Online Puja Services

గుడికి ఎందుకు వెళ్ళాలి?

3.135.205.146

*గుడికి ఎందుకు వెళ్ళాలి?*

మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.

గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.

మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.

భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.

దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.

అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.

ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.

ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.

గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.

మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.

గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.

తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.

లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.

భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore