Online Puja Services

స్వయంగా మహాలక్ష్మి, విష్ణుమూర్తితో కలిసి తిరుగాడే మాసము వైశాఖమే !

18.220.136.165

స్వయంగా మహాలక్ష్మి, విష్ణుమూర్తితో కలిసి తిరుగాడే  మాసము వైశాఖమే !
- లక్ష్మి రమణ 

“వైశాఖమాసము ఇతర మాసాల కంటే చాలా గొప్పదని, తపస్సుచేయడం కన్నా కూడా ఉత్తమమైన పుణ్యం కలుగుతుందని మీరు చెబుతున్న విషయము నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. తపస్సుని మించిన గొప్పదనం ఏ కారణం వల్ల వైశాఖమాసములో  ఆచరించే వ్రతము వల్ల సాధ్యం అవుతుంది? తెలియజేయండి మహర్షీ” అని అంబరీష మహారాజు నారద మహర్షిని వేడుకున్నాడు.  అప్పుడు నారద మహర్షి మహారాజా శ్రద్ధగా వినండి అంటూ వైశాఖ పురాణంలోని ఐదవ అధ్యాయాన్ని ఈ విధంగా చెబుతున్నారు. 

కల్పాంత కాలంలో శేషసాయి అయినటువంటి శ్రీ మహా విష్ణువు లోకములన్నింటినీ కూడా తన ఉదరములో నిలుపుకొని ప్రళయ కాలసముద్రంలో శయనించి ఉన్నారు.  జీవరూపములో అనేకత్వమును పొందిన ఆ పరమాత్మ తిరిగి ఏకత్వాన్ని పొంది ఆ సృష్టిని  తనలోనే లయము చేసుకొని ఉన్నారు.  ఆ విధంగా నిద్రిస్తున్న శేషసాయిని  వేదములు మేల్కొల్పాయి.  దయానిధి అయిన శ్రీమన్నారాయణడు వేదముల మేలుకొలుపుని ఆదరించి నిద్రనుండి లేచారు . తన ఉదరములో ఉన్న సర్వ జీవలోకములను రక్షించాలని, తిరిగి సృష్టిని ఆరంభించాలని నిర్ణయించుకున్నారు . 

ఆ విధమైన కోరిక కలగగానే, సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుంచి బయల్పడింది.  ఆ పద్మము నుండీ బ్రహ్మదేవుడు ఆవిర్భవించారు. ఆయనతోపాటు పదునాలుగు  భవనములు కూడా సృష్టి చేయబడ్డాయి.  భిన్న విభిన్నములైన కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలమైన త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును పరమాత్మ తన సంకల్ప మాత్రం చేత సృష్టించారు.  

వీటితోపాటుగా పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణనుడు తన ఆజ్ఞా రూపాలుగా చతుర్వేదాలను, తంత్రములను, సంహితలను, శృతులను, పురాణ, ఇతిహాసాలను, ధర్మరక్షణ కోసం సృష్టించారు.  వీటిని ప్రవర్తింప చేయడానికి ఋషులను కూడా సృష్టించారు.  ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మాలను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరిస్తూ సర్వేశ్వరుడైన శ్రీమహావిష్ణువుకు సంతోషము కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. 

ఇదిలా ఉండగా, సర్వోత్తమములైనటువంటి తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించే ప్రజలను వారి ధర్మాచరణని తానే స్వయంగ చూడాలని భగవంతుడు తలపోశారు. అందుకు ఏ కాలము మంచిదా అని ఆయన యోచించారు. అప్పుడాయన ఈ విధంగా ఆలోచించారు. 

“ తాను సృష్టించిన వర్షముల వలన బాధలు ఉండుట చేత పీడితులైన ప్రజలు ధర్మాచరణము సరిగ్గా చేయలేరు.  అటువంటి వారిని చూసిన తనకు తృప్తి కలగదు సరి కదా, కోపం కూడా రావచ్చు.  కాబట్టి వర్షాకాలంలో ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలములో వారి కృషి లేనిదే వ్యవసాయము పూర్తికాదు.  కొందరు అప్పుడే పండిన పళ్ళను తింటూ ఉంటారు. నేత్రవ్యాధులు, చలి మొదలైన వాటిచేత పీడించబడుతూ ఉంటారు.  ఇటువంటి పరిస్థితులలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలించడం సరైన పని కాదు. ఇక హేమంత రుతువులో చలి చాలా ఎక్కువగా ఉండటం చేత ప్రజలు సూర్యోదయానికి ముందుగా లేచి స్నానాధికాలు ముగించుకోవడం సాధ్యమయ్యే పని కాదు.  చలిగాలికి చిక్కి ప్రాతః కాలములో  లేవ లేని వారిని చూడడం చేత నాకు కోపం చాలా ఎక్కువగా రావచ్చు.  నేను సృష్టించిన ప్రజల పైన నాకే కోపం వస్తే అది వారికి శ్రేయస్కారము కాదు. శిశిర ఋతువులో ప్రజలని పరిశీలిద్దాం అంటే, చలి ఎక్కువగా ఉండడం చేత ఆ కాలములో ప్రజలు సూర్యోదయానికి ముందుగా లేవలేరు.  తమకు కావలసిన ఆహారాన్ని వండుకోవడానికి కూడా సోమరులై పండిన పళ్ళను తింటూ ఉంటారు . చలికి భయపడి స్నానం చేయడమే మానివేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. అటువంటివారు చేయగలిగినటువంటి భక్తి యుక్తమైన కర్మ కలాపము ఏ విధంగా ధర్మాత్మకమై ప్రవర్తించ గలరు ? 

ఈ విధంగా చూసినట్లయితే వర్షాకాలం నుంచి శిశిరము వరకు ఉండే కాలములో వాతావరణంలో ప్రకృతి చేత కల్పించబడినటువంటి మార్పుల వల్ల ప్రజలు భక్తి పూర్వక కర్మ ధర్మానుష్టానము చేయలేరు.  వారి నుంచి ఇటువంటి భక్తి పూర్వక కర్మ ధనుష్ఠ ధర్మానుష్టానాన్ని ఆశించలేము. 

కానీ  వసంత కాలము స్నానము దానములకు భోగములకు బహువిధములైన ధర్మానుష్టానములకు అనుకూలమైనటువంటి కాలము. అదే విధంగా ప్రాణదారులకు ఆవశ్యకములైన ఆహార పదార్థాలు కూడా సులభంగా లభ్యం అవుతాయి. సులభమైన ఏ వస్తువు చేతనైనా సంతృప్తిని పొందవచ్చు. ఈ విధంగా సర్వ ప్రాణిగతమైన జీవాత్మకు ఏదో విధంగా నీటిని, పళ్ళను దానము చేసి సంతృప్తిని కలిగించి, ఆ విధంగా సర్వవ్యాపినైన నాకు కూడా సంతృప్తిని కలిగించే అవకాశం ప్రజలకు సులభ సాధ్యమై ఉంటుంది. ధర్మానువర్తులైన భక్తులు ఎల్లప్పుడూ కూడా కర్మపరాయణులై ధర్మ వ్రతాన్ని ఆచరిస్తారు.  వసంతకాలములో సర్వ వస్తువులు సులభముగా లభ్యం  అవ్వడం చేత అంగవైకల్యము కలవారు, మహాత్ములు మొదలైన సర్వజనులకు ఈ ధర్మాచరణ సులభంగా ఉంటుంది .  దానధర్మాదులకు ప్రజలు కష్టపడాల్సిన అవసరం లేదు . పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలం, చందనము సమర్పించడం,  పాదప్రక్షాళనము చేయడం వంటివి చేయవచ్చు. 

 దానం చేసేటప్పుడు వినయము భక్తి మొదలైన సుగుణాలతోటి కూడి ఉండాలి.  దానము తీసుకునేటటువంటి వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే అనే భక్తి భావన అన్నింటికంటే ముఖ్యము.  అటువంటి భావననే విలువ కట్టరానంత పుణ్యాన్ని ఇస్తుంది.  అని భక్తసులబడు దయాశాలి అయినా శ్రీమహావిష్ణువు ఆలోచించి, శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారము చేస్తూ బయలుదేరారు. ఆ విధంగా ఆయన  పుష్పాలు ఫల పూర్ణములైనటువంటి అడవులను, పర్వతాలను, లతా తరువులను, జల పూర్ణములైన నిర్మల ప్రవాహము కలిగిన నదులను, తుష్టి , పుష్టి కల ప్రజలను చూశారు.  ఉత్తములైనటువంటి మునుల ఆశ్రమాలను, అందులో ఉన్న ధర్మ కర్మానుష్టాన పరులైన మునులను వన గ్రామ నగర వాసులై భక్తి యుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించే ముగ్గులు మొదలైన వాటితో కూడి ఉన్న ఇళ్ల ముంగిళ్లను,ఫల పుష్పాదులతో వ్రతాలని ఆచరిస్తూ భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమీతుడై తిలకించారు.  భక్తి యుక్తులై, వినయ గుణములతో వ్రతాలని ఆచరిస్తూ, యథా శక్తిగా దాన ధర్మాలను చేస్తూ, అతిధి అభ్యాగతులను ఆదరిస్తూ, ఉన్న ధర్మాత్ములను, పుణ్యాత్ములను, ధర్మ కర్మ పరాయణులనూ , మహాత్ములను అందరినీ చూశారు. 

 అభ్యాగతుడై అతిథిగా బహురూపములతో తానె వచ్చి అనేక రూపాలతో  ఈ విధంగా ప్రజల ధర్మకర్మానుష్టానములలో పాలుపంచుకున్నారు.  ఆ విధంగా మహావిష్ణువు అటువంటి భక్తులకి అఖండ పుణ్యాన్ని, అఖండ భోగభాగ్యాలను, సర్వసంపదలను చివరికి ముక్తిని, స్వయంగా అడగ కుండానే వారి వారి భక్తి యుక్తులకు దానధర్మాములకు పూజారికాలకు సాఫల్యాన్ని ఇస్తూ అనుగ్రహించారు. దురాచారులు, సోమరులు మొదలైన వారు కూడా సత్కర్మలను ఆచరించి యధాశక్తి దాన ధర్మాలు చేసినట్లయితే అటువంటి వారి పాపములు కూడా నశింప చేసి పుణ్యాన్ని లేక సుఖాలను ఇస్తుంది ఈ వైశాఖ మాస వ్రతం . 

ఆ విధంగా కాక దుష్టులై, సోమరులై, నిర్లక్ష్యంగా ఉన్నవారు ఎటువంటి వారైనా కూడా ఏదోచితంగా శిక్షలని అనుభవిస్తారు.  కాబట్టి సోదర మానవులారా! మనము ఎలాంటి వారమైనా సరే, మన శక్తి ఏ విధమైనదైనా సరే, నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువును ఆరాధించి యధాశక్తి దానధర్మాలను ఆచరించి శ్రీమహావిష్ణువు దయను పరిపూర్ణంగా పొందడం మన కర్తవ్యం.  కాబట్టి చంచలమైన మనసును అదుపులో ఉంచుకుని యధాశక్తిగా పూజనీ, దానధర్మాలను భక్తి, వినయము శ్రద్ధ ఆసక్తులతో బలవంతముగా అయినా సరే ఆచరించి శ్రీహరి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించడం మన ముఖ్య కర్తవ్యము, ధర్మము, బాధ్యత కూడా. 

 ఈ విధంగా ఈ కాలంలో లోకసంచారము చేసే లక్ష్మీ సహితుడైన శ్రీమహావిష్ణువుని స్తుతిస్తూ ఆయన వెంట సిద్ధులు, చారలు, గంధర్వులు, సర్వదేవతలు కూడా ఉంటారు.  తమ తమ ధర్మములను ఆచరిస్తూ భక్తితో వినయముతో దానధర్మములను వ్రతములను చేస్తూ అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని అనుగ్రహిస్తూ ఉంటారు.  శ్రీహరి వైశాఖ మాసంలో వ్రతాచరణము చేసిన వారిని ఏ విధంగా అయితే రక్షిస్తారో అదే విధంగా దానధర్మాధికములు చేయని వారిని గమనించి వారికి రోగాలు విచారములు మొదలైన వాటిని  ప్రసాదించి శిక్షిస్తారు.  ఈ  మాసంలో తనను గాని, పరమేశ్వరుని గాని, ఇతర దైవతములను, సజ్జనులను పూజించినట్లయితే వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి, సంతుష్టుడై శ్రీహరి వరములను అనుగ్రహిస్తారు. 

 ఈ విధంగా వైశాఖ వ్రతాన్ని ఆచరించడం వలన శ్రీమహావిష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మి సర్వదేవతలు సంప్రీతులై వరాలను అనుగ్రహిస్తారు.  సపరివారముగా వచ్చిన మహారాజును నగరము, గ్రామాలు, వనములు, పర్వతములు, నదీ తీరాలు, మొదలైన చోట నివసించే ప్రజలు దర్శించి యధాశక్తిగా తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మొదలైన వాటిని సమర్పించి, మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా ఉన్నాము, అనుగ్రహించమని ప్రార్థించినట్లయితే మహారాజు వారి పన్నులను తగ్గించడం, సౌకర్యాలను కల్పించడం, మొదలైన వాటిని ఏ విధంగా చేయిస్తారో -  అదే విధంగా శ్రీమహావిష్ణువు తనకు ప్రీతికరమైన వైశాఖమాస వ్రతాన్ని ఆచరిస్తూ సద్బ్రాహ్మణులను, అతిధులను, అభ్యాగతులను దైవ భావనతో ఉపచారమును చేసి యథా శక్తిగా దానధర్మములను ఆచరించిన వారిని అనుగ్రహించి, కోరిన కోరికలను ఇచ్చి రక్షిస్తారు.  పరివార దేవతలు  కూడా శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన వారికి తాము కూడా యధోచితముగా వరాలను ఇచ్చి రక్షిస్తారు.  

కాబట్టి ఓ మహారాజా ఈ వైశాఖ మాస వ్రత సమయములో వ్రతాన్ని యధాశక్తి ఆచరించి, శ్రీమహావిష్ణువును ధ్యానించి, పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందాలి. కాబట్టి వైశాఖమాసము ధర్మరక్షకుడైన శ్రీమహావిష్ణువు ప్రజలను పరీక్షించే కాలమని కూడా గుర్తుంచుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి.  అందువల్లనే వైశాఖమాసము మాసములన్నింటి కన్నా కూడా మరింత ఉత్తమమైనదయ్యింది.  అని నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖమాస విశిష్టతను వివరించారు. 

వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం. 

#vaiskha #vaisakhamasam #vishnu #lakshmi #mahalakshmi #mahavishnu

Tags: vaisakha, masam, vishnu, maha, lakshmi, mahalakshmi

 

#vaisakhapuranam

Vaisakha Puranam

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha