Online Puja Services

కార్తీకపురాణము - అరవ అధ్యాయము

18.227.114.125

ఓం నమః శ్శివాయ 
కార్తీకపురాణము - అరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము 
సేకరణ: లక్ష్మి రమణ 

“ ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులూ పరమేశ్వరునికి , శ్రీ మహా విష్ణువుకి , పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తారో అటువంటి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కుతుంది .

అలాగే , ఎవరైతే, కార్తీకమాసమంతా దేవాలయంలో దీపారాధన చేస్తారో , వారికి కైవల్యం ప్రాప్తిస్తుంది . ఓ రాజా ! దీపదానం చేసే విధిని శ్రద్ధగా ఆలకించు.  ముందుగా పత్తిని సేకరించి, శుభ్రపరిచి,  స్వయంగా వత్తులు తయారు చేయాలి .  ఆ తర్వాత వరిపిండితో ప్రమిదని చేసి , దానిలో వత్తిని వేసి, ఆవునెయ్యివేసి,  వెలిగించి ఆ  ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యాలి. దాంతోపాటు శక్తి కొలది దక్షణ కూడా ఇవ్వాలి . 

ఈ ప్రకారముగా కార్తీక మాసములోని ప్రతి దినము చేసి, ఆఖరి  రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి ఈ  నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చినట్లయితే,  సకలైశ్వర్యములు కలగడమే కాకుండా,  మోక్ష ప్రాప్తి కలుగుతుంది . 

శ్లో. సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవాహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తూ సదామమ||

అని స్తోత్రం చేసి దీపం దానం చేయాలి . ' అన్ని విధములైన  జ్ఞానాన్ని కలుగ జేసేది , సకల సంపదలు అనుగ్రహించేదీ అయిన దీపదానాన్ని చేస్తున్నాను . నాకు శాంతి కలుగుగాక! ' అనిఅర్ధము

ఈ విదముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయాలి . శక్తి లేని వారు  పది మంది బ్రాహ్మణుల కైనా  భోజనం పెట్టి , దక్షిణతాంబూలాలు ఇవ్వాలి .  ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని ఎవరు చేసినా కూడా, సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుష్షు వృద్ధి కలిగి సుఖించగలరు” అని చెప్పి , దానికి సంబంధించిన ఇతిహాసాన్ని ఆలకించమని వశిష్టుడు జనకునితో ఇలా చెప్పసాగాడు . 

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట 

పూర్వ కాలమున ద్రావిడ దేశములోని ఒక గ్రామములో ఒక స్త్రీ ఉండేది.  ఆమెకు పెండ్లి అయిన కొద్దీ కాలానికే భర్త చనిపోయాడు . సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందువల్ల ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేస్తూ , అక్కడే  భుజిస్తూ ,      ఒకవేళ యజమానులు వారి సంతోషము కొద్దీ ఏమైనా వస్తువులిస్తే,  ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొంటూ, ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి, మరింత డబ్బును కూడబెట్టు కుంటూ , దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను  తక్కువ ధరకు కొని, యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొంటూ - సొమ్ము కుడబెడుతూ ఉండేది . ఎంతగా సంపాదించినా ఫలమేమి ? ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చడం గాని చేసి యెరుగదు.  పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే  వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికి  పిడికెడు బియ్యము పెట్టక, తను తినక , మహా పిసినారిగా జీవిస్తూ ధనము కూడబెట్టడమనే ప్రక్రియని కొనసాగించేది .

ఇలా  కొంత కాలము జరిగింది.  ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించేందుకు బయలుదేరి, మార్గ మధ్యములో  ఈ స్త్రీ ఉన్న గ్రామానికి   వచ్చి, ఆ రోజు అక్కడొక సత్రములో మజిలి చేశారు . అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్లారు . “ అమ్మ నా హితవచనాన్ని విను.  నీకు కోపము వచ్చిన సరే, నేను చెప్పే   మాటలు ఆలకించు. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకు పోతుందో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన ఈ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి,  అసహ్యముగా  తయారవుతుంది . అటువంటి యి శరీరాన్ని  నీవు నిత్యమని భ్రమిస్తున్నావు.  ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన .

 తల్లీ! నీవు బాగా ఆలోచించుకో! అగ్నిని  చూసి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మయిపోతోంది . అలాగే,  మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశిస్తున్నాడు . కాబట్టి, నామాటవిని , నీవు తినకుండా , ఇతరులకు పెట్టకుండా అన్యాయముగా సంపాదించిన సొమ్ముని ఇప్పుడైనా పేదలకి దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకో. ప్రతి రోజూ శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము పొందు . నీ పాప పరిహరర్ధముగా, వచ్చే కార్తీకమాసమంతా  ప్రాత: కాలమున నది స్నాన మాచరించి, దాన ధర్మములను చేసి, బ్రాహ్మణులకు బోజనము పెట్టినట్టయితే, వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల'వని వుపదేశించారు .

అప్పుడా వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై , మనస్సు మార్చుకొని, ఆ నాటి నుండి దానధర్మములు చేస్తూ ,  కార్తీకమాస వ్రతం ఆచరించడం వలన జన్మ రాహిత్యమై, మోక్షము పొందింది .  కావున ఓ రాజా ! కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. అని వసిష్ఠుడు చెప్పారు . 

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, అరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ  మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda