Online Puja Services

గుడిలో తీర్థం తీసుకున్నపుడు

3.135.216.174

గుడిలో తీర్థం తీసుకున్నపుడు రెండు వేళ్ళని ముడిచి ఎందుకు తీసుకుంటారు  ?
- లక్ష్మిరమణ 

గుడిలో తీర్థం తీసుకున్నపుడు మన బ్రోటన వేలిని చూపుడు వేలిని ముడిచి తీసుకోవాలని పెద్దలు చెబుతారు . ఖచ్చితంగా అలాగే తీసుకుంటూ ఉంటారు కూడా . ఇలా పెద్దలు మనకి ఒక చక్కని సందేశాన్ని అందిస్తున్నారు . మన మహర్షులు ఏ ఆచారాన్ని అందించినా అందులో ఎంతో గొప్ప సందేశము, భావమూ నిండి ఉంటాయి. అలాగే ఈ సంప్రదాయంలోనూ గొప్ప సందేశమే ఉంది. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. 

మన చూపుడు వేలికి తర్జని అని పేరు. తర్జనము అంటే , భయపెట్టడం అని అర్థం . అందుకు మన వేళ్లల్లో పనికి వచ్చేది మన చూపుడు వేలు . చూపుడు వేలు చూపించారు అనంటే, ఎదుటివారు మనని భయపెట్టాలని చూస్తున్నారనే కదా మనం భావించేది. అలాగే మనకి కూడా పెద్దలు చూపుడు వేలు చూపించి మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు. అందులో ఆంతర్యం ఇదే .   

కాబట్టి మన అహంకారానికి ప్రతీక అయిన ఆవేలుని బొటన వేలితో అణిచి ఉంచమని చెబుతారు. భగవంతుని ఎదుట , ఆయన పాదోదకాన్ని స్వీకరిస్తున్నప్పుడు , స్వామీ ! నీ పాదాల చెంత నా అహంకారాన్ని వదిలేస్తున్నాను . ‘నేను’ అనే భావనని నాలో నుండీ తొలగించి , స్వయంప్రకాశమైన నీ అనుగ్రహ తేజాన్ని నాలో ప్రవేశింపజేయని ప్రార్ధించడం ఈ ముద్రలో దాగి ఉంది. 

ఇదే కాకుండా , తర్జనిపై అంగుష్టం ( బొటనవేలు ) మడిచినప్పుడు మన చేయి గోకర్ణ ఆకృతిలో ఉంటుంది. అంటే, ఆవు చెవి ఆకారంలో ఉంటుంది. గోవు పరమపవిత్రమైనది అని అందరికీ తెలిసినదే కదా! ఆ ఆకారంలో మన చేతిని ఉంచి తీర్థాన్ని స్వీకరించడం వలన ఆ భగవంతుని పాదోదకం జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది . గుడిలో తీర్థం తీసుకునేప్పుడు నిలబడి, ఇంట్లో అయితే, కూర్చుని తీసుకోవాలి.
 
ఇక , గుడిలో తీర్థం తీసుకునేప్పుడే కాదు, ఆచమనం చేసేప్పుడు కూడా, ఇలానే తర్జనిని , బ్రోటనివేలితో అణిచి ఉంచి నీటిని ముమ్మారు తీసుకోవాలి . ఇలా ఆచమనానికి నియమాలు ఎక్కువ. మన చేతిలో ఒక మినప గింజ మునిగేంత నీటిని మాత్రమే తీసుకోవాలి అని తెలియజేస్తున్నారు పండితులు . 

#teertham

Tags: teerdham, theertham, teertham, temples

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore