కార్తీక పురాణం - ఇరవైతొమ్మిదవ అధ్యయము

54.224.117.125

ఓం నమః శ్శివాయ 

కార్తీక పురాణం - ఇరవైతొమ్మిదవ అధ్యయము, ఇరవైతొమ్మిదవ రోజు పారాయణము

సేకరణ: లక్ష్మి రమణ 

అత్రి మహర్షి అగస్త్యులవారితో ఇలా చెబుతున్నారు… ”ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషుడికి అభయమిచ్చి, ఇద్దరినీ రక్షించి, భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్థానమైంది” అని ఇంకా ఇలా చెప్పసాగారు.  

ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుడి పాదాలపై పడి దండప్రణామాలు ఆచరించాడు. పాదాలను కడిగి, ఆ నీటిని తన తలపై చల్లుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గంలో ఉన్న ఒక సామాన్య గృహస్తుడిని. నా శక్తి కొద్దీ నేను శ్రీమన్నారాయణుడిని సేవిస్తాను. ద్వాదశీ వ్రతం జేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఆపదా వాటిల్లకుండా ధర్మవర్తుడనై రాజ్యాన్ని పాలిస్తున్నాను. నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను క్షమించండి. మీ యందు నాకు అమితమైన అనురాగముండడం వల్ల మీకు ఆతిథ్యమివ్వాలని ఆహ్వానించాను. కాబట్టి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. నన్ను, నా వంశాన్ని పావనం చేయండి. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినా.. మరలా నా గృహానికి వచ్చారు. నేను ధన్యుడనయ్యాను. మీ రాక వల్ల శ్రీమహావిష్ణువు సుదర్శన చక్ర దర్శన భాగ్యం కలిగింది. అందుకు నేను మీ ఉపకారాన్ని మరవలేను.

 ఓ మహానుభావా! నా మనస్సెంతో సంతోషంగా ఉంది. అసలు మిమ్మల్ని ఎలా స్తుతించాలో కూడా పలుకులు రావడం లేదు. నా కంటివెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వాటితో మీ పాదాలను కడుగుతున్నాను. మీకు ఎంత సేవ చేసినా… ఇంకనూ మీకు రుణపడి ఉంటాను. కాబట్టి ఓ పుణ్య పురుషా! నాకు మరలా జన్మ అనేది లేకుండా… జన్మరాహిత్యం కలిగేట్లు, సదా మీ వంటి మునిశ్రేష్టులయందు , ఆ శ్రీమన్నారాయణుడి యందు మనస్సు గలవాడనయ్యేలా నన్ను ఆశీర్వదించండి” అని ప్రార్థించాడు. అనంతరం సహపంక్తి భోజనానికి రమ్మని ఆయన్ను ఆహ్వానించారు. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుడిని దుర్వాసుడు ఆశీర్వదించి… ”రాజా! ఎవరు ఎదుటివారి బాధను నివారించి, ప్రాణాలను కాపాడుతారో… ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారో… అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి, నీవు నాకు ఎంతో ఇష్టుడవు, తండ్రి సమానుడవయ్యావు. నేను నీకు నమస్కరించినచో నా కంటే చిన్నవాడగుట వల్ల నీకు ఆయుక్షీణమగును. అందుకే నీకు నమస్కరించడం లేదు. నీవు కోరిన ఈ కోరిక స్వల్పమైనదే. తప్పక నెరవేరుస్తాను. 

పవిత్ర ఏకాదశినాడు వ్రత నిష్టతో ఉండే నీకు మనస్థాపం కలుగజేసినందుకు వెంటనే నేను తగు ప్రాయశ్చిత్తం అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించేందుకు నీవే దిక్కయ్యావు. నీతో కలిసి భోజనం చేయడం నా భాగ్యం” అన్నారు. ఆ తర్వాత అంతా కలిసి, పంచభక్ష్య పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించారు. దుర్వాసుడు అంబరీషుని భక్తిని ప్రశంసించి, అనంతరం దీవించి, తన ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోయారు.

తిరిగి అత్రి మహాముని అగస్త్యులవారితో ఇలా చెబుతున్నారు…. ”ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశిరోజున జరిగింది. ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహత్తుగలదో గ్రహించారా ? ఆ దినాన విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేష శయ్యపైనుంచి లేస్తారు. ఆ రోజు ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యం, ఇతర దినాలలో పంచదానాలు చేసినంత ఫలితంతో సమానం. ఎవరైనా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి , పగలంతా హరినామ కీర్తనతో గడిపి, రాత్రి పురాణం చదువుతూ, లేదా వింటూ… జాగరణ చేసి, ఆ తర్వాతిరోజు అయిన ద్వాదశినాడు తన శక్తికొద్దీ శ్రీమన్నారాయణుడిని ధ్యానించి, ఆ శ్రీహరి ప్రీతికోసం దానాలిచ్చి, బ్రాహ్మలతో కలిసి భోజనం చేయాలి. అలా చేసేవారి సర్వపాపాలు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి. ద్వాదశి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి, ఆ రోజు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నా… ఆ ఘడియలు దాటకుండానే భోజనం చేయాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిరనివాసమేర్పరుచుకోవాలని కోరిక ఉంటుందో… వారు ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం చేయాలి. ఏ ఒక్కటీ విడువ కూడదు. శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్నివిధాలా శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది. అయినా… అదే గొప్ప వృక్షం అవుతుంది. అదేవిధంగా కార్తీకమాసంలో నియమానుసారంగా చేసే కొంచెం పుణ్యమైనా… అది అవసాన కాలమందు యమదూతల నుంచి కాపాడుతుంది. అందుకే.. ఈ కార్తీక మాస వ్రతం చేసి, దేవతలే కకుండా, సమస్త మానవులు తరించారు. ఈ కథను ఎవరు చదివినా… విన్నా… సకలైశ్వర్యాలు సిద్ధించి, ధన ప్రాప్తి కలుగుతుందని అత్రిమహర్షి సెలవిచ్చారు.

శ్రీ స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త, కార్తీక మహత్యంలోని ఇరవైతొమ్మిదవ అధ్యయము , ఇరవైతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం . 

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !

Quote of the day

Man learns through experience, and the spiritual path is full of different kinds of experiences. He will encounter many difficulties and obstacles, and they are the very experiences he needs to encourage and complete the cleansing process.…

__________Sai Baba