు. ఇది ఎప్ఫుడు సాధ్యమవుతుంది? వీటన్నింటికీ అతీతంగా భర్తను ప్రేమించి, ఆరాధించినప్పుడే. వివాహానికి ముందు, వివాహానికి తర్వాత ఎందరో అడపిల్లల అనుభవం చూడండి. 

 అంతవరకు పరిచయం లేని కొత్త వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం. అతను తాను కలగన్న రాకుమారుడు కాకపోవచ్చు. తాను కోరుకున్నంత సంపన్నడు కాకపోవచ్చు. కానీ, తన జీవితం అతనితో ముడిపడిపోయింది. అందుకే వివాహాలు స్వర్గంలో నిర్ణయమవుతాయని సామెత. 
 
నిజానికి ఈసూత్రం మన దేశానికీ, మన వివాహ వ్యవస్థకే కాదు ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది. భర్త పట్ల భార్యకీ, భార్య పట్ల భర్తకి ఉన్న ప్రేమ మాత్రమే వీటిని జయించగలుగుతుంది. అందుకు అదర్శం సతీదేవి. కన్నతండ్రి దక్షుడు, తన భర్త రూపురేఖలను, దరిద్రాన్ని ఎత్తి చూపించి దూషించినప్పుడు భరించలేక సతీదేవిగా అగ్నిప్రవేశం చేయడం తామిరువురూ ఒక్కటేననే మమేకభావమే. అటువంటి గౌరీదేవిని గుర్తు చేసుకుంటే వైవాహిక జీవితంలో కలతలు రావు. సంసారం స్వర్గతుల్యం అవుతుంది” 

ఇప్పుడున్న ప్రేమపెళ్ళిళ్ల వరస చూసినా , అప్పటి వరకూ కలిసి జీవించని రెండు మనసులు వివాహబంధంతో ఒక్కటవుతారు. ఆ తర్వాత జీవన శైలిలో ఒకరి విధానాలు మరొకరికి నచ్చకపోవచ్చు. కానీ తొలినాటి ప్రేమనే తలుచుకోక, కీచులాటలనే తలుచుకుంటూ , మూడునాళ్ళ ముచ్చటైన కాపురాలు ఎన్నో మన చుట్టుపక్కలే కనిపిస్తూంటాయి . అటువంటి సంఘర్షణలు , మానసిక బాధలు  లేకుండా నిర్దేశించిన సంప్రదాయ విధానమే గౌరమ్మని పూజించడం . ఆమె కథని గురు చేసుకోవడం . దానినుండి స్ఫూర్తిని పొంది సంసారాన్ని దిద్దుకోవడం . 

గౌరీదేవికి శివుని భర్తగా వరించింది . ఆయనని పతిగా పొందేందుకు , తల్లిదండ్రులని వీడి తపస్సు చేసింది . ఆమెని పరీక్షింపదలచిన శివుడు ముసలివాడిగా కనిపించి, నేనే శివుడిని , వృద్ధుడిని , స్మశానాలలో తిరిగేవాడిని , బూడిద తప్ప సంపద లేని సన్యాసిని అని చెప్పినా అమ్మ తన నిర్ణయం మార్చుకోలేదు . ఇంద్రియలోలత్వాన్ని ప్రదర్శించలేదు . మనసా, వాచా, కర్మణా ఆయననే వరించానని వివాహం చేసుకోవాలని కోరింది . వివాహంతోనే శివుని గెలుచుకోలేదు, ఆయనలో సగభాగాన్ని ఆక్రమించి అర్ధనారీశ్వరిగా , శివుని శక్తిగా ఆవిర్భవించిందా లోకపావని . నిరంతరం ధ్యానమగ్నుడైన పరిత్యాగిని అంతగా గెలుచుకున్న అమ్మకున్న ఓర్పు, నేర్పు అమ్మాయికీ, ఆమెని అర్థం చేసుకొని తనలో సగభాగాన్ని పంచివ్వాలన్న జ్ఞానం అబ్బాయికీ చెబుతారు వివాహంలోనే మన పెద్దలు . 

 పెళ్ళకి ముందు ఆడపిల్లలచేత గౌరీపూజ చేయించడం అందుకే. ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజచేయిస్తారు . ఇక్కడ మన సంప్రదాయం లోని మరో విశేషాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. ఇక్కడ వధువుని "లక్ష్మి,పార్వతి, సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. అంటే, స్వయంగా వారు ఆదిదంపతులే. అక్కడ జరిగే గౌరీ శంకరుల కళ్యాణమే ! 

ఇక నల్లపూసలు కూడా వివాహంలో వధువుకి కట్టిస్తారు . దానికి ముందర నీలలోహిత గౌరీ పూజ ఆ పూసల దండకి చేయిస్తారు . దీనివల్ల సాక్షాత్తూ దేవీ స్వరూపంగా ఉన్న వధువుకి , నూతనంగా దాపత్యాన్ని మొదలుపెట్టబోతున్న జంట బాంధవ్యానికీ దిష్టి తగలదని నమ్మకం . ఇంకా నీలలోహిత గౌరీ అనుగ్రహంతో వధువు సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. నీలలోహిత గౌరీ పూజ ప్రారంభించే ముందు నాకు వివాహం, సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యము, పుత్రలాభం ప్రసాదించెదవు గాక అని ప్రార్థించి 'నీలలోహితే బధ్యతే' అనే మంత్రాన్ని చెప్పి ముత్యాలతోను, పగడాలతోనూ కూర్చబడిన సూత్రాన్ని వధువు మెడలో కట్టిస్తారు . ఇలా  నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయి అని శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే మంగళసూత్రం కూడా భర్తకు తప్ప ఇతరులకు కనిపించే విధంగా పైన వేసుకోకూడదు అని చెబుతారు . నరుడి దృష్టికి నల్లరాయయినా పగులుతుందని కదా శాస్త్రం ! ఇందులో మరో ఆధ్యాత్మిక విశేషం కూడా దాగుంది అంటారు  పండితులు . ఆధ్యాత్మికంగా చూసినట్లయితే హృదయ మధ్యభాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉండడంచేత హృదయం, గొంతుభాగాలలో ఉష్ణం సమతులమై రోగాలు పరిహారం అవుతాయట . 

సరే, ప్రయోజనాల మాటెలా ఉన్నా , అమ్మని తలుచుకోవడం , ఆదిదంపతుల కథని గుర్తుచేసుకోవడం వలన ‘తమలపాకుతో తానొకటంటే, తలుపుచెక్కతో నేనొకటంటా’ అని కీచులాడుకుంటూ విడిపోయే జంటలు కలుసుంటాయంటే, అంతకుమించిన భాగ్యమేముంటుంది చెప్పండి . శుభం .

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore