Online Puja Services

ధర్మదేవతకీ అనుభవించక తప్పని కర్మ ఫలం !

18.222.163.31

ధర్మదేవతకీ అనుభవించక తప్పని కర్మ ఫలం !
- లక్ష్మి రమణ 

మూర్తీభవించిన ధర్మం యమధర్మరాజు. ధర్మదేవతయిన యమధర్మరాజు మూడు అవతారాలు ధరించారు.  ఈ మూడు అవతారాలకీ కారణం దూర్వాస మహర్షి శాపం. ఈ అవతారాలు కూడా ధర్మరాజు అంశముతో జన్మించినవి కావడం వలన ధర్మానువర్తనులై లోకములో ధర్మాన్ని ఆచరించడం ఎలాగో చాటి చెప్పాయి.  ఎన్నో ధర్మ సూక్ష్మాలని విశదీకరించాయి.  అటువంటి ఆ అవతారాలకి మూల కారకమైన ఉదంతాన్ని ఇక్కడ చెప్పుకుందాం . కలియుగంలో ఆ ధర్మ స్వరూపాలని తలుచుకోవడం స్మరించుకోవడం కూడా అనంతమైన పుణ్యఫలాన్ని అనుగ్రహించేవేననే విషయాన్నిక్కడ మనం గుర్తుంచుకోవాలి . 

 దూర్వాసమహర్షిని ప్రత్యేకంగా సనాతనులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ పేరు చెప్పగానే రూపం ధరించిన ముక్కోపి మహర్షి స్వరూపం కనులముందు మెదలడం సహజమే . అయితే, అత్రి , అనసూయల పుత్రుడైన ఆయన తన సోదరులైన దత్తాత్త్రేయునితో కలిసి ధర్మదేవత నిజస్వరూపాన్ని చూడాలని పదివేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తారు.  ధర్మాచరణ యెంత కష్టమైనదో , ధర్మస్వరూపము అనుగ్రహించడం కూడా అంతే కష్టమైన పని . అన్ని సంవత్సరాల తపస్సు తర్వాత కూడా దూర్వాసునికి ధర్మదేవత సాక్షాత్కారము కలగలేదు. దాంతో ఆయనకీ సహజంగా ఉన్న కోపము వచ్చేసింది . ఆగ్రహించిన దుర్వాసుడు ధర్మదేవతను కూడా శపించాలనుకుంటారు.  అప్పుడు ధర్మదేవత బ్రాహ్మణ నిరూపంలో ప్రత్యక్షమై దర్శనమిస్తారు దూర్వాసునికి . 
 
అప్పుడా ధర్మదేవత దూర్వాసునితో  “మహర్షి! తాపసులకి  ఇంత కోపం ఉండకూడదు అని అంటారు. ఓర్పుగా ఉండాల్సిన నీవు ఈ విధంగా శాపమివ్వాలనే క్రోధాన్ని తెచ్చుకోవడం సమంజసమేనా ?” అని ప్రశ్నించారు.  అప్పుడు దూర్వాసుడు కోపం తగ్గనివాడై , “ నీవు ఎవరు నాకు చెప్పడానికి? నాకు దర్శనం ఇవ్వడానికి నీకు 10,000 సంవత్సరాలు పట్టిందా? ఇప్పుడు కూడా నువ్వు నా శాపానికి భయపడి ప్రత్యక్షమయ్యావు.  కాబట్టి నీవు సుఖము తెలియని రాజుగాను, దాసి కొడుకు గానూ, చండాలుడిగాను పుడతావని” శపించారు . 

ఆ శాప ప్రభావంతోటే , సుఖంలేని రాజు - పాండవాగ్రజుడైన ధర్మరాజుగా, దాసికొడుకుగా -ధర్మ నిరతుడైన విదురునిగా, చండాలుడైన - వీరబాహునిగా కర్మఫలాన్ని అనుభవించడానికి స్వయంగా యమధర్మరాజు పుట్టారని పురాణ కథనం. 

ఆ విధంగా ధర్మదేవతనే శాశించిన మహర్షి దూర్వాసుడు .  ఆయన చేసిన ఈ పనివల్ల ధర్మసూక్ష్మాలు ఈ జాతికి అందాయి. మహాభారతము పంచమ వేదమై మానవాళి అనుసరించాల్సిన ధర్మాన్ని ప్రబోధిస్తోంది . ఇంతటి గొప్పమేలు  ఆయన కోపమువల్ల కలిగిన శాపము అనుగ్రహించింది.  అయినా కూడా కోపము ఎప్పుడూ శత్రువే ! తన కోపమే తన శత్రువు అనే మాట అక్షర సత్యమే ! ఈ అనుభవము కూడా దూర్వాస మహామునికి కలిగింది.  ఆ విశేషాలు మరో పోస్టులో చెప్పుకుందాం !! 

శుభం !! 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore