Online Puja Services

కార్తీక మాహత్యం - ఐదవ యధ్యాయము

18.221.174.248

ఓం నమః శ్శివాయ 
కార్తీక మాహత్యం - ఐదవ యధ్యాయము, ఐదవరోజు పారాయణము.
సేకరణ: లక్ష్మి రమణ 

 ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానం, దానం,  పూజ నిర్వహించాక శివాలయములో గానీ , విష్ణ్యాలయములో గానీ శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయాలి . అలా చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అవుతాయి .

ఈ కార్తిక మాసములో కరవీరపుష్పములు (గన్నేరు పూలు)  శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమును పొందుతారు . భగవద్గీతని కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది . చివరికి అందులోని  శ్లోకములలో ఒక్క పాదమైనా  కంఠస్థం  చేసినవారు కూడా విష్ణుసాన్నిధ్యం పొందుతారు .

కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టుక్రింద సాలగ్రామమును ఉంచి, యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన కూర్చొని  భుజించాలి . బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుక్రిందనే భోజనం పెట్టి, దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించాలి .

వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయాలి . పూర్వం ఈ విధంగా చేసిన ఒక బ్రాహ్మణపుత్రుడికి  నీచజన్మము పోయి, నిజరూపము కలిగింది - యని వశిష్ఠులవారు చెప్పారు . అది విని జనకరాజు "మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మము ఎందుకు కలిగింది ? దానికి గల కారణమేమిటి " అని  ప్రశ్నించగా, వశిష్ఠులవారు యీ విధంబుగా ఆ కథని వివరించసాగారు .

కిరాత మూషికములు మోక్షము పొందుట :

            రాజా! కావేరీతీరములో ఒక చిన్న గ్రామములో  దేవశర్మ అనే  బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకున్నాడు . అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాబముగ పెరగడం వలన నీచసహవాసములు చేసి , ఆచారాన్ని విడిచి  ప్రవర్తించసాగాడు . అతని దురాచారములను చూసి, ఒకరోజు అతని  తండ్రి దగ్గరకి  పిలిచి "బిడ్డా! నీ దురాచారములకి అంతు లేకుండా వున్నది.  నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు.  నన్ను నిలదీసి అడుగుతున్నారు. ఈ నిందలు నేను పడలేకపోతున్నాను . కాబట్టి , నీవు కార్తీక మాసములో నదీ స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయములో దేవాలయములో దీపారాధన చేయి. దీనివల్ల నీవు చేసిన పాపములు తొలిగిపోవడమే కాకుండా  నీకు మోక్షప్రాప్తికూడా కలుగుతుంది .” అని బోధించాడు. 

అప్పుడు శివశర్మ 'తండ్రీ! స్నానము చేయడమనేది  వంటి మురికి పోవడానికి  మాత్రమేకాని వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంతమాత్రాన భగవంతుడు కనిపిస్తాడా ? దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమిటి ? వాటిని ఇంట్లో పెట్టడం వలన ఇల్లయినా వెలుగులతో నిండుతుంది కదా !' అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చాడు .

కుమారుని సమాధానము విని, ఆ తండ్రీ "ఓరీ నీచుడా! కార్తీకమాస ఫలమును అంత చులకనగా భావిస్తున్నావా ?  నీవు అడవిలో ఉండే  రావిచెట్టు తొఱ్ఱలో  యెలుకరూపములో బ్రతికెదవుగాక" అని శపించాడు . 

ఆ శాపంతో కుమారుడైన  శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపైపడి "తండ్రీ! నన్ను క్షమించు . అజ్ఞానంధకారములో పడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకనచేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోయాను . ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగింది . కాబట్టి కరుణించి నాకు ఆ శాపవిమోచనం ఎప్పుడు ఎలా కలుగుతుందో వివరించండి”అని వేడుకున్నాడు. 

అప్పుడు దేవశర్మ "బిడ్డా! నాశాపమును అనుభవిస్తూ మూషికమువై సంచరిస్తున్న సమయంలో నువ్వు ఎప్పుడు కార్తీకమాహాత్మ్యమును వినగలవో, అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందగలవు " అని శాపవిమోచనా మార్గాన్ని కుమారునికి చెప్పి ఊరడించాడు. వెంటనే శివశర్మ యెలుక రూపాన్ని పొంది అడవికి చేరుకొని , ఒక రావి చెట్టుతొఱ్ఱలో దూరి నివసిస్తూ, పళ్ళూ , ఫలాలూ తింటూ జీవించసాగాడు. .

ఆ అడవి కావేరీ నదీతీర సమీపములో ఉండడం వల్ల స్నానం చేయడానికి నదికి వెళ్లే వారు, కాసేపు ఈ ఎలుక నివాసమున్న ఉన్న రావి వృక్షం నీడలో కొంతసేపు విశ్రమించి, లోకాభి రామాయణము చర్చించుకుంటూ నదికి వెళుతుండేవారు. ఇలా  కొంతకాలమైన తరువాత, కార్తీకమాసములో ఒకనాడు మహర్షి విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీనదిలో స్నానం చేసేందుకు బయల్దేరారు .

స్నానానంతరం , దూరాభారపు  ప్రయాణపు బడలికచేత, మూషికమువున్న ఆ వృక్షం క్రింద ఆగారు. అక్కడ కూర్చొని శిష్యులకు కార్తీకపురాణమును వినిపించసాగారు. ఈలోగా రావి చెట్టుతొఱ్ఱలో నివసిస్తున్న మూషికము వీరిదగ్గరనున్న పూజాద్రవ్యములలో ఏదైనా తినేవస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి, చెట్టుమొదట నక్కిచూడసాగింది .

ఇదిలా ఉంటే, ఒక కిరాతకుడు శిష్యసమేతంగా వచ్చినది మునీశ్వరుడని తెలియక , ఇంతమంది ఉన్నారు కాబట్టి , వాళ్ళు బాటసారులై ఉండొచ్చు. కొల్లగొడితే బోలెడు ధనం  దొరకొచ్చనే ఆశతో  వారి అడుగుజాడలు అనుసరిస్తూ, అక్కడికి చేరుకున్నాడు. కానీ, తీరా చూస్తే ఉన్నవారందరూ మునిపుంగవులు, సర్వసంగపరిత్యాగులే ! వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది . వారికి నమస్కరించి " మహానుభావులారా! తమరు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు ? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుతోంది . దయచేసి తెలియజేయండి " అని ప్రాధేయపడ్డాడు . 

అప్పుడా విశ్వామిత్రులవారు "ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్థమై, ఈ ప్రాంతానికి వచ్చాము .  స్నానమాచరించి, కార్తీకపురాణము పారాయణ చేస్తున్నాము . నువ్వుకూడా మాతో కూర్చొని శ్రద్ధగా విను " అని ఆదేశించారు . అప్పుడా కిరాతకుడు మారుమాట్లాడకుండా అలాగేనని, వారితో కలిసి విశ్వామిత్రులవారు చెబుతున్న అద్భుతమైన కథా రసాస్వాదనం చేయనారంభించాడు . 

ఆ పుణ్య శ్రవణం వలన అతనికి తన పూర్వజన్మ జ్ఞానం జ్ఞప్తికి వచ్చింది . పురాణశ్రవణానంతరము ఆ తపస్వికి ప్రణామం చేసి , తన పల్లెకు  వెళ్ళాడు.  అలాగే, అప్పటివరకూ చెట్టుచాటున నక్కిన ఎలుక కూడా తన పూర్వరూపాన్ని పొందింది . బ్ర్రాహ్మణ రూపంలో విశ్వామిత్రునిదగ్గరికి వచ్చిన శివశర్మ "మునివర్యా! ధన్యోస్మి. తమ దయవల్ల నేను కూడా నా మూషిక రూపమునుండి విముక్తుడనయ్యను " అని తన వృత్తాంతమంతా చెప్పి వెళ్ళిపోయాడు .

కాబట్టి  ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరే వారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించాలి.” అని చెప్పారు వసిష్ఠ మహర్షి . 

స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి, ఐదవ యధ్యాయము, ఐదవరోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha