నిజమైన కాలకేయులు అంటే వీళ్ళే !

54.165.57.161

నిజమైన కాలకేయులు అంటే  వీళ్ళే !
-లక్ష్మీ రమణ 
 
బాహుబలి సినిమా చూసిన వారికి కాలకేయులని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కాలకేయులు నిజంగానే రాక్షసులు. మన పురాణాలలో వీరి గురించిన ప్రస్తావన ఉంది . కృతయుగానికి చెందిన ఈ కధలోని కాలకేయులనే , బాహుబలిలో పాత్ర కట్టించి తెరమీద ఆడించారు అనిపిస్తుంది.  వాళ్ళు కిలికిలి భాష మాట్లాడారో లేదో గానీ , ఆ అకృత్యాల వివరణ మాత్రం స్కాందపురాణంలో ఉంది  . 

పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు . వాడు మహా బలశాలి . వీడి అనుచర గణమే కాలకేయులు . ఇంద్రుణ్ణి కూడా జయించి , దేవతలని, సజ్జనులని , మునులని రకరకాలుగా హింసించడం మొదలు పెట్టాడు . ధనం , అధికారం బహు చెడ్డవి . మంచివాడిని చెడు మార్గంలో నడిపిస్తే, చెడు స్వభావం ఉన్నవాడిని పూర్తిగా బ్రష్టుణ్ణి చేసేస్తాయి .  వృత్తాసురుడు , తన అనుచరులైన  ‘కాలకేయులతో’ కలిసి చేయని అకృత్యం లేదు . దీంతో దేవతలు , మునులు సృష్టి కర్తయైన బ్రహ్మ దేవుణ్ణి ఆశ్రయించారు .  ఆయన తపోబలసంపన్నుడైన దధీచి మహర్షి తప్ప ఈ ముప్పు తప్పించగలవాడు లేడని సెలవిచ్చారు . చేసేదేమీలేక , వారందరూ కలిసి సరస్వతీ నదీ తీరాన తపోదీక్షలో ఉన్న దధీచి మహర్షిని వేడుకున్నారు . ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అని భావించే ‘మహర్షి’ కదా దధీచి . ఆయన వెంటనే దేహ త్యాగం చేశారు .  ఆయన వెన్నుముక ని ఆయుధంగా ఇంద్రుడు గ్రహిస్తే, మిగిలిన దేవతలు ఆయన ఆస్థిని ఆయుధాలుగా మలుచుకున్నారు . 

మేరుదండం అంటే, అది యోగ నిష్టా గరిష్ఠమైనది . భౌతికమైనదే అయినా , సహస్రారం  వరకూ వ్యాపించి  జ్ఞాన సముపార్జనకు యోగించినది , నియోగించినది . అందునా , అది దధీచిది. 

సరే, కథ ప్రకారం , వైరి గణాల మధ్య ఆయుధాలు ఉపయోగించకూడదు అనే ఒప్పందం ఆ కాలం నాటి నుండీ ఉంది . ఒకసారి దేవతలు - రాక్షసులూ ఆయుధాలు ఉపయోగించకూడదు అని నియమం పెట్టుకున్నారు . వారి ఆయుధాల్ని శాంతి కాముకుడైన దధీచి ఆశ్రమంలో దాచిపెట్టారు . సంవత్సరాల తరబడి అవి అలాగే ఆయన ఆశ్రమంలో ఉండిపోయాయి . దధీచి మహర్షి , ఆ ఆయుధాల్ని కరిగించి , ఆయుధ రసాపానం చేసేశారు . అవి జీర్ణం అయిపోయాయి కూడా ! దానివల్ల ఆయన శరీరానికి కొత్త శక్తి చేకూరింది . వృత్తాసురుణ్ణి సంహరించడానికి దేవతల వద్ద ఆయుధాలు లేకపోవడం కూడా ఒక కారణమే అయ్యింది . 

అలా దధీచి వెన్ను యముకతో తయారైన ఆయుధమే వజ్రాయుధం . ఇంద్రుడు ఆ వజ్రాయుధం సాయంతో వృత్తాసురుణ్ణి వధించాడు . కానీ చూడండి , రాజ్యం పోయినా , రాజుపోయినా , అనుచరగణాలు తమ అసురత్వాన్ని వదల్లేదు . కాలకేయులు తమ బుద్ధి మార్చుకోలేదు . పగలంతా సముద్రంలో దాక్కొని , రాత్రి పూట బయటికి వచ్చి తమ అకృత్యాలు కొనసాగించడం మొదలుపెట్టారు . ధర్మచరులైన ఋషులని చంపేస్తే, దేవతలకి హవిస్సులు అందకుండా పోతాయి . దాంతో వాళ్ళు శక్తి హీనులవుతారని తెలివిగా ఆలోచించి  దుశ్చర్యలకు తెగించడం మొదలుపెట్టారు .   నిశాచరులు కదా రాక్షసులు . 

అలా వశిష్టాశ్రమంలో  197 మందిని, చ్యవన మహాశి ఆశ్రమంలో 100 మందిని , భరద్వాజుని ఆశ్రమంలో 20 మందినీ తినేశారు . దీంతో ఆ మహర్షులతోపాటు  యమ, ఇంద్ర , అగ్ని, వరుణ , కుబేరాదులందరూ కలిసి   విష్ణుమూర్తిని ప్రార్ధించారు . విష్ణుమూర్తి ప్రత్యక్షమై , ‘అగస్త్యుడు మాత్రమే మిమ్మల్ని రక్షించగలవాడు . ఆయన సముద్రాన్ని పుక్కిట పట్టగలడు . అప్పుడు దేవతలకి ఆ కాలకేయులని సంహరించడం సాధ్యమైతుందని’ సెలవిచ్చారు . 

దీంతో తిరిగి వాళ్ళందరూ అగస్త్యుని సాయం అర్థించారు . అగస్త్యుడు సరేనన్నారు . ఇదిగో చూడమని , సముద్రాన్ని పుక్కిటపట్టి మింగేశారు . ఒక్క బిందెడు నీళ్లయినా గటగటా తాగలేమే ? ఆ మహానుభావుడు ఆ సముద్రాన్ని ఎలా పుక్కిట పట్టారో మరి ! ఆశ్చర్య పోయిన దేవతలు, ఋషులు ఆయన్ని వేనోళ్ళా పొగిడారు . ‘పీత సముద్రుడని’ అగస్త్యుని కీర్తించారు .  సరే, దాంతో సముద్రంలో నక్కిన ఆ కాలకేయులు బయటపడ్డారు . దేవతలు వారిని చంపేశారు . దాంతో వారి పీడ వదిలిపోయింది . 

మరి సముద్రం లేకపోతే ఎలా ? అగస్త్యుని పుక్కిటపట్టిన జలాన్ని విడువమన్నారు . ఆయనన్నారు ‘ అయ్యా ! ఆ జలం  జీర్ణమైపోయింది. ఇప్పుడది కిందినుండే గానీ, పైనుండి రాదన్నారు .  అదే మహా ప్రసాదం విడిచిపెట్టమన్నారు దేవతలు . అలా అగస్త్యుడు మూత్ర ద్వారం నుండీ విడిచి పెట్టడం వలన సముద్రం నీరు ఉప్పగా అవ్వడమే కాకుండా , అది స్నానానికి పనికిరానిదిగా మారిపోయింది . పుణ్య సమయాలలో తప్ప సముద్రజలాలు స్నానానికి పనికిరావు . తాగడానికి పనికిరావు .       

ఇది స్కాంద పురాణంలో చెప్పిన కథ .  చూడండి మన మహర్షులు ఎంతటి ద్రష్టలో . అగస్త్యుడు  సముద్రాన్ని ఔపోసన పట్టేశారు . జహ్నుమహర్షి గంగమ్మని ఔపోసన పట్టి , చెవి నుండీ విడిచి పెట్టాడు .  ఇంతటి జలం వారి శరీరంలో ఎలా పట్టింది ? యోగులంటారు అది మణిపూరక చక్రం (నాభి చక్రం ) మహిమ అని ! యోగులైన వారికే ఈ విషయం ఎరుక ! కానీ, కాలకేయులు వంటి రాక్షసులు , యుక్తితో వారినుండి బయటపడేసే అగస్త్యుల వంటి మిత్రులూ ఈ లోకంలో అక్కడక్కడా తారసపడడం మనకి అనుభవమే కదా !

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda