Online Puja Services

గొడ్రాలినైనా , బిడ్డతల్లిగా ఆశీర్వదించే ఆలయం

18.188.66.13

గొడ్రాలినైనా , బిడ్డతల్లిగా ఆశీర్వదించే ఆలయం దర్శిద్దామా!
-లక్ష్మీ రమణ 

‘అష్టవర్షాత్ భవేత్ కన్యా’ అని హిందూ సంప్రదాయంలో పూర్వం 8 ఏళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసేవారు . సరే, కాలంతోపాటు యువతులకు పెళ్ళి చేసే వయసు కూడా మారుతూ వచ్చింది . ప్రభుత్వంవారి ప్రకారం , 18 ఏళ్ళు నిండాకే యువతులకు పెళ్లి చేయాలి . కానీ జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లిచేసుకోవాలి . ఇదీ నేటి యువతుల విధాన శైలి . కానీ, పెళ్ళి చేసుకొనే వయసు కారణమో, ఇప్పటి జీవనపు ఒత్తిళ్ళు , విధానం కారణమో గానీ వివాహమైనా పిల్లలు కలగని దంపతులు, స్త్రీలకి గర్భసంచి లోపాలు, గర్భస్రావాలు , PCOD సమస్యలు చాలా ఎక్కువైపోయాయి . ఇటువంటివారి వేదన వర్ణనాతీతం . వీరికి కొంగుబంగారమైన దేవీ  స్వరూపమే గర్భరక్షాంబికా మాత. ఆమెని దర్శించుకొంటే, గొడ్రాలైనా బిడ్డనెత్తుకుంటుందని విశ్వసిస్తారు .  తమిళనాడులో ఉన్న ఈ దేవీక్షేత్రాన్ని దర్శిద్దాం పదండి . 

శ్రీ గర్భరక్షాంబికా దేవాలయం  తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో, పాపనాశనం తాలూకాలోని తిరుక్కరుగావుర్ లో ఉంది . తంజావూరు-కుంబకోణం వెళ్ళే మార్గంలో కుంభకోణం దాటాక ఇరవై కిలోమీటర్ల ప్రయాణిస్తే, ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ప్రధాన ఆలయంలో అమ్మవారు సుమారు 7అడుగుల ఎత్తు ఉన్న స్వరూపంగా దర్శనమిస్తారు. భక్తితో చూసే వారికి కంచిపట్టు చీరలో,సర్వాలంకార భూషితమైన అమ్మ చెయ్యరా చేరదీసుకుంటున్న భావన కలిగి , ఒళ్ళు గగుర్పొడచడం ఖాయం . అటువంటి మాతృస్వరూపిగా , ప్రసన్న వదనంతో , చిరుమందహాసంతో , అనంతవాత్సల్యంతో అమ్మ దర్శనమిస్తారు.  ఆమె అనుగ్రహం కూడా అమ్మచూపులాగే, చల్లగా, నిండుగా, హాయిగా ఉంటుంది . తన దర్శనమాత్రం చేత ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత లోపాలను తొలగించి, సంతాన ప్రాప్తిని కటాక్షిస్తుందని నమ్మకం.   . 
  
అలాగే ఈ క్షేత్రానికి మాధవీ క్షేత్రం అని కూడా పేరు. మాధవీ అంటే సంస్కృతములో మల్లెలు అని అర్థం. ఈ స్థల వృక్షం కూడా మల్లె తీగయే. ఇక్కడి పరమేశ్వరుడు ‘ముల్లైవనాథర్‌’.  శివుడు  స్వయంభువుగా వెలిసిన అరవైనాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ శివలింగం పుట్ట మన్నుతో తయారయినటువంటిది. అందువల్ల ఈ మల్లెలనాధుడికి జలంతో అభిషేకం చేయరు. కేవలం మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. మల్లెల గుబాళింపుల నడుమ ఈ మల్లికార్జనుడు నవవరుడిలా కాంతులీనుతుంటాడు . ఇక్కడి మల్లెల సువాసన ఆధ్యాత్మిక సౌగంధాన్ని ఆ ప్రాంతమంతా వెదజల్లుతుంటుంది . 

ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏటా తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు శివలింగము మీద చంద్ర కిరణాలు నేరుగా పడతాయి. అందుకే దాంపత్య అన్యోన్యతకి ఈ క్షేత్ర దర్శనం శుభదాయకం అని చెబుతారు పండితులు .  

ఈ ఆదిదంపతుల సన్నిధిలో వినాయకుడు ‘కర్పగ వినాయాకర్’ గా వెలిస్తే, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికూడా చెంతనే కొలువయ్యారు .  ఈయనతో పాటు నందీశ్వరుడు కూడా స్వయంభూగా వెలిశారు. 

చరిత్ర : 
ఈ ఆలయం కనీసం వేయి సంవత్సరాల నాటిదని చెబుతారు. ఆలయ గోపురం, ప్రహరీలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది . ఈ ఆలయంలో తొమ్మిదవ శతాబ్ధంలో చోళ రాజుల హయాంలో చెక్కిన శిలా ఫలకాలున్నాయి. ఈ క్షేత్రం యొక్క మహిమను అప్పార్, సుందరార్ మరియు జ్ఝాన సంబంధార్ అనే ముగ్గురు  ప్రఖ్యాత నాయనార్లు వారి పద్యములలో కీర్తించారు. వీటిని తమిళంలో పత్తిగం అంటారు. ఈ ముగ్గురు నాయనార్లు ఈ క్షేత్రంలోని ఆయల దర్శనానికి వస్తున్న సమయంలో దారి కనపడకపోతే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరికి ఆలయ దర్శనం చేయించినట్టు స్థల పురాణం తెలుపుతున్నది.

స్థల పురాణం:
 పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మ పత్ని వేదిక తో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూఉండేవారు  అనోన్యంగా ఉండే ఆ దంపతులకి ఉన్న ఒకే సమస్య సంతానము లేకపోవడం . సంతానము కోసం ఈ దంపతులు మాతృస్వరూపిణి అయిన అమ్మవారిని, పితృస్వరూపంగా శంకరుడిని విశేషంగా  ఆరాధించారు. 

ఆ ఆదిదంపతుల అనుగ్రహంతో , ఒక శుభదినాన వేదిక గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదికకి తొమ్మిది నెలలు నిండి ఉన్నాయి .  కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది.

నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వస్తారు . అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది. ఆయన రాకని గమనించేస్థితిలో లేకపోవడంతో, మహర్షికి అతిథి మర్యాదలు విస్మరిస్తుంది .  తెలీక జరిగిన అపరాధమని ఎంచక, ఆగ్రహం చెందిన ఊర్ధ్వ పాదుడు, ఆమెను శపిస్తారు. ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలుపెడుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా కొరుక్కొనిపోవడం మొదలవుతుంది . 

గర్భశోకంతో దుఃఖిస్తూ , వేదిక , సర్వ మంగళ స్వరూపమైన ఆ పార్వతీ మాతను ప్రార్ధిస్తుంది. అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షం అయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధం గా రక్షింపబడిన శిశువు ఆ కుండలోఎదుగుతాడు . చక్కని మగ పిల్లవానిగా బయటికి వస్తాడు. వాడికి నైధ్రువుడు అని పేరు పెడతారు. అప్పుడే పుట్టిన ఈ శిశువుకి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. 

ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి, శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా తమని ఆశ్రయించే వాళ్లకి గర్భరక్షని కలుగజేయమని ప్రార్ధిస్తారు. ఆవిధంగా ఆ తల్లి గర్భాంబికగామారి , గర్భిణీలకు, గర్భస్ధ శిశువుకి రక్షణగా ఉండడమే కాకుండా నిస్సంతులైనవారిని కూడా తన కటాక్షవీక్షణాలతో అనుగ్రహిస్తుంది .  

ఈ క్షేత్ర దర్శనానికి స్థానికులే కాదు, ఇతర రాష్ట్రాల నుండి, దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore