Online Puja Services

కార్తీక పురాణము - పదహారవ అధ్యాయము

3.15.202.214

ఓం నమఃశ్శివాయ 
కార్తీక పురాణము , పదహారవ అధ్యాయము  - పదహారో రోజు పారాయణము. 
సేకరణ: లక్ష్మి రమణ 

"ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయడము , సాలగ్రామ దానము చేయడం చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసములో తనకు శక్తి వున్నా దానము చేయరో, అటువంటి వారు రౌరవాది నరకబాధలు పొందుతారు.

ఈ నెల రోజులూ తాంబూలదానము చేసేవారు చక్రవర్తిగా జన్మిస్తారు . ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ విడువకుండ, తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన వారి సమస్త పాపములు నశించడమే గాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది .

 కార్తీకశుద్ద పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి, భగవంతుని సన్నిధిలో  ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాలు సమర్పించి , నారికేళ ఫలదానము చేసినట్లయితే,  - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగుతుంది . 

 సంతానము వున్న వారు ఈ దానాన్ని చేసినట్టయితే,  సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు . ఈ మాసములో ధ్వజస్తంభమున  ఆకాశ దీపముంచిన వారు వైకుంఠములో  సకల భోగములు అనుభవిస్తారు . కార్తీక మాసమంతా  ఆకాశ దీపముగాని, స్తంభ దీపాము గాని వుంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకముగా ఉంటుంది .

ఆకాశ దీపము పెట్టెవారు శాలిధాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దానిపై దీపాన్ని ఉంచాలి . దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు, లేక దీపం పెట్టువారిని  పరిహాసము చేసే వారు చుంచు జన్మ మెత్తుతారు. దీనికి సంబంధిన కథనే నేనిపుడు వివరించబోతున్నాను. అంటూ దీపస్తంభము విప్రుడైన కథని వశిష్ఠులవారు  ఇలా చెప్పసాగారు . 

దీప స్తంభము విప్రుడగుట

          ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో ఒక  విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేస్తూ నివశించసాగారు . కార్తీకమాసములో ఆ యాశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేస్తుండేవారు .

 వారు ప్రతిరోజూ  అలయద్వారాల పై దీపములు వెలిగించి, ఎంతో భక్తితో శ్రీహరిని పూజించి వెళుతుండేవారు.  ఒకరోజు  ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులను జూచి "ఓ సిద్దులారా! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపము ను పెట్టినట్లయితే,  వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీకశుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్త౦భముపాతి, దానిపై దీపమును పెడదాము .దానికోసం మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము ఒకటి తీసుకొద్దాం రండి " అని పిలిచాడు . అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతారు .

దానిపై శాలి ధాన్యమును పోసి , ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి,  అందులో  వత్తివేసి, దీపము వెలిగించారు . ఆ తర్వాత వారందరూ కూర్చుని  పురాణపఠనము చేయసాగారు. ఇంతలో ఫెళ ఫెళమనే  శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉన్నాయి .

ఆ దృశ్యము చూసి వారందరు ఆశ్చర్యముతో నిలబడి చూడసాగారు . అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు . వారతనిని జూచి "ఓయీ నీ వేవడవు? నీవీ స్తంభమునుండి ఎలా వచ్చావు ? నీ వృత్తాంతమేమిటి " అని ప్రశించారు . అప్పుడా , ఆ పురుషుడు వారందరకీ  నమస్కరించి "పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మలో బ్రహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా యైశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించాను . దుర్భుద్దులు అలవడడం చేత, వేదములు చదువక, శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయక దుష్టుడనై ప్రవర్తించేవాడిని .

 నేను నా పరివారముతో కూర్చొని ఉన్న సమయంలో ఎవరైనా విప్రుడు నన్ను సహాయార్థం ఆశ్రయిస్తే, అతని చేత  నా కాళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుతుండేవాడిని . నేను ఉన్నతాసనముపైన  కూర్చుని  అతిధులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని .
 స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూస్తుండేవాడిని . అందరు నా చేష్టలకు భయపడువారే కాని, నన్నెవరు మందలింపలేక పోయారు . దాంతో  నేను చేసిన పాపకార్యాలకు హద్దులే లేకపోయాయి . దానము , ధర్మమూ అనేవి ఎలాంటివో కూడా నేను ఎరుగను . ఇంత దుర్మార్గడనై, పాపినై జీవించి,  చనిపోయిన తర్వాత  ఘోర నరకములు అనుభవించి, లక్ష జన్మలములలో  కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదు వేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్ష జన్మము పొంది కీకారణ్యములో ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోయాను .

ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినయ్యాను . నా పూర్వ కర్మలన్ని మీకు చెప్పుకోగలిగాను , నన్ను మన్ని౦పు" డని వేడుకున్నాడు .

 ఆ మాటలు విన్న , మునులందరు అమితమైన ఆశ్చర్యమును పొంది  "ఆహా! కార్తీకమాసమహిమ యెంత గొప్పది! అందులోనూ , కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు కదా . కఱ్ఱలు, రాళ్లు, స్త౦భములు కూడా మన కండ్ల యెదుట ముక్తిని పొందుతున్నాయి . వీటన్ని౦టి కన్నా, కార్తీక శుద్ధ పౌర్ణమినాడు  ఆకాశదీపముంచిన వ్యక్తులకు  వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. అందువల్లే  యీ స్త౦భమునకు ముక్తికలిగిన" దని మునులు మాట్లాడుకోసాగారు . అప్పుడా  ఆ స్తంభం నుండీ వెలువడ్డ పురుషుడా మాటలాలకించి "ఓ మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా ఉన్నదా ? ఈ జగములో ఉన్నవారికి ఏవిధంగా కర్మ బంధము కలుగుతుంది ? అది నశి౦చే మార్గమేది ? నాయీ సంశయములు తీర్చగలరని” ప్రార్ధించాడు .

  అక్కడ వున్న మునిశ్వరుల౦దరు తమలో ఒకడైన  అంగీరసమునితో "స్వామి! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు. కాబట్టి , వివరించండి “ అని కోరారు. అప్పుడు అంగీరసుడు ఇలా చెప్పనారంభించారు . 

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, పదహారవ అధ్యాయము  - పదహారో రోజు పారాయణము సమాప్తం. 

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha