Online Puja Services

పిశాచ రూపాలకి కూడా ఉత్తమగతులు అనుగ్రహించే వైశాఖ వ్రత మహత్యం .

18.223.196.211

పితృదేవతలని ఉధ్ధరించి, పిశాచ రూపాలకి కూడా ఉత్తమగతులు అనుగ్రహించే వైశాఖ వ్రత మహత్యం .
- లక్ష్మి రమణ 

శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకి వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించకుండా , పిశాచజన్మని పొందిన వారిని గురించిన కథని ఈ విధంగా వివరించసాగారు.  వైశాఖ మాస వ్రతము ఎంతటి పుణ్య ప్రదమో తెలుసుకోవడానికి ఈ ఒక్క కథా సరిపోతుంది . వైశాఖపురాణం లోని ఎనిమిదవ అధ్యాయాన్ని పారాయణ చేద్దాం . 

ఓ రాజా ! వినండి. పూర్వము రేవానది తీరంలో మా తండ్రిగారు మృతి చెంది, పిశాచ రూపాన్ని పొందారు.  ఆకలి దప్పికల వల్ల బాధపడుతూ తన మాంసమునే తాను తింటూ, శుష్కించిన శరీరముతో, నీడలేని బూరగ చెట్టు దగ్గర నివసిస్తూ దుర్భరమైన స్థితిని పొందారు.  పూర్వము చేసిన పాపాల వల్ల, ఆయనకీ ఆకలి దప్పిక బాధ మాత్రమే కాక, కంఠంలో సన్నని రంద్రం కూడా ఏర్పడింది.  అది గాయమై మిక్కిలి బాధిస్తూ ఉండేది. దానివల్ల అక్కడికి  దగ్గరలో ఉన్న చెరువులోని చల్లని నీరు కూడా, ఆయన  తాగగానే కాలకూట విషము లాగా బాధపెడుతూ ఉండేది. 

రాజా!  మా తండ్రి గారి పరిస్థితి ఇలా ఉండగా, ఒకసారి నేను గంగాయాత్ర చేయాలని కోరికతో ప్రయాణం చేస్తూ, దైవీకంగా ఆ ప్రదేశానికి వెళ్లాను.  నీడలేని బూరుగు చెట్టు పైనుండి ఆకలి దప్పికల బాధని భరించలేక తన మాంసాన్నే తాను తింటూ దుఃఖ భారంతో కంఠంలో ఉన్న బాధని అనుభవించలేక అరుస్తున్న ఆ పిశాచాన్ని చూసి ఆశ్చర్యపోయాను.  పిశాచి రూపంలో ఉన్న నా తండ్రి, నన్ను చూసి చంపడానికి వచ్చారు . కానీ నా ధార్మిక ప్రవర్తనా  బలం నన్ను ఆ క్షణం కాపాడింది.  దాంతో ఆయన నన్నేమీ చేయలేకపోయారు. 

నేను కూడా ఆయన్ని చూసి జాలిపడి, భయపడకు! నీకు నావల్ల ఏ భయము లేదు.  నువ్వు ఎవరివి? నీకు ఇలాంటి బాధ కలగడానికి కారణం ఏంటి? వెంటనే చెప్పు . నిన్ను ఈ కష్టం నుంచి విడిపిస్తాను.  అని పలికాను. 

 నేను ఆయన పుత్రున్నేనని ఆయన గుర్తించలేకపోయారు. నేను కూడా నా తండ్రి అని ఆయన్ని గుర్తించలేకపోయాను.  అప్పుడు ఆ పిశాచి రూపంలో ఉన్న ఆయన ఈ విధంగా చెప్పారు.  నేను భూవరము అనే పట్టణంలో నివసించే మైత్రుడు అనే సంకృతి గోత్రీకుణ్ణి.  అన్ని విద్యలని నేర్చుకున్న వాడిని.  అన్ని తీర్థాలలో స్నానం చేశాను.  సర్వదేవతలను సేవించాను.  కానీ నేను వైశాఖ మాసంలో కూడా అన్నదానాన్ని ఎవరికీ చేయలేదు.  లోభించాను. ఆ కాలములో వచ్చిన వారికి భిక్షనైనా ఇవ్వలేదు.  కాబట్టే నాకు ఈ పిశాచి రూపం వచ్చింది. ఇదే నా ఈ దురవస్థకు కారణము. నాకు శృతదేవుడనే కొడుకు ఉన్నాడు. అతడు ప్రసిద్ధి కలిగిన వాడు.  వైశాఖ మాసంలో కూడా అన్నదానము చేయలేకపోవడం చేత పిశాచ రూపాన్ని పొందాను.  నేనీవిధంగా బాధపడుతున్నానని ఆయనకి చెప్పండి . మీ తండ్రి నర్మదా తీరంలో పిశాచమై ఉన్నాడు, సద్గతిని పొందలేదు, బూరుగు చెట్టుపై ఉన్నాడు, తన మాంసాన్ని తానే తింటూ బాధపడుతున్నాడని చెప్పండి. వైశాఖమాస వ్రతాన్ని పాటిస్తూ నాకు జలతర్పణాన్ని ఇచ్చి, సద్బ్రాహ్మణునికి అన్నదానము చేసినట్లయితే, నేను ఈ బాధ నుంచి విముక్తిని పొందుతాను.  శ్రీ మహా విష్ణువు సాన్నిద్యాన్ని పొందుతాను.  కాబట్టి ఆ విధంగా చేయమని నా పుత్రునికి చెప్పండి.  నాయందు దయ ఉంచి నాకీ సాయాన్ని చెయ్యండి అని అభ్యర్థించారు.  నీకు సర్వసుభములు కలుగుతాయని నా పుత్రుడుతో చెప్పమని అభ్యర్థించారు.  

అప్పుడు నేను నా తండ్రిని గుర్తించి ఆయన పాదాలకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చాలా సేపు బాధపడ్డాను. నన్ను నేను నిందించుకున్నాను.  కన్నీరు పెట్టుకున్నాను.  ఓ తండ్రి! నేనే శృతదేవుడ్ని.  దైవికముగా ఇక్కడకు వచ్చాను.  తండ్రి ఎన్ని కర్మలు చేసినా  పితృదేవతలకు సద్గుతని కలిగించలేక పోతే ఆ కర్మలు నిరర్థకాలు.  నీకీ బాధ నుంచి విముక్తి కలిగించడానికి నేను ఏం చేయాలో చెప్పు.  అంటూ ప్రార్థించాను.  అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి, మరింత దుఃఖపడ్డారు.  కొంతసేపటికి ఊరడిల్లి  మనసు కుదుటపరచుకుని ఈ విధంగా చెప్పారు.  

నాయనా ! నువ్వు తలపెట్టిన యాత్రను పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళు.  సూర్యుడు మేషరాశిలో ఉండగా, వైశాఖమాసంలో పూజ చేసి అన్నాన్ని శ్రీమహావిష్ణువుకు నివేదించి, ఉత్తమ బ్రాహ్మణునికి దానం ఇవ్వు.  అందువల్ల నాకే కాదు, మన వంశము వారందరికీ కూడా ముక్తి కలుగుతుంది.  కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పారు. 

ఆయన సలహాని అనుసరించి  నేను కూడా నా తండ్రి అనుజ్ఞని అనుసరించి యాత్రలు చేసి నా ఇంటికి తిరిగి వచ్చాను.  మాధవుడికి ప్రీతికరమైన వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని చేస్తూ, నా తండ్రి చెప్పినట్టుగా శ్రీమహావిష్ణువును పూజించి, ఆయనకీ నివేదించిన అన్నాన్ని  ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చాను.  అందువల్ల నా తండ్రి పిశాచ రూపము నుంచి విముక్తుడై, నా దగ్గరికి వచ్చి, నా పితృభక్తికి మెచ్చుకుని ఆశీర్వదించి, దివ్య విమానాన్ని అధిరోహించి విష్ణు లోకాన్ని చేరి, అక్కడ శాశ్వత స్థితిని పొందారు.  కాబట్టి అన్నదానము అన్ని దానాలలో ఉత్తమము.  శాస్త్రములలో ఇదే చెప్పబడింది.  ధర్మయుక్తమైనది.  సర్వధర్మ సారమే అన్నదానము.  

ఓ మహారాజా! నీకు ఇంకేం కావాలో అడుగు చెబుతాను అని శ్రుతదేవ మహర్షి  శ్రుతకీర్తి  మహారాజుకు వివరించారని నారద మహర్షి అంబరీష మహారాజుకి చెప్పారు. 

వైశాఖపురాణం లోని ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం !

శ్రీ విష్ణు చరణారవిందార్పణమస్తు !!

 

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha