ఇక్కడ త్రిపురసుందరి స్వయంగా మాట్లాడుతుంది

3.239.129.91

ఇక్కడ త్రిపురసుందరి  స్వయంగా మాట్లాడుతుంది . 
-లక్ష్మీ రమణ 

విగ్రహాలు మాట్లాడతాయా ? రాతిబొమ్మని పూజిస్తూ , దేవతని భ్రమించడం మీ మూర్ఘత్వం . అనేవారికి ఈ ప్రాంతంలో మాట్లాడుతున్న విగ్రహాలు ధీటైన జవాబు చెబుతాయి . స్త్రీ లో  నువ్వు తల్లిని , చెల్లిని  ,భార్యనీ చూసినప్పుడు వేరువేరు స్పందనలు ఉద్భవిస్తున్నాయి కదా ? అలాగే కొలిచేరాయి కూడా ఆ మూర్తిలో , భక్తుని భావనలో దైవం అవుతుంది అని ఒక మహానుభావుడు చెప్పిన మాటలు ఇక్కడ అమ్మ రూపంలో సాక్షాత్కరిస్తాయి . తాంత్రిక ఆచారాలను పాటించే ఈ దేవాలయంలో ఇటువంటి వింత ఉండడం విచిత్రమేమీ కాదంటారు సాధకులు . రండి ఆ దేవాలయ సందర్శనం చేద్దాం . 

  తన్యతే విస్తర్యతే జ్ఞానం -ఇతి తంత్రం అని కదా వచనం . తంత్రం అనే పదం తన్ అనే ధాతువు నుండీ వచ్చింది . జ్ఞానం దేనిచేత విస్తరింపబడుతుందో దానినే తంత్రము అంటారు . దాన్ని నమ్ముకున్న భక్తులని అది కాపాడుతుందని విశ్వాసం ఉంది . దివ్యమైన లక్ష్యాన్ని ఛేదించుకొని , ఈశ్వరునితో ఐక్యమవ్వడం అనేది దీనివలన సిద్ధిస్తుంది .   

కానీ తాంత్రిక విధానాన్ని అవలంభించడం చాలా కష్టమైనది . సమాజకట్టుబాట్లకు ఒక విధంగా వ్యతిరేకమైన వామాచార విధానం ఇందులో ఉంటుంది . ఇది అత్యంత రహస్యమైనది . సాధకులకు కైవల్య ప్రదాయకమైనది. దశమహావిద్యాలుగా అమ్మవారి శక్తి సాధన ఇందులో ఒక భాగం . సాధకులు సరైన ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంభించపోయినట్లయితే, చెడుమార్గాలని పట్టి భ్రష్టుడయ్యే అవకాశం ఉంటుంది .  అయితే, ఈ దశమహా విద్యలకి సంబంధించిన ఆలయం కధే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అమ్మవారి ఆలయం .  

భారతదేశపు తూర్పుభాగాన ఉన్న బీహార్ రాష్ట రాజధాని పాట్నాలోని బస్తర్ లో ప్రసిద్ధ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ఆలయం ఉంది. దుర్గా దేవి యొక్క అనేక అవతారాలలో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి కూడా ఒక్కటి అని మనకు తెలిసిన విషయమే. ఇక్కడ అమ్మ దశమహా విద్యలలో ఒకటైన త్రిపుర సుందరిగా  భక్తులచే పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం దేశవ్యాప్తంగా వందల వేల మంది భక్తులను ఆకర్షిస్తుంది.

అమ్మ ముల్లోకాలకి సుందరి. కాబట్టి  త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయసు లో ఉండి , పదహారు కోరికలు కలది కాబట్టి  షోడసి అని వ్యవహరిస్తారు.త్రిపుర అనగా ముల్లోకములు. త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.

అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము ఉంది . భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత మూడు రూపాలలో దర్శనమిస్తుంది . ఇచ్ఛాశక్తికి , జ్ఞానశక్తి , క్రియాశక్తికీ ప్రతీకగా కూడా ఈ దేవిని  త్రిపురసుందరిగా వ్యవహరించడాం జరుగుతుంది .  

ఇక లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి, లయలు దేవి ఆడే ఆటలు. అటువంటి దేవిని తాంత్రిక శక్తులతో ఇక్కడ స్థాపించారు . 
 
400 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు. ప్రధానాలయంలో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి కొలువైయుంటారు . ఆలయప్రాంగణంలో బతుకు భైరవ, దత్తాత్రేయ  భైరవ, అన్నపూర్ణ భైరవ, కాల భైరవ మరియు మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి, తారా విగ్రహాలు కుడా ఉన్నాయి .

రాత్రి సమయంలో, ఆలయం మూసివేశాక ఈ ఆలయంలో నుండీ అనేక శబ్దాలు వినిపిస్తాయి . యేవో సంభాషణలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంటుంది .  కానీ ఆ భాష దేవభాషో , స్మశాన భాషా అనే అర్థం కాదు . కానీ మాటలు మాత్రం వినిపిస్తుంటాయి . ఎక్కడివి ఈ సంభాషణలు అని స్థానికులు ఆరాతీశారు . అవి ఆలయంలోనుండీ వస్తున్నాయని నిర్ధారించారు . స్థానికులు ఈ ఆలయ ప్రాంగణంలోని దేవతా స్వరూపాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారని నమ్ముతారు. 

ఇక్కడ రోజులో మూడురూపాలని ధరించి ప్రత్యక్షంగా కనిపించే కాలస్వరూపిణి ధారీదేవిని , బృందావనంలో ఇప్పటికీ ఆటలాడే మురళీ మనోహరుడైన రాధాసమేత కృష్ణస్వామినీ తప్పకుండా గుర్తుతెచ్చుకోవాలి . ఇలాంటి అద్భుతాలు మరెన్నో మన హైందవ దేవాలయాలలో కనిపిస్తూనే ఉన్నాయి . అయినా మన ధర్మాన్ని మనం అంత సులభంగా నమ్మంకదా ! శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు .  ఆ శబ్దాలు ఎలా వస్తున్నాయి ? విగ్రహాలు ఎలా మాట్లాడతాయి అనేది పరిశోధనాంశం . 

ఏళ్లతరబడి తాంత్రిక భవానీ మిశ్రా వంశస్తులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు. ఆయన సంప్రదాయాన్ని , ఇక్కడి దేవతా పూజావిధులనీ ప్రత్యేక పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు . ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళి చూడగా ఆ విషయం పై వారు అమ్మవారి విగ్రహం నుండి ఏదో తెలియని శబ్దాలు అంటే అర్ధం కానీ మాటలు వచ్చాయట. అవేంటి అని మాత్రం అంతుపట్టడం లేదు. ఈ విషయం తెలుసుకోవటానికి వెళ్లిన వైజ్ఞానిక వేత్తలు కూడా ఆ రహస్యం ఛేదించలేకపోయారు.

ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఉండొచ్చు . సులభ ప్రసన్నలైన ఆ దశమహావిద్యలు ఇక్కడ సంభాషణలు చేస్తూ ఉండొచ్చు . అవి సృష్టి రహస్యాలు కావొచ్చు . అమ్మ పాలనా యంత్రాంగం, మంత్రాంగాలు ఏవైనా కావొచ్చు . ఒక శాస్త్రవేత్తకన్నా , ఒక తంత్ర సాధకుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అర్హుడేమో మరి !  

ఇప్పటికీ ఈ ఆలయం చాలా మందికి అంతుపట్టని రహస్యంగానే మిగిలింది.శక్తిసమన్వితం , ఆసక్తికరము అయినా ఈ ఆలయాన్ని గురించి చదువుతుంటే,  ఓ సారి చూడాలనిపిస్తుంది కదా. మీకు అవకాశం వస్తే అస్సలు వదులుకోకండి.! 

నమస్కారం .

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi