Online Puja Services

యముణ్ణి సంహరించబోయిన సుదర్శనం

3.138.125.2

యముణ్ణి సంహరించబోయిన సుదర్శనం ! అవమానభారంతో కృంగిన యముడు ఏం చేశాడు ? 
- లక్ష్మి రమణ 

నారదుడు అంబరీషుడితో ఈ విధంగా చెబుతున్నారు. శృతకీర్తి మహారాజుకు శృతదేవ మునీంద్రుడు  17వ అధ్యాయానికి సంబంధించిన ఆ తర్వాతి కథను ఈ విధంగా చెప్పసాగారు. “వాయువు చేసినటువంటి ఉపచారాల వల్ల, ఊరడింపుల వల్ల కొంత తేరుకున్న యముడు బ్రహ్మని  ఉద్దేశించి ఈ విధంగా చెప్పారు. 

 “ఓ స్వామీ! సర్వలోక పితామహా , బ్రహ్మ, నా మాట వినండి.  నేను నా కర్తవ్యాన్ని నిర్వహించకుండా నివారించబడ్డాను.  నేను చేయాల్సిన పనిని చేయలేకపోవడం చేత మరణము కంటే ఎక్కువ బాధను అనుభవిస్తున్నాను. సర్వ సృష్టి విధాయకా! వినండి.  ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతాన్ని తీసుకుంటూ చేయాల్సిన కర్తవ్యాన్ని చేయనట్లయితే, అతడు కొయ్యి పురుగు మొదలైన జన్మలను పొందుతాడు.  అతి తెలివితో లోభము పొంది యజమాని ధనముతో పోషించబడుతూ, కర్తవ్యాలను నిర్వహించినట్లయితే, అతడు భయంకర నరక లోకములో 300 కల్పాలు చిరకాలము ఉండి, మృగాది జన్మలను పొందుతాడు.  అధికారి నిరాశతో నిండి తన కర్తవ్యాన్ని నెరవేర్చినట్లయితే, ఘోర నరకములలో చాలా కాలముండి కాకి మొదలైన జన్మలను పొందుతాడు. తన కార్యాన్ని సాధించడానికి యజమాని చెప్పిన పనిని నాశనము చేసేవాడు.  ఇంట్లో తిరిగే ఎలుక జన్మనెత్తి 300 కల్పాల కాలము బాధపడతాడు. సమర్ధుడైనప్పటికీ, తన కర్తవ్యాన్ని చేయక ఇంట్లో ఉండకుండా ఉండేటటువంటి వాడు పిల్లిగా జన్మిస్తాడు.

ప్రభూ! మీ ఆజ్ఞను పాటిస్తూ నేను జీవుల పాప పుణ్యాలను నిర్ణయించి విభజించి, వారికి తగినట్టుగా పాప పుణ్యాలను బట్టి పాలిస్తూ ఉన్నాను. ధర్మశాస్త్ర నిపుణులైనటువంటి మునులతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు మీ ఆజ్ఞను పూర్వం లాగా పాటించలేని స్థితిలో ఉన్నాను. అందుకు కారణం కీర్తిమంతుడు అనేటటువంటి రాజు. ఆ రాజు సముద్ర పర్యంతము ఉన్నటువంటి భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగా పరిపాలిస్తూ ఉన్నాడు. అన్ని ధర్మాలను విడిచిన వారు, తండ్రిని పూజించని వారు, పెద్దలను గౌరవించని వారు, తీర్థయాత్రలు మొదలైన మంచి పనులు చేయనివారు, యోగ సాంఖ్యములను విడిచినటువంటి వారు, ప్రాణాయామం చేయని వారు, హోమమును స్వాధ్యాయమును విడిచిపెట్టిన వారు ఈ విధమైనటువంటి అనేక పాపములను చేసినటువంటి వారందరూ కూడా వైశాఖమాస వ్రత ధర్మాలను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకాన్ని చేరుతూ ఉన్నారు. వైశాఖ వ్రతాన్ని ఆచరించినటువంటి వారి భార్య వైపు వారు, తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టిన వారు, వీరందరూ కూడా నేను రాయించిన పాప పట్టికలోని యమ పాపాలను తుడిచి వేసే విధంగా చేసి విష్ణులోకాన్ని పొందుతున్నారు. ఇటువంటి దుఃఖములను చూసి చూసి నా తల పగిలిపోతోంది.  సామాన్యంగా చేసిన కర్మ ఆ ఒక్కడికే చెందుతుంది.  దానివల్ల పుణ్య పాపములలో ఏదో ఒక దాన్ని వాడు అనుభవిస్తాడు.  కానీ వైశాఖమాస వ్రతాన్ని ఒక్కడు చేసినట్లయితే అతడే కాక అతని తండ్రివైపు వారు తల్లివైపు వారు మొత్తము 26 తరాల వారు- వారు చేసుకున్న పాపాలు పోగొట్టుకుని విష్ణు లోకాన్ని పొందుతున్నారు.  వీరే కాక వైశాఖ వ్రతాన్ని చేసినటువంటి వారి భార్యల వైపు వారు భర్తల వైపు వారు విష్ణు లోకాన్నే పొందుతున్నారు. నీ వైశాఖ వ్రతాన్ని చేసిన వారు వారు ఎటువంటి వారైనప్పటికీ కూడా నన్ను కాదని కనీసము 21 తరముల వారితో విష్ణు లోకాన్ని పొందుతున్నారు. 

వైశాఖ వ్రతాన్ని చేయకుండా, తీర్థయాత్రలు దానాలు తపస్సులు, వ్రతాలు ఈ విధంగా ఎన్ని చేసినప్పటికీ కూడా వైశాఖ వ్రతాన్ని చేసిన వారి లాగా విష్ణు లోకాన్ని పొందలేకపోతున్నారు.  ప్రయాగ పుణ్యక్షేత్రమున పడినవారు, యుద్ధములో మరణించిన వారు, బృగుపాతము చేసిన వారు కాశీ క్షేత్రములో మరణించిన వారు వీరు ఎవ్వరు కూడా వైశాఖ వ్రతం చేసిన వారు పొందుతున్నటువంటి పుణ్యాన్ని పొందటం లేదు.  అంటే ప్రయోగా క్షేత్రంలో నదీ ప్రవాహములో దునికి మరణించి కోరిన కోరికలు తీరతాయని అంటారు.  అటువంటి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతం చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యము లభిస్తుంది. 

కాబట్టి వైశాఖమాసంలో ప్రాతఃకాల స్నానము చేసి, విష్ణు పూజలు చేసి, వైశాఖ మహత్యాన్ని విని యధాశక్తి దానములను చేసిన జీవులు సులభముగా విష్ణులోకాన్ని పొందవచ్చు.  వైశాఖ వ్రతాన్ని చేసినటువంటి పాపాత్ములు కూడా విష్ణు లోకాన్ని చేరడము యుక్తమని నాకు అనిపించడం లేదు.  కీర్తిమంతుని ఆజ్ఞ చేత, వైశాఖ వ్రతాన్ని పాటించి మంచి కర్మలు చేసిన వారు, చేయనివారు శుద్ధులు అపరిశుద్ధులు వీరు వారు అననేల అందరూ కూడా శ్రీహరి లోకాన్ని పొందుతున్నారు.  ఓ సృష్టికర్తా ! జగత్ ప్రభూ! మీ ఆజ్ఞను పాటిస్తున్న నన్ను, నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు, మీకు కూడా శత్రువులే! కాబట్టి నువ్వు కీర్తిమంతుడిని శిక్షించుట ఉత్తమమైనది. మీరు ఇలాగే  ఊరుకున్నట్లయితే, నరకము స్వర్గము మొదలైన లోకములన్నీ కూడా శూన్యములై పోతాయి. 

ఓ దేవదేవా ! పలుమార్లు తుడవబడినటువంటి ఈ పాప పట్టిక, యమదండము వీటిని నీ పాదాల వద్ద వదిలేస్తున్నాను. వీటిని ఏం చేస్తారో మీ ఇష్టము.  కీర్తిమంతుని వంటి కుమారుని అతని తల్లి ఎందుకు ఏ విధంగా కన్నదో నాకు తెలియడం లేదు.  శత్రువుని గెలవని నాబోటి వాని జన్మ వ్యర్థము.  మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయం పొందని పుత్రుని కన్న తల్లి శ్రమ అంతా కూడా వ్యర్థమే కదా !  శత్రు విజయాన్ని సాధించి,  కీర్తి పొందిన వాని జన్మ ధన్యమైనది.  కీర్తిమంతుని వంటి పుత్రుని కన్నవాని తల్లి ఒక్కటే ఈ జగతిన వీరమాత.  ఇందులో సందేహం లేదు.  కీర్తిమంతుడు సామాన్యుడు కానేకాడు. నా రాతనే మార్చిన వాడు కదా! ఈ విధంగా నా రాతను ఎవరు ఇంతవరకు మార్చలేదు.  ఇది అపూర్వము.  అందుచేత అందరి చేత వైశాఖ వ్రతాన్ని ఆచరింపజేసి, స్వయంగా హరి భక్తుడై ప్రజలందరినీ విష్ణు లోకాన్ని పంపినవాడు పేరుని సార్థకం చేసుకొన్నా కీర్తిమంతుడే ! ఇటువంటి వారు సృష్టిలో మరి ఇంకెవరూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వెళ్లబోసుకున్నాడు. 

వైశాఖ పురాణం 17వ అధ్యాయం సంపూర్ణం !! 

Vaisakha Puranam

#vaisakha #puranam #vaisakhapuranam

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha