Online Puja Services

రహస్యాలతో ముడిపడి ఉన్న ఆలయాలు!

3.17.150.89

నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉన్న ఆలయాలు!
- లక్ష్మి రమణ 

భారతదేశం వేద నాగరికత గల గొప్ప చరిత్రతో కూడిన పురాతన దేశం. చరిత్రను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగునా అనేక దేవాలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉండడం విశేషం. సైన్స్ కు కూడా అంతుచిక్కని ఈ ఆలయాల గురించి తెలుసుకోవడం, ఆ ప్రదేశాలకు పర్యటించడం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికర కధ ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికీ పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే అటువంటి కొన్ని  హిందూ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. సంగీతాన్ని వినిపించే మెట్లు, తమిళనాడు :

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రవిడ నిర్మాణ శైలిలో 'ఐరావతేశ్వర ఆలయం' ఉంటుంది. ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం. పరమ శివుడు పూజలందుకునే ఈ దేవాలయాన్ని 12వ శతాబ్ధంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించాడు. ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి. వీటిపై తడితే ఏడు రకాల శబ్ధాలు వినిపిస్తాయి. మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ ఏడు స్వరాలను వినవచ్చు.

2. స-రి-గ-మ సంగీత స్తంభాలు, కర్ణాటక :

కర్ణాటకలోని చారిత్రక హంపి నగరంలో శ్రీ విజయ విట్టల దేవాలయం ఉంది. శిధిలమైన విట్టల బజార్ కు చివరిలో ఉన్న ఈ ఆలయానికి హంపిలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు. 15వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఆలయంలో రంగ మండప పేరుతో 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటినే స-రి-గ-మ స్తంభాలు అని కూడా అంటారు. ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలోని డో-రె-మి-స సంగీత స్వరాలు వినిపిస్తాయి.

3. వేలాడే స్తంభం,ఆంధ్రప్రదేశ్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వీరభద్ర దేవాలయం ఉంది. దీనినే లేపాక్షి ఆలయం అని కూడా అంటారు. అద్భుతమైన నిర్మాణ కళతో కనిపించే ఈ దేవాలయంలో వేలాడే స్తంభం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయ పరిసరాల్లో ఉండే 70 స్తంభాలలో ఒకటి మాత్రం ఆశ్చర్యంగా గాలిలో ఉంటుంది. వీరభద్ర దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులు ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఈ స్తంభం కింద నుంచి వస్త్రాలు పెట్టి తీస్తుంటారు. ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం ఎలా వేలాడుతుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది.

4. గ్రానైట్ దేవాలయం, తమిళనాడు :

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో అద్భుతమైన శిల్ప కళతో అలరారే ఆలయం 'బృహదీశ్వర దేవాలయం'. ఈ ఆలయంలో చాలా భాగం గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది. అయితే దీనికి 60 కిలోమీటర్ల పరిధి మేర ఎక్కడ కూడా గ్రానైట్ నిక్షేపాలు లేకపోవడం విశేషం. ఈ ఆలయ గోపురాన్ని 80 టన్నుల ఏకరాతి గ్రానైట్ శిలపై నిర్మించినట్లు చెబుతారు. ఒకవేళ సుదూర ప్రాంతాల్లో గ్రానైట్ నిల్వలు ఉన్నా ఏక శిలా రాతిని తరలించడం మాత్రం అసాధ్యం. ఈ ఆలయం నిర్మాణం యొక్క మర్మాన్ని ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు.

5. దేవ్ జీ మహరాజ్ మందిర్, మధ్య ప్రదేశ్:

ప్రతి నెలా పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను, దుష్ట శక్తులను వదిలించుకోవడానికి మధ్య ప్రదేశ్ లోని దేవ్ జీ మహరాజ్ ఆలయానికి వస్తుంటారు. దుష్ట శక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతులపై కర్పూరం వెలిగించి వాటిని వదిలించడం ఇక్కడి సాధారణ పద్ధతి. వారి చుట్టూ పరిగెత్తడం లేదా చీపురుతో కొట్టడం వంటివి కూడా చేస్తుంటారు.

దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ 'భూత్ మేళా' లేదా 'దెయ్యాల ఉత్సవం' నిర్వహిస్తుంటారు. భారతదేశం యొక్క పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది ఒకటి.

6. కాలభైరవనాథ్ దేవాలయం, వారణాసి:

పవిత్ర వారణాసి నగరంలో గల కాల భైరవ్ నాథ్ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఇక్కడ నమ్మశక్యం కానీ నిజం ఏమిటంటే కాల భైరవ్ నాథ్ కు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు, స్వీట్స్ ను అమ్ముతుంటారు. కానీ ఇక్కడ ఆలయం బయట మద్యాన్ని అమ్మడం విశేషం.

7. కొడంగల్లూర్ భగవతి ఆలయం, కేరళ:

కాళీ దేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళి దేవికి కొడంగల్లూర్ భగవతి ఆలయంలో ప్రతి ఏటా ఏడు రోజుల వింత భరణి పండుగ నిర్వహిస్తుంటారు. ఈ పండుగలో మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి, కత్తులు పట్టుకుని ఒక తెలియని స్థితిలో తిరుగుతుంటారు. రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు.

అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతారు. ఆ తరువాత ఆలయం స్తంభాలను కర్రలతో పదేపదే కొడతారు. పండుగ తరువాత 7 రోజులు ఆలయాన్ని మూసి వేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు.

8. బ్రహ్మ ఆలయం, పుష్కర్, రాజస్థాన్:

ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగా రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఔరంగజేబు కంట పడినా కూడా నేటికీ చెక్కుచెదరక మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మ దేవుని ఆలయం ఒకటి. ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం ఇదే. హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడా గుడి లేకపోవడం విశేషం.

పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలో గోడలు వెండి నాణేలతో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇవి దాతలు, భక్తుల పేర్లతో కనిపిస్తాయి.

9. దేవరగట్టు ఆలయం, ఆంధ్రప్రదేశ్:

భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కర్రలను చేతపట్టుకుని అర్ధరాత్రి వరకూ ఒకరి తలలపై ఒకరు కొట్టుకుంటారు.

ఇక్కడి మాల మల్లేశ్వరుడు (శివుడు) చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తుంటారు. దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇదివరకు లాఠీలకు బదులు గొడ్డలి, బాకులను వాడే వారు.

10. మహేందిపుర్ బాలాజీ దేవాలయం, రాజస్థాన్:

రాజస్థాన్ లోని డౌస జిల్లాలోని మహేందిపుర్ బాలాజీ దేవాలయానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దెయ్యాల్ని, ఆత్మల్ని వదిలించుకోవడానికి వస్తుంటారు. వీపరీతమైన చర్యల ద్వారా, ఉదాహరణకు శరీరంపై వేడి నీరు పోయడం, పై కప్పు నుంచి వేలాడదీయడం, గోడలకు తలను కొట్టడం, గోడలకు మనిషిని తాళ్లతో కట్టడం వంటివి దుష్టశక్తుల నుంచి బాధితున్ని బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు. భారతదేశంలో ఇప్పటికీ భూతవైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది.

ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. అలాగే ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతారు. ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు.

11. కామఖ్య దేవి ఆలయం, అస్సాం:

అస్సాంలోని గువహతిలో ఉన్న నీలాచల్ కొండపై భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి ఆలయం ఉంది. భారతదేశంలోని 51 పురాతన శక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజలందుకుంటుంది. దీనిపై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతుంటారు.

ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో ఈ దేవత రుతుక్రమం జరుగుతుంది. అందుకే ఆ సమయంలో మూడు రోజుల పాటు దేవాలయాన్ని మూసి వేస్తారు. ఆలయం తెరిచే నాల్గవ రోజు వరకూ ఇక్కడ తాంత్రిక సంతానోత్పత్తి పండుగ లేదా అంబుబచి మేళాను జరుపుతుంటారు. ఈ మూడు రోజుల్లో ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర వచ్చే జలం ఎర్రగా వస్తుందని చెబుతారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను కానుకగా సమర్పిస్తుంటారు.

12. గురుద్వార , పంజాబ్ :

పంజాబ్ లోని మోహాలి జిల్లాలో ఉంది గురుద్వార. 1659లో సిక్కుల ఏడో గురువు గురు హర్ రాయ్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గురుద్వారలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఇక్కడున్న మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకు ఏడాది పొడవునా.. మామిడి పండ్లు ఉంటాయి. సీజన్ తో సంబంధం లేకుండా పండ్లు కాస్తూనే ఉంటాయి.

13. నాగపూజలు , మహారాష్ట్ర :

 మహారాష్ర్టలోని షోలాపూర్ జిల్లా షేప్టాల్ గ్రామంలో పాముల పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు ప్రత్యేకంగా కొంత ప్రదేశం కల్పిస్తారు. ప్రతి ఇంట్లో మనుషులు మాదిరిగా, పాములు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఎవరినైనా పాము కరిచినట్లు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు.

14. ఖబీస్ బాబా ఆలయం , ఉత్తరప్రదేశ్ :

సితాపూర్ జిల్లాలోని ఖబీస్ బాబా ఆలయం చాలా విచిత్రం కలిగిస్తుంది. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు.పూజారీ ఉండరు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతారు. ప్రచండమైన శివ భక్తుడు ఖబీస్ బాబా ఇక్కడ ఉంటారు. ఇతను సాయంత్రం భక్తులు సమర్పించే మద్యం సేవించి. భక్తుల అనారోగ్య సమస్యలను నయం చేస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం.

నమ్మకమే ఆలంబనగా భక్తులు, భక్తుల భక్తే పరమానందమైన భగవంతుడు . ఇదేకదా, భక్తులకి , భగవంతునికి ఉన్న అన్యోన్య సంబంధం .  ఆశ్చర్యంలో ముంచెత్తే, ఈ ఆలయాల విశేషాలు వీలయితే చూసిరండి !

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore