Online Puja Services

ఈ కాళీమాతకి నూడుల్సే నైవేద్యం.

3.134.104.173

ఈ కాళీమాతకి నూడుల్సే నైవేద్యం. 
-లక్ష్మీ రమణ 

అమ్మవారి దేవాలయమైన , అయ్యవారి దేవాలయమైన గుడిలో లడ్డూ, పులిహోర, కేసరి, పరమాన్నం వంటి సంప్రదాయ పదార్థాలు ప్రసాదంగా పెట్టి , వితరణ చేస్తారు .  కానీ మన దేశంలోని ఓ కాళీ మందిరంలో అమ్మవారికి నూడుల్స్‌ని నైవేద్యంగా సమర్పిస్తారట. ఇదొక్కటే  కాదు, చాప్ సుయ్, వేయించిన కాయగూరలు,స్టికీ రైస్‌, వంటి చైనీస్‌ వంటకాలతోనే అమ్మను ప్రసన్నం చేసుకుంటారట! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయినా ‘మన దేవతకు చైనా నైవేద్యాలేంటి?’ అనుకుంటున్నారా! దేవికి ప్రాంతీయతని ఆపాదించడంలో అర్థంలేదు. పైగా ఆ లోకమాత స్వయంగా విశ్వస్వరూపిణి కదా !  ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుందో తెలుసుకుందాం పదండి . 

కాళీ మాత ఆరాధన బెంగాల్ వారు విశేషంగా చేస్తుంటారు . కాళీమాత కి కూడా ఈ రాష్ట్రమంటే మక్కువ ఎక్కువేమో! ఆమె స్వయం వ్యక్తమైన ప్రదేశాలు కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కుగాఉన్నాయి . భక్తులు నూడుల్స్ నైవేద్యంగా సమర్పించే కాళీ మాత ఆలయం కూడా కోల్‌కతాలోనే ఉంది. ఇక్కడి టాంగ్రా అనే ప్రాంతంలో ఉందీ మందిరం. ‘చైనా టౌన్‌’గా పిలిచే ఈ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి ‘చైనీస్‌ కాళీ టెంపుల్‌’ అని పేరు. అంతేకాదు, టిబెటన్‌, తూర్పు ఆసియా సంప్రదాయాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదే దేశ, విదేశీ పర్యటకుల్ని ఇక్కడికి అధికంగా ఆకర్షిస్తుందని స్థానికులు చెబుతారు.

80 ఏళ్ల చరిత్ర!

నిజానికి ఈ దేవాలయం ఈనాటిది కాదు.. సుమారు 80 ఏళ్ల నుంచే ఇక్కడి కాళీ మాత భక్తుల పూజలందుకుంటోంది. అయితే 20 ఏళ్ల క్రితం వరకు ఓ చెట్టు కింద ఉన్న రెండు గ్రానైట్‌ రాళ్లను కుంకుమతో పూజించేవారు భక్తులు. ఆ తర్వాత బెంగాల్‌, చైనాకు చెందిన కొన్ని కమ్యూనిటీలు కలిసి ఈ చైనీస్‌ కాళీ ఆలయాన్ని నెలకొల్పి, అందులో కాళీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించారట! 

అదీ సంగతి! కాబట్టి నూడుల్స్ నైవేద్యం పెట్టమ్మా ! దద్దోజనం వద్దమ్మా ! అని గారాలుపోయే పిల్లల మాట ఎప్పుడూ కాకపోయినా , అప్పుడప్పుడు ఓకే చేద్దామా ? కానీ దద్దోజనం ఆరోగ్యానికి చేసే మేలు అమ్మకి తెలుసుగా !

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya