Online Puja Services

కార్తీకపురాణము - అష్టాదశాధ్యాయము

3.145.60.29

ఓం నమఃశ్శివాయ 
కార్తీకపురాణము - అష్టాదశాధ్యాయము, పద్దెనిమిదొవ రోజు పారాయణం. 
సేకరణ: లక్ష్మి రమణ 

ఓ ముని చంద్రా! మీ దర్శనము వలన నేను ధన్యుడనయ్యాను. సంశయములన్నీ తీరేవిధంగా మీరు నాకు జ్ఞానోపదేశము చేశారు . ఈ రోజు నుండీ మీరు నన్ను శిష్యునిగా స్వీకరించండి . నాకిక మీరే  తండ్రి- గురువు-అన్న-దైవము సమస్తము కూడా ! నా పూర్వ పుణ్య ఫలితము వల్లనే  కదా, మీబోటి పుణ్య పురుషుల సాంగత్యము  నాకు ప్రాప్తించింది .

లేకపోతె, నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టు నాయి పది ఉండగా, తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేనట్లయితే , ఈ కీకారణ్యములో తర తరాలుగా చెట్టు రూపములో వుండవలసినదే  కదా! అటువంటి నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పుణ్య ఫల ప్రదమైన ఈ కార్తీక మాసమెక్కడ!  పాపత్ముడనైన నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించగల భాగ్యము నాకెలా లభించేది  ? ఇవన్నీ దైవికమైన ఘటనలు తప్ప మరొకటి కాదు. కాబట్టి , నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మనవుడెలా  అనుసరించ వలెనో, దాని ఫలమెలాంటిదో  విశదీకరింపమని” ప్రార్ధించాడు .

          " ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలన్నిమంచివే. అవి అందరికి ఉపయోగపడేవే. కాబట్టి  వివరిస్తాను, శ్రద్దగా అలకించు అంటూ ఇలా చెప్పసాగారు అంగీరసుడు.  ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శున్యుడవుతున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. కాబట్టి  ఆత్మ జ్ఞానము పొందేందుకు సత్కర్మలు చేయాలని , సకల శాస్త్రములు ఘోషిస్తున్నాయి 

        సత్కర్మ  నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పణం చేసినట్టయితే  జ్ఞానము కలుగుతుంది .మానవుడు తాన జాతిని అనుసరించి విహితమైన కర్మలు ఆచరించాలి . బ్రాహ్మణుడు అరుణోదయమున  స్నానము చేయకుండా , సత్కర్మలని ఆచరించినప్పటికీ అవి  వ్యర్ధ మవుతాయి . 
 అదేవిధంగా కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా, వైశాఖ మాసములో సూర్యుడు మేష రాశిలోప్రవేశించి ఉండగా , మాఘ మాసములో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఈ మూడు మాసాలలోనూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము  ఆచరించాలి .

         ఆ విధంగా స్నానాన్ని ఆచరించి దేవార్చన చేసినట్టయితే,  తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది . సూర్య చంద్ర గ్రహణ సమయములలోనూ , ఇతర  పుణ్యదినముల లోనూ , స్నానము చేయవచ్చును. ప్రాతః  కాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్య సమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మ బ్రష్టుడగును.

         కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్ధిస్తాయి . ధనలోభా ! కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ, గోదావరి నదులకు సమాన తీర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీ, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు , శ్రీ హరితో సమానమైన దేవుడు లేదని తెలుసుకో.

        కార్తీక మాసములో విధ్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంటమునకు వెళతారు ." అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇలా ప్రశ్నించారు .

           ఓ ముని శ్రేష్టా! చతుర్మాస్య వ్రతమని చెబుతారు కదా ! ఏ ప్రయోజనం కోసం దానిని ఆచరించాలి ? ఇదివరకూ ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా ? ఆ వ్రతాన్ని ఏవిధంగా చేయాలో సవిస్తరంగా వివరించండి. అని కోరాడు . అప్పుడు అంగీరసుడు ఇలా చెప్పసాగాడు .  

         ఓయీ! ధనలోభా ! విను .  చతుర్మాస్య వ్రతమంటే మహా విష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రములో శేష పాన్పుపైన శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటారు. ఆ నలుగు మాసములకే చతుర్మాస్యమని పేరు.

           అందుకే  ఆషాడ శుద్ధ ఏకాదశిని  శయన ఏకాదశి' అని, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ' అని,ఈ  వ్రతమునకు, చతుర్మాస్యవ్రతమని పేరు వచ్చింది . ఈ నలుగు మాసములలో శ్రీ హరికి  ప్రీతి చేకూర్చేందుకు  స్నాన,  దాన , జప, తపాది సత్కార్యాలు చేసినట్టయితే, పుణ్య ఫలము కలుగుతుంది . మొదట ఈ వ్రత విధానాన్ని  శ్రీ మహా విష్ణువువే  స్వయంగా తెలియజేశారు. దాన్నే  ఇప్పుడు నేను, నీకు తెలియచేస్తున్నాను " అని ఇలా చెప్పసాగారు .

           కృత యుగంలో  వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింప బడుచున్న శ్రీ మన్నారాయణుడు, లక్షి దేవి సమేతుడై సింహాసనముపైన ఆశీనుడై ఉండగా, ఆ సమయములో  నారద మహర్షి వచ్చి, పద్మనేత్రుడు, చతుర్బాహుడు , కోటిసూర్యసమప్రభాకరుడు  అయిన శ్రీమన్నారాయణునకు నమస్కరించి, ముకుళిత హస్తాలతో ఆయన చెంత నిలబడ్డారు .

       అప్పడు శ్రీ హరి నారదుని చూసి,  ఏమీ తెలియనివాని లాగా  మందహాసముతో ఇలా అడిగారు ." నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారి వైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు ఎటువంటి విఘ్నములు లేకుండా సాగుతున్నాయా ? ప్రపంచమున ఎటువంటి  అరిష్టములు సంభవించలేదు కదా ? ' అని కుశల ప్రశ్నలు అడిగారు .

       అప్పడు నారదుడు శ్రీ హరికీ, అది లక్ష్మికీ నమస్కరించి " ఓ దేవా! ఈ జగంబున  నీకు తెలియని విషయములు కూడా ఉన్నాయా ? అయినా నన్ను చెప్పమని అడిగావు కాబట్టి, కొన్ని విషయాలు మీకు చెబుతాను .   ప్రపంచములో  కొందరు మనుష్యులు- మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగా నిర్వర్తించడం లేదు. వారేవిధంగా  విముక్తులవుతారనేది నాకు అర్థంకాకుండా ఉన్నది .

         కొందరు భుజించ కూడదన్న  పదార్దములు భుజిస్తున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేస్తూ , అవి పూర్తి గాక మునుపే  మధ్యలో మాని వేస్తున్నారు. కొందరు సదచారులుగా, మరి కొందరు అహంకార సహితులుగా, పరనిందా  పరాయణులుగా జీవిస్తున్నారు.            అటువంటి వారిని సత్కృపతో  రక్షించ 'మని ప్రార్ధించారు .

 అప్పుడా జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి , లక్ష్మి దేవితో, గరుడ, గంధర్వాది దేవతలతో, వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణ రూపంతో తిరగసాగాడు. ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించసాగారు .  పుణ్యనదులు, పుణ్య ఆశ్రమాలు తిరగసాగారు ,  ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి,  ముసలివాని రూపంలో ఉండడం చేత, ముసలివాడని ఎగతాళి చేయసాగారు .  కొందరు ‘ఈ ముసలివానితో మనకేమి పని’ అని ఊరకున్నారు .  గర్విష్టులైన  మరికొందరు శ్రీహరిని కన్నెత్తి కూడా చూడలేదు . వీరందరినీ భక్తవత్సలుడైన  శ్రీహరి, ‘వీరిని ఎలా తరింపజేయాలి?’ అని ఆలోచిస్తూ… తన నిజరూపంలోకి వచ్చాడు. శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ధరించి, లక్ష్మీదేవితోను, భక్తులతోనూ, మునిజన ప్రీతికరమైన నైమిశారణ్యానికి వెళ్లాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంఉటున్న ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారయణుడిని దర్శించి, భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి, ఆది దైవమైన ఆ లక్ష్మీనారాయణుడిని ఇలా స్తుతించారు…
         

శ్లో|| శాంత కారం!భుజగ శయనం!పద్మ నాభం! సురేశం!
విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!
వందే విష్ణుం ! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||


శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం
దాసిభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
త్వాం త్రైలోక్య  కుటుంబిని౦ సరసిజాం వందే ముకుంద ప్రియాం ||

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, అష్టాదశాధ్యాయము, పద్దెనిమిదవ  రోజు పారాయణం సమాప్తం.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !- 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore