ఇక్కడ ఏడాదికోసారి ఇచ్చే పెన్నుల ప్రసాదానికి పెద్ద లైనే ఉంటుంది

3.239.129.91

ఇక్కడ ఏడాదికోసారి ఇచ్చే పెన్నుల ప్రసాదానికి పెద్ద లైనే ఉంటుంది. 
-లక్ష్మీ రమణ  

సిద్ధి , బుద్ధి ఉన్నవాడు , సకల కార్యాల విఘ్నాలనూ తన అదుపులో ఉంచుకున్నవాడూ వాటన్నింటికీ అధిపతి, స్వామి , గణపతి . ప్రత్యేకించి ఈ గాణపై అనుగ్రహం ఉంటె, ఇక పరీక్షల్లో హిట్టే కానీ , ఫట్టుండదని నమ్మకం . బుర్రలో ఆవగింజంత గుజ్జయినా లేపోతే, చేసేదేమీ లేదుగానీ, కాస్తో కూస్తో డొక్కశుద్ది ఉంటె, ఈ స్వామీ అనుగ్రహంతో ఇక తిరుగుండదని స్థానికుల విశ్వాసం . మహిమల ఈ గణపతి దర్శనానికి పోయొద్దామా !

అమలాపురానికి 12 కి.మీ. దూరంలోఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది.

ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కృపాకటాక్షాలతో భక్తుల ని అనుగ్రహిస్తున్నారు . 

 స్వయంభువు గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం కృతయుగం నుంచీ ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. 14వ శతాబ్ది కాలంలో శంకరభట్టు సంస్కృతంలో రచించిన ‘శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర’ గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకారం క్రీ.శ. 1320 లో శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినట్లు, వారి మాతామహులైన మల్లాది బాపన్నావధానులు అయినవిల్లి క్షేత్రంలో స్వర్ణగణపతి మహాయఙ్ఞం జరిపినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధివినాయకుడే స్వర్ణకాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు. ఆ కాలంలో ముగ్గురు నాస్తికులు ఈ సిద్ధివినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా, ఆ ముగ్గురూ మరుజన్మలో గుడ్డి, మూగ, చెవిటివాళ్ళుగా పుట్టినట్టూ, వాళ్ళు కాణిపాక స్థలంలో సేద్యం చేస్తూంటే, బావిలో కాణిపాక వినాయకుడు దొరికినట్టు ఈ గ్రంథం చెబుతుంది. దీన్నిబట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే, అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం ప్రాచీనమైందని తెలుస్తోంది.

దక్షప్రజాపతి తన యఙ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధివినాయకుని పూజించాడని స్థానికులు చెబుతారు. అందుకే పూర్వంనుంచీ ఈ స్వామివారంటే భక్తులకు అపారమైన నమ్మకం, గురి. సిద్ధివినాయకస్వామికి ప్రతి నిత్యం రుద్రాభిషేకాలు, అష్టోత్తర పుష్పర్చన, పుస్తకపూజ, అన్నప్రాశ్న, అక్షరాభ్యాసాలు, విశేషంగా జరుగుతూంటాయి. ఉభయ చవితి తిథులలోను, దశమి, ఏకాదశి తిథులలోను, పర్వదినాలలోనూ ఈ స్వామికి విశేషపూజలు జరుగుతాయి. సంకటహర చతుర్థినాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు.

వీటితోపాటు సకల ఈతిబాధా నివారణార్థం శ్రీ మహాలక్ష్మీ గణపతి యాగం కూడా చేస్తారు. వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి.

వినాయక చవితి
రోజున రకరకాల పండ్లరసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి పర్వదినాన దేశం లోని సప్త జీవనదుల(గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి) జలాలతో ‘సప్తనదీ జలాభిషేకం’ చేస్తారు.

ఈ వినాయక వైభవంలోని కలికి తురాయి ఏంటంటే,  ప్రతియేటా విద్యార్థుల కోసం -వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి 2,3 వారాలలో దాదాపు లక్ష పెన్నులతో శ్రీ స్వామివారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా బహూకరించడం జరుగుతుంది . ఈ పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల విశ్వాసం. 

విశాల ప్రాంగణం గల ఈ సిద్ధివినాయకస్వామి ఆలయ ప్రాకారంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, శ్రీభూసమేత కేశవస్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవస్వామి ఆలయం ఉన్నాయి. అందుకే ఈ ఆలయం పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.మొదట్లో ఈ ఆలయానికి కేశవస్వామి క్షేత్రపాలకుడుగా ఉండేవాడు. అయితే, తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించినట్లు చారిత్రక శాసనాలవల్ల తెలుస్తుంది. 

దక్షయజ్ఞం జరిగేకన్నా ముందునాటి దేవుడని , స్థలపురాణం చెబుతోంది . అంటే, శక్తిపీఠాలు ఏర్పడిన కాలం కన్నా ముందరి వాడీ గణపతి . యుగాల తరబడి ఈ క్షేత్రంలో నిలిచి పూజలందుకొని , భక్తులని కటాక్షిస్తున్నాడు . వీలయితే తప్పక దర్శనం చేసుకోండి .  

శుభం

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi