Online Puja Services

వైశాఖ ద్వాదశి మహత్యం !

13.58.82.79

చేసిన పుణ్యాలని కోటి రేట్లు వృద్ధి చెందించే వైశాఖ  ద్వాదశి మహత్యం !
- లక్ష్మి రమణ 

నారదుడు (Narada) అంబరీషునితో (Ambarisha) వైశాఖ మాస మహిమను వివరిస్తూ ఈ విధంగా చెప్పసాగాడు. “ఓ రాజా !  శృతదేవుడు శృతి కీర్తి మహారాజుకి  వైశాఖ మాసంలోని  శుక్లపక్షంలో వచ్చేటటువంటి సర్వపాప హారమైన ద్వాదశి తిథి గొప్పదనాన్ని వైభవోపేతంగా వివరించారు. ఆ తిథి గొప్పదనాన్ని, ఆచరించవలసిన పూజా కార్యక్రమాన్ని నీవుకూడా తెలుసుకొని, ఆ విధంగా చేసినట్లయితే, సర్వ శుభాలనూ పొందగలవు. కాబట్టి ఆ విశేషాలని వివరిస్తాను విను.” అంటూ వైశాఖ పురాణం (Vaisakha Puranam)లోని 29 వ అధ్యాయాన్ని ఇలా  చెప్పసాగారు. 

 శృతదేవుడు శృతి కీర్తి మహారాజుకి  వైశాఖ మాసంలోని  శుక్లపక్షంలో వచ్చేటటువంటి సర్వపాప హారమైన ద్వాదశి తిథి గురించి ఇలా చెబుతూ ఉన్నారు.  “ద్వాదశి (Dwadasi) నాడు శ్రీహరిని (Srihari) సేవించినట్లయితే మాటల్లో వర్ణించలేనంత పుణ్యం లభిస్తుంది.  ఎన్ని దానములు,  తపస్సులు, ఉపవాసాలు, వ్రతాలు, యాగాలు, చెరువులు  మొదలైనవి  తవ్వించడం చేసినప్పటికీ కూడా  అంతటి పుణ్యం లభించదు. ఈ రోజు ప్రాతఃకాల  స్నానం చేసినట్లయితే, గ్రహణకాలంలో గంగా తీరంలో 1000 గోవులని దానం ఇచ్చినటువంటి పుణ్యం వస్తుంది. ద్వాదశినాడు చేసే అన్నదానము విశిష్ట ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు యముని, పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువునుస్మరించి, పూజించి  జల కలశమును, ధ్యానాన్ని, పెరుగన్నాన్ని దానంగా ఇస్తే వచ్చే టటువంటి ఫలితము మాటలకు అందనిది. ఈరోజు సాలగ్రామ దానము, శ్రీహరిని పాలతో అభిషేకించటము, పంచామృతములతో అభిషేకం చేయడం, పానకాన్ని ఇవ్వడం, దోసపళ్ళ  రసాన్ని, చెరుకుగడలను, మామిడిపళ్ళను, ద్రాక్షా ఫలాలను దానం చేయడం ప్రశస్తమైనది.  

సర్వోత్తమమైన ఫలదాయకమైనటువంటి ఈ ద్వాదశి మహిమలు వెల్లడించే కథను నీకు వివరిస్తాను . పూర్వము కాశ్మీర దేశంలో దేవవ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి మాలినీ అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమెని సత్యశీలుడు అనే సౌశీల్యవంతునికిచ్చి  వివాహం చేశాడు.  సత్యశీలుడు తన భార్య అయిన మాలిని తన దేశానికి తీసుకొని వెళ్ళాడు.  అతడు మంచివాడే అయినప్పటికీ, ఆమె అంటే అతనికి పడేది కాదు.  ఆమెకు కూడా అతడంటే పడేది కాదు. ఈ విధంగా వారి దాంపత్యం పరస్పరము అనుకూలత లేకుండా ఉండేది. మాలిని భర్తను వశీకరణ చేసుకునే ఉపాయాలను చెప్పమని భర్తని గౌరవించడం తెలియని, పక్కదారులు తొక్కిన స్త్రీలను అడిగింది. వారు కూడా మేము మా భర్తలకు చేసిన దానిని నీకు చెబుతాము. మేము చెప్పినట్లు చెయ్యి.  మాకు కలిగినట్టే నీకు కూడా ఫలితం కలుగుతుందని, వశీకరణ కోసం మందులు మాకులు ఇచ్చే యోగిని వివరాలు తెలియజేశారు. 

 మాలిని వాళ్ళు చెప్పినట్టే ఆ యోగిని దగ్గరికి వెళ్లి ధనము ఇచ్చి తన భర్త తనకు వశమయ్యేటట్లు చేయమని అడిగింది. యోగినికి ధనమును , తన చేతి ఉంగరాన్ని ఇచ్చింది.  యోగిని ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించింది.  అన్ని ప్రాణులు కూడా స్వాధీనం అయ్యేటటువంటి చూర్ణాన్ని ఇచ్చింది. దానిని భర్త చేతి తినిపించి, ఆమె ఇచ్చిన  యంత్రాన్ని ధరించమది.  దీనివల్ల ఆమె భర్త చెప్పినట్టు వింటాడు అని బోధించింది. మాలిని వాటిని తీసుకొని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది. యోగిని చెప్పిన మంత్రాన్ని మననం చేసింది.  చూర్ణమును భర్త చేతి తినిపించింది.  యంత్రమును తాను కట్టుకుంది.  

కానీ ఆమె భర్తకు చూర్ణం తినడం చేత వ్యాధిగ్రస్తుడయ్యాడు. మరికొన్ని రోజులకు ఏమీ అనలేనివాడు, చేయలేనివాడు అయ్యాడు. దురాచారిణి అయినా, మాలిని తన  భర్త మరణించినట్లయితే తాను అలంకారాలు విడవవలసి వస్తుందని బాధపడింది.  మళ్లీ యోగిని వద్దకు వెళ్ళింది.  ఆమె మల్లి మరో విరుగుడు మందుని ఇచ్చింది.  దాన్ని భర్త చేతి తినిపించింది. దాంతో  అతని ఆరోగ్యం బాగుపడింది.  కానీ ఆమె కట్టుతప్పి స్వేచ్ఛగా తిరగడానికి అలవాటుపడింది.  దాంతో ఆమెకు అనేక వ్యాధులు కలిగి, రకరకాల బాధలు పడి, చివరికి మరణించింది. 

యమలోకాన్ని చేరి అనేకమైన చిత్ర విచిత్రమైన హింసలు అనుభవించింది.  అనేకసార్లు కుక్కగా జన్మించింది.  కుక్క రూపంలో ఉన్న ఉన్నప్పటికీ ఆమెకు వ్యాధులు తప్పలేదు. అలా సౌవీర దేశములో పద్మవంతుడు అనే బ్రాహ్మణుని ఇంట్లో పనిచేసే దాసీ ఇంట్లో  కుక్కగా ఉంది.  ఈ విధంగా 30 సంవత్సరాలు గడిచాయి.  అప్పుడు జరుగుతున్నా కాలంలో వైశాఖమాస సమయం వచ్చింది. 

ఆ మాసంలో ద్వాదశి నాడు, పద్మవంతుని కుమారుడు నదీ స్నానం చేసి, తిరిగి వచ్చి తులసి అరుగు వద్ద పాదాలు కడుక్కున్నాడు.  సూర్యోదయానికి ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క, ఆ తులసి అరుగు కింద పడుకొని ఉంది.  బ్రాహ్మణుడు పాదాలు కడుక్కున్న నీరు, ఆ అరుగుపైనుండి జారి, కింద పడుకున్న కుక్కపై పడింది.  ఆ పవిత్ర జల స్పర్శ చేత కుక్కకు పునర్జన్మ స్మృతి కలిగింది.  తాను చేసిన పాపాలకి ఎంతో పశ్చాత్తాపం కలిగింది. తాను చేసిన దోషాలు అన్నిటిని చెప్పి, “ఓ విప్రోత్తమా దీనురాలైన నాపైన దయవుంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్య కార్యాలను పుణ్యఫలాన్ని నాకు ధారపోసి రక్షించమని అనేక విధాలుగా వేడుకుంది.”  కుక్క మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు, అది చేసిన పాపాలను విని తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతః కాల నది స్నానము, పూజ, కథా శ్రవణము, జపము, తపస్సు, హోమము, ఉపవాసము మొదలైన పుణ్యకార్యాల పుణ్య ఫలాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. 

 కుక్క రూపంలో ఉన్న మాలిని మళ్లీ అనేక విధాలుగా దీనురాలై ప్రార్థించింది.  అయినప్పటికీ బ్రాహ్మణుని హృదయం కరగలేదు. ఆయన అంగీకరించలేదు. అప్పుడు ఆ కుక్క దీనంగా “దయాశాలుఁడవైన ఓ  పద్మవంత పుత్రా ! నన్ను దయ చూడు.  గృహస్తు తాను పోషించదగిన వారిని రక్షించడం నీ ధర్మము.  చీమలు, కాకులు, కుక్కలు, ఆ ఇంటిలోని బల్లులు తదితరములైన జీవులు ఆ ఇంటిలోని బలులను ఉచ్ఛిష్టములనూ తినడం చేత, వాటికి పోషకులే రక్షకులుగా ఉండాల్సిన ధర్మాన్ని కలిగి ఉన్నారు.  ఆవిధంగా నీచేత పోషించబడిన నేను నీకు రక్షించ తగిన దానిని.  జగత్కర్త అయినటువంటి శ్రీ విష్ణువు మనలని ఏవిధంగా అయిదు పోషిస్తూ ఉన్నారో , పోషకుడై రక్షిస్తూ ఉన్నారో , అదే విధంగా నేను కూడా నీచే రక్షించదగిన దానిని” అని బహు విధాలుగా ప్రార్థించింది. 

 పద్మవంతుడు కుక్క  మాటలు విని వెలుపలికి వచ్చి ఏం జరుగుతోందా అని పుత్రుడిని ఆరా తీశాడు. పుత్రుడు చెప్పిన వృత్తాంతాన్ని, కుక్క మాటలను విని ఆశ్చర్యపోయాడు.  పుత్రుడిని చూసి నాయన నువ్వు ఈ విధంగా అనకూడదు.  సజ్జనులు ఈ విధంగా మాట్లాడరు. పాపాత్ములు తమ సౌఖ్యముల కోసమే పాపములు చేసి అవమానాలు పొందుతూ  ఉన్నారు. సజ్జనులు పరోపకారం కోసమే పాటు పడతారు.  చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షాలు, సజ్జనులు పరోపకారార్థమే పాటుపడుతూ ఉంటారు. వారు చేసే పనులన్నీ కూడా పరలోక పరోపకారాలే. 

రాక్షస సంహారము కోసము దధీచి మహర్షి  దేవతలకు దయతో తన వెన్నెముకను దానం చేశాడు.  పావురాన్ని రక్షించడానికి శిబి చక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసాన్ని ఇచ్చాడు.  జీమూతవాహనుడనే రాజు సర్ప రక్షణ కోసం తనని తాను గబుడునకు అర్పించుకున్నాడు.  కాబట్టి భూసురుడు, భూమిపై ఉన్న దేవత, బ్రాహ్మణుడు దయావంతుడై ఉండాలి.  మనసు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము హర్షిస్తుంది.  మనసులో అటువంటి పరిశుద్ధత లేనట్లయితే దైవము హర్షించదు . చంద్రుడు ఉత్తమాదిభేదము లేకుండా వెన్నెలను అంతటా ప్రసరింప చేస్తున్నాడు కదా!  కాబట్టి దీనురాలై  అడుగుతున్న ఈ కుక్కకు కూడా నీ పుణ్య కార్యాల ఫలాన్ని ఇచ్చి ఉద్ధరించు” అని పలికాడు. 

 అప్పుడు ఆ పద్మవంతుని కొడుకు ద్వాదశి నాడు తాను చేసినటువంటి పుణ్య కార్యాల ఫలాన్ని కుక్కకు ధారపోసి, “నువ్వు పాపములు లేని దానివే శ్రీహరి లోకానికి పొమ్మని పలికాడు.”  అతడు ఆ విధంగా చెబుతూ ఉండగా ఆ కుక్క తన రూపాన్ని విడిచి దివ్యాభరణ  భూషితురాలైన సుందరిగా నిలిచింది.  బ్రాహ్మణునికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి, తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేస్తూ దివ్య విమానాన్నీ అధిరోహించి వెళ్లిపోయింది.  

స్వర్గములో అనేక భోగాలను అనుభవించి, ఊర్వశిగా భూలోకములో నర నారాయణ స్వరూపుడైనటువంటి దైవము నుంచి ఆవిర్భవించి ప్రసిద్ధి పొందింది.  యోగులు మాత్రమే పొందగలిగినటువంటి అగ్ని లాగా ప్రకాశించేటటువంటి సర్వోత్తమమైన, ఎటువంటి వారి కైనా మొహాన్ని కలిగించేటటువంటి పరమార్థ స్వరూపమైన సౌందర్యాన్ని పొందింది. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందింది. 

 పద్మవంతుడు, ఆయన పుత్రుడు ధారపోసిన ఆ ద్వాదశి తిధి పుణ్యము అంత గొప్ప ఫలదాయకమైనది.  చేసినటువంటి పుణ్యములను వృద్ధి చెందిచే విష్ణు ప్రీతికరమైన పుణ్య తిథిగా లోకంలో ప్రసిద్ధి పొందింది. ఆ ద్వాదశికి కొన్ని కోట్ల సూర్య చంద్ర గ్రహణముల కంటే, సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్య రూపం కలదై త్రిలోక ప్రసిద్ధిని పొందింది.” అని శృతి దేవుడు కృత కీర్తికి వైశాక శుద్ధ ద్వాదశి మహిమను వివరించాడని” నారదుడు అంబరీషునికి  వైశాఖ మహిమను వివరిస్తూ తెలియజేశాడు. 

వైశాఖ పురాణం 29వ అధ్యాయం సంపూర్ణం . 

సర్వం శ్రీ హరి పాదారవిందార్పణమస్తు !

Vaisakha Puranam, Vaisakha Dwadasi Mahatyam

#vaisakhapuranam #vaisakhadwadasi

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha