Online Puja Services

ఏడాదిపాటు ఇక్కడ పూవు వాడదు, నైవేద్యం చెడిపోదు

52.14.221.113

ఏడాదిపాటు ఇక్కడ పూవు వాడదు, నైవేద్యం చెడిపోదు !!
-లక్ష్మీరమణ 
 
‘లాస్యప్రియా’ అనేది లలితాదేవి నామాలలో ఒకటి . సదా చిరునగవులు చిందిస్తూ , భక్తులకి అణుమాత్రమైనా కష్టం కలగకుండా చేసే అమ్మవారి స్వరూపం హసనాంబ. ఇక్కడ అమ్మకి పెట్టిన పూలు ఏడాదిపాటు వాడవు. పెట్టిన నైవేద్యం ఏడాదిపాటు చెడిపోకుండా, తాజాగా ఉంటుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరిచే హసనాంబ దర్శనానికి వెళ్ళొద్దాం పదండి . 
 
వండిన అన్నం , మరునాటికి చెడిపోతుంది . కానీ ఇక్కడ అమ్మకి నివేదించిన అన్నం ఏడాదిపాటు తాజాగా ఉంటుంది . ఈ ఆలయం దక్షిణ భారత దేశ రాష్ట్రమైన కర్నాటకలో ఉంది. కర్ణాటకలోని హాసన్ అనే చిన్న పట్టణంలో ఉన్న హసనాంబ ఆలయ చమత్కారమిది .  


పుట్టగా వ్యక్తమయిన అమ్మ :

హాస్యం అంటే నవ్వు అని అర్థం. ఒకసారి, సప్తమాతృకలు అంటే, బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి దేవతలు ఒక పడవలో దక్షిణ భారత దేశానికి వచ్చారట. అప్పుడు ఇక్కడి హస్సన్ పట్టణ అందాలకు ముగ్ధులై, ఆ ప్రదేశాన్ని తమకు నిరంతర నిలయంగా చేసుకోవాలని నిర్ణయించారు. వీరిలో మహేశ్వరి, కౌమారి, వైష్ణవి లు ఇక్కడి ఆలయంలోని మూడు చీమల పుట్టలను తమ నివాసంగా చేసుకొన్నారని స్థానిక గాథ. అమ్మవారు స్వరూపంలో కూడా మూడు పుట్టల్లాగానే దర్శనమిస్తారు. పెద్ద కుంకుమ బొట్టుతో త్రిశక్తి స్వరూపిగా కనిపిస్తారు.  

స్థానికగాథ :
ఇక్కడ దేవత సదా నవ్వుతూ ఉంటారు కాబట్టే ఆ దేవతకు హాసనాంబ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతే కాకుండా తన భక్తులను ఎవరైనా హింసింస్తే అంతే ఉగ్రరూపంగా మారిపోతారు. అలా మారిపోయన అమ్మవారు భక్తులను హించిసినవారి అంతు చూస్తారని చెబుతారు. అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతారు. 

హాసనాంబ భక్తురాలైన ఒక కోడలిని అత్తగారు హింసించేదట . దీంతో కోపగించుకొన్న హాసనాంబ, భక్తురాలి అత్తని బండరాయిగా మారిపోమ్మని శపించిందట. ఆ బండరాయిని మనం ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో చూడవచ్చు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక అంగుళం హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ అత్త రూపంలో ఉన్న రాయి హాసనాంబ అమ్మవారి వద్దకు చేరుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుందని నమ్ముతారు.

ఇలా ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయం పై మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం చెప్పలేక పోతున్నారు.

ఇక ఈ దేవాలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. అందులోనూ ఏడు రోజులు మాత్రమే దేవాలయంలోని అమ్మవారిని దర్శించు కోవడానికి అనుమతి ఉంటుంది. ఈ సమయంలో కేవలం కర్నాటక నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు.

మహత్యం :
ఏడు రోజుల తర్వాత ఈ దేవాలయాన్నితిరిగి మూసివేస్తారు. సాధారణంగా దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి రోజున ఆయాలన్ని మూసివేస్తారు. ఆ సమయంలో నెయ్యితో వెలిగించిన దీపాన్ని హాసనాంబ విగ్రహం ముందు ఉంచుతారు. దీపారాధనతో పాటుగా పుష్పాఅర్చన చేసి, కొన్ని పూలతో పాటు, నివేదనగా రెండు బస్తాల అన్నాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేస్తారు.

మరలా ఏడాది తర్వాత ఆలయ ద్వారాలను తెరిచినప్పుడు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అమ్మకి పెట్టినపూలు పువ్వులు వాడిపోవు .  ముఖ్యంగా దేవతకి నివేదించిన అన్నం వేడిగా ఉండటమే కాకుండా తినడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తుంటారు . 

ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కనిపించడం లేదు. 

విశేషం :
ఈ ఆలయంలోపల మనకు తొమ్మిది తలలతో ఉన్న రావణుడు వీణవాయిస్తూ కనిపిస్తాడు. అదే విధంగా దేవీస్వరూపానికి ఎదురుగా సిద్ధేశ్వరస్వామి లింగరూపంలో కాకుండా మనిషి రూపంలో కనిపిస్తారు. పదితలలరావణుడు ఇక్కడ ఉండడమే విశేషం అనుకుంటే , శివయ్య మానవాకృతిలో దర్శనమివ్వడం ఇక్కడి మరో విశేషం . 

చేరుకోవడం ఇలా :
బెంగళూరు నుంచి 184 కిలోమీటర్ల దూరంలో ఉన్న హసనాంబ దేవాలయం చేరుకోవడానికి నిత్యం బెంగళూరు నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya