Online Puja Services

యుగా౦తాలను సూచించే దేవాలయం

3.145.93.210

యుగా౦తాలను సూచించే దేవాలయం
లక్ష్మీ రమణ 

కృష్ణవేణమ్మ దుర్గమ్మ ముక్కుపుడకని అందుకుందంటే , యుగాంతమే అని నమ్ముతారు తెలుగు ప్రజలు. కానీ అక్కడ మాత్రం, ఒంటికాలుమీద నిలబడ్డ శివ మండపం కూలితే, ఇక యుగాంతమే అని నమ్ముతారు . నాలుగు పాదాలున్న ధర్మదేవతకి ప్రతిరూపంగా చెప్పే , నాలుగుకాళ్ల మండపంలో కొలువైన శివయ్య కథ ఇది . ప్రక్రుతి ఒడిలో సేదతీరాలనుకొనే ఔత్సాహికులకు దాహం తీర్చే ఒయాసిస్సిది . 

 మన దేశంలోని మహారాష్ట్ర ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని కలిగిన ప్రదేశం . మహారాష్ట్రలో జన్మించిన ఏందో భక్తాగ్రేశ్వరులు భగవంతుని అస్తిత్వాన్ని చాటారు . జ్ఞానమార్గాన్ని బోధించి ముక్తిని పొందారు .  అటువంటి పుణ్యనేలపై 

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కైలేశ్వర  గ్రామంలో  హరిశ్చంద్ర ఘడ్ కోట ఉంది.  దీని దగ్గర గుహలాంటి నిర్మాణం ఒకటి ఉంది.ఈ గుహలోనే ఉంటుంది యుగా౦తాలను సూచించే దేవాలయం . ఈ గుహలో నాలుగు కాళ్ళ మండంలో ఒక మహా శివలింగం ఉంటుంది . ఈయనని కేదారేశ్వరుడనే పేర పిలుస్తారు . ఈ శివలింగం ఎల్లకాలమూ అయిదు అడుగుల లోతు ఉండే నీటిలో ఉంటుంది . ఇక్కడి చమత్కారం ఏంటంటే, స్వామికి గొడుగైనా ఆ నాలుగుకాళ్ళ మండపానికి మూడుకాళ్ళు విరిపోయి ఉంటాయి . కేవలం ఒకేఒక్క కాలిపై నిలబడి కేదారేశ్వరునికి గొడుగుపడుతుంటుంది ఈ మండపం . ఈ మండపంలోని ఒక్కో స్తంభం ఒక్కో యుగానికి సంకేతమని చెబుతారు . సత్యయుగం , త్రేతాయుగం , ద్వాపరయుగం గడిచిపోయాయి . ఇక ఇప్పుడు నడుస్తోంది కలియుగం . దీనికి సాక్ష్యంగానే కేవలం ఒంటికాలుమీద నిలబడింది ఈ మండపం . పేరేమో సత్యానికి మారుపేరైన హరిచంద్రుడిది . ఆలోపల ధర్మం ఒంటికాలుమీద నడిచే  కలియుగం , ఆ మధ్యలో ధర్మమే గొడుగైనా కాలుడు ! అద్భుతమైన దర్శనం కదూ !!

ఈ ఆలయ నిర్మాణం ఎవరు, ఎప్పుడు చేశారు అన్న ఆధారాలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు . ఈ కేదారేశ్వర దేవాలయం నాలుగు గోడలనుంచీ నిర౦తరం చల్లని నీరు ప్రవహిస్తూనే ఉండటం గొప్ప విశేషం ‘కానీ వర్షాకాలం లో మాత్రం గుడిలో చుక్క నీరు కూడా ఉండకపోవటం మరో వింత .హరిశ్చంద్ర ఘడ్  కోట విషయం అగ్నిపురాణం ,స్కాందపురాణం వగైరా పురాణాలలో చెప్పబడింది అంటే ఎంతో పురాతన కోట అని అర్ధమౌతుంది.

 ఇతర విశేషాలు :

హరిశ్చంద్ర కోటలోపల ఒక రహస్యమైన సొరంగమార్గం గుండా వెడితే అక్కడ ఒక నీటి కొలను కనిపిస్తుంది .ఇక్కడ మరో శివదర్శనం లభించేది . ఇక్కడ  ఉన్న శివలింగం మరకత మణి లింగం  .నీరు కూడా ఈ మరకత మణి రంగులో లింగం చుట్టూ ఉంటుంది. అయితే, కాలక్రమం లో ఆ మరకత మణి లింగం దొంగలపాలయింది .కానీ, ఇప్పటికీ ఈ ఆలయం లో కనకాంబరం రంగులో ఉన్న వినాయక విగ్రహం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది  .ఈ గణేశుని నిత్యం వేలాది భక్తులు సందర్శిస్తారు .ఆలయం నల్ల గ్రానైట్ రాతి నిర్మాణం. మధ్యలో యెర్రని గణపతి .గుడిలో ఏకశిలా నందివిగ్రహం.  దానికెదురుగా అతి పురాతన శివలింగం .  స్తంభాలపై ప్రాచీకాలంనాటి సుందర శిల్పాలు. చూపారులని కట్టిపడేస్తాయంటే అతిశయోక్తికాదు .

సప్తతరణి:
  
హరిశ్చంద్ర ఘడ్ దగ్గర సప్తతరణి అనే చోట ఏడు గుహల వరుస సముదాయం ఉంటుంది .దీనికి ఒకప్రత్యేకత ఉంది .ఈ గుహల వద్ద నిలబడితే చాలు ఎసి లో ఉన్నదానికంటే అతి చల్లదనం అంటే మైనస్ డిగ్రీల చల్లదనం అనుభవించవచ్చు.  ఈ గుహల ఎదురుగా నీటి కొలనూ ఉన్నది . అది కొలను నీటి ఆహ్లాదమో, గుహల చల్లదనమో ఎవ్వరూ అంచనావేయలేరు . అనుభవించి ఆనందం పొందాల్సిందే తప్ప, ఆధ్యాత్మిక శాంతిని వర్ణించగలవారెవ్వరు ? బయట చిన్న జలపాతమూ ఆకర్షణీయమే .లోపల విశ్రాంతి తీసుకొనేందుకు వీలుగా చిన్న మందిరం కూడా ఉంటుంది . దీనికి అనుబంధంగా పెద్ద గణేశ విగ్రహం కొలువుతీరి ఉంటుంది . 

చుట్టూ ప్రక్రుతి పారవశ్యమే . 

ఎక్కడ సత్యం , ధర్మం చెట్టాపట్టాలేసుకొని పరమేశ్వరుణ్ణి తాదాత్మ్యం తో పూజిస్తాయో , అక్కడ ప్రకృతి పరవశించిపోకుండా ఎలా ఉంటుంది . అమ్మ ఎప్పుడూ అయ్యవారి ఆనందాన్నే కదా కోరుకుంటుంది . ఈ కేదారేశ్వర స్వామి దర్శనం చేయడమంటే, ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు , ప్రకృతి పారవశ్యంలో ఓలలాడడం కూడా !! 

హరిశ్చంద్ర ఘడ్ కోట చుట్టూ ఆహ్లాదాన్ని,తన్మయత్వాన్ని పంచే ప్రకృతి అందం విస్మయాన్ని కలిగిస్తుంది . ఈ చుట్టుపక్కల ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.మల్షేజ్ ఘాట్, పిమ్పల్‌గావ్‌ జోగా డ్యామ్, ప్లేమింగో పక్షులు,శివాజీ పుట్టిన కోట ఇలా ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

హరిశ్చంద్ర ఘడ్ కోట నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్షేజ్ ఘాట్ ప్రకృతి అందాల ప్రేమికులకే కాదు ట్రెక్కింగ్ అంటే పడిచచ్చే సాహస క్రీడల ప్రేమికులకు కూడా స్వర్గధామమే.మల్షేజ్ ఘాట్ కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ హరిశ్చంద్ర ఘడ్ కోట చేరుకోవడం జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపంగా మిగిలిపోతుంది. ఇక్కడికి సమీపంలోని పిమ్పల్‌గావ్‌ జోగా డ్యామ్ ప్రాంతాల అందాలతో పాటు జామ పోలంక, విస్లింగ్ త్రష్, కంజు పిట్ట, నీల బోలకోడి లాంటి పక్షుల విహంగ విహారం కళ్లకు,మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది.

ఇలా చేరుకోవచ్చు :

థానే, పూణే మరియు అహ్మద్ నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న హరిశ్చంద్ర ఘడ్ చేరుకోవాలంటే థానే జిల్లా నుంచి కల్యాణ్ అనే పేరుగల ఊరికి బస్సులో లేదా ప్రైవేటు,సొంత వాహనాల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి ఖుబిఫట గ్రామానికి చేరుకొని మళ్లీ అక్కడి నుంచి ఖిరేశ్వర్ గ్రామానికి బస్సు లేదా ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించాలి ఖిరేశ్వర్ నుంచి ఏడు కి.మీ వరకు ట్రెక్కింగ్ చేస్తే కొండమీదున్న హరిశ్చంద్రగడ్ కోట చేరుకోవచ్చు.లేదా కొత్తగా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిన రాజూర్ నుంచి కొథలె(లోయ ప్రాంతం) కాలినడకన వెళ్తే యుగాంతం చోటు కు వెళ్ళవచ్చు.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore