ఇప్పటికీ అక్కడ మంత్రంతో మేకని బలిస్తారు !

3.239.129.91

ఇప్పటికీ అక్కడ మంత్రంతో మేకని బలిస్తారు !
-లక్ష్మీరమణ 

మంత్రాలకు చింతకాయలు రాల్తాయా ? అని వెటకారం చేసేవారికి ఈ దేవాలయం ఒక సమాధానం. మంత్రంతో ప్రాణం తీసి , తిరిగి మంత్రంతో ప్రాణంపోయడమే ఇక్కడి ప్రత్యేకత . ఇప్పటికీ , ఈ కలియుగంలోకూడా ఇదే పద్ధతిని పాటిస్తూ , జగదీశ్వరి తన ఉనికిని వెల్లడి చేస్తున్న దేవాలయం ఇది . సామాన్య శకం దాదాపు 100 నుండీ 150 సంవత్సరంల మధ్య నిర్మించిన దేవాలయంగా ఈ ఆలయాన్ని చరిత్రకారులు పేర్కొనడం విశేషం. ఈ ఆలయంలో ఇప్పటికీ సాత్విక బలిని అమ్మవారికి సమర్పిస్తారు . ఇది ఇక్కడి అద్భుతం . రండి, ఆదిదేవి దర్శనానికి వెళదాం . 

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు స్వయంగా ప్రకటితమైన మహిమాన్విత క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి . ఇటువంటి పురాతనమైన ఆలయాలు అమ్మ సత్యానికి నిదర్శనమని , అటువంటి ఆలయ దర్శనం వలన సర్వపాపాలు హరించిపోతాయని ప్రజల నమ్మకం . బీహార్లోని  కైమూర్ జిల్లా, కౌరా ప్రాంతంలో ఉన్న ముండేశ్వరీ దేవి ఆలయం అటువంటి ప్రజల నమ్మికని యదార్థమని నిరూపిస్తున్నట్టుగా ఉంటుంది . ఈ ప్రపంచంలోనే ఆదిదేవి పూజలందుకున్న తొలి ప్రదేశంగా ప్రఖ్యాతిని పొందిన ఈ మహిమాన్విత క్షేత్రం బీహార్ రాష్ట్రంలో ఉంది .  ప్రపంచంలోనే మొదటి శక్తిమాత ఆలయంగా ఈ దేవాలయాన్ని పేర్కొంటున్నప్పటికీ , యుగాల సంప్రదాయమున్న వేదభూమిలో , కృతయుగం  , త్రేతాయుగం, ద్వాపరయుగం లలోకూడా విరాజిల్లిన, అప్పటినుండీ నేటి వరకూ శోభిల్లుతున్న శక్తిక్షేత్రాలు ఎన్నో ఉన్నందున , ఈ ఆలయం తొలిపూజలందుకున్న శక్తి క్షేత్రమా, కాదా అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి . 

అయితే, ఇక్కడి ముండేశ్వరీ మాతని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలలనుండీ, అనేక మంది పర్యాటకులూ, భక్తులూ వస్తుంటారు. వేల సంవత్సరాల నాటి ఆలయాలు నేడు శిథిలావస్థలో ఉన్నా, ఈ ఆలయం మాత్రం, నేటికీ చెక్కుచెదరకుండా, తన ఉనికినీ, ప్రత్యేకతని చాటుకుంటోంది. అత్యంత పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెంది, తాంత్రిక శక్తుల ఆరాధకులకు ముఖ్యమైనదిగా పేరుగాంచింది.  

ముండేశ్వరీ మాత:
ముండేశ్వరీ ఆలయం సముద్రమట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉంది. దీనిని మూడు, నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించి ఉండవచ్చని, పురాతత్వ శాఖ అధికారుల అభిప్రాయం. ఇది వారణాసికి సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. ముండేశ్వరీ అనే పర్వతంపై ఉన్న ఈ ఆలయంలో దుర్గాదేవి, వైష్ణవి రూపంలో, ముండేశ్వరీ మాతగా, దర్శనమిస్తారు . ముండేశ్వరీ మాత తీక్షణమైన దృక్కులతో , చిన్న చిన్న కోరలతో, అనేకభుజాలతో రౌద్రంగా కనిపిస్తారు . రాక్షస సంహారం చేసిన తర్వాత మాత ఆమాత్రం రౌద్రాన్ని కలిగి వుంటారు కదా ! దేవి రూపంలోని తీవ్రత దుష్టశక్తుల పాలిటి యమపాశమైనా, భక్తులపాలిట అవి రక్షణాకవచాలని చెబుతారు మంత్రద్రష్టలు .  

సాధారణంగా, దుర్గామాతకు సంబంధించిన ఆలయాలలో, అమ్మవారి వాహనంగా సింహం ఉంటుంది. కానీ, ఈ ఆలయంలో అమ్మవారి వాహనం, మహిషి. కాగా, అమ్మవారి ప్రధాన ఆలయ ముఖ ద్వారం, దక్షిణ దిక్కుగా ఉండడం మరో ప్రత్యేకం.

ఇతర దేవతలు :
 బీహార్ నాగర శైలిలో ఆలయం నిర్మి౦పబడి౦ది . నాలుగువైపులా ద్వారాలు ,కిటికీలు ఉన్నాయి .ఆలయ శిఖరం ధ్వంసమైంది.కాని కొత్తగా పునర్నిర్మిస్తున్నారు. ఆలయ ముఖ ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలున్నాయి . గంగ ,యమున మొదలైన మూర్తులున్నాయి. 

ఈ ఆలయం శక్తి ఆలయం అయినా ఈ ఆలయంలో విష్ణు భగవానుడు, శివుడు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ శివుడు నాలుగు ముఖాలతో దర్శనమిస్తాడు. వినాయక ,సూర్య ,విష్ణు విగ్రహాలు కూడా ఉన్నాయి .అనేక శిధిల విగ్రహాలు కూడా కనిపిస్తాయి .ఆర్క లాజికల్ డిపార్ట్ మెంట్ ఈ దేవాలయాన్ని సంరక్షిస్తోంది .ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల భక్తులకు వారి ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. 

పురాణ ప్రశస్తి :
అతి ప్రాచీన ఆలయమైన ఈ ముండేశ్వరీ ఆలయం, ప్రస్తుతం, పురాతత్వ శాఖ ఆధీనంలో ఉంది. స్థానిక జానపద కథల ఆధారంగా, ఈ ఆలయం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని, రాక్షసుడైన మహిషాసురుడి ఆధీనంలో, చండా, ముండా అనే ఇద్దరు సొదరులు పాలించేవారు. ప్రజలను అనేక బాధలకు గురిచేస్తుండేవారు. రాక్షసుల దురాగతాలను తట్టుకోలేని ప్రజలు, దుష్ట సంహారిణి అయిన దుర్గామాతను వేడుకున్నారు. ఆమె తన 10 చేతులతో, ఉగ్ర రూపంతో, రాక్షసులతో యుద్ధానికి పూనుకుంది. ముండ అనే రాక్షసుడిని ఈ పర్వతంపై మట్టుబెట్టి, ముండేశ్వరిగా ఇక్కడ వెలసింది. 

తరువాత చండ అనే రాక్షసుడిని, చైన్పూర్ సమీపంలోని మదురానా కొండపై సంహరించి, చండేశ్వరిగా అక్కడ వెలిసింది. ఈ గాధ మన దుర్గా సప్తశతి పురాణంలో, వివరించబడి ఉంది. ముండ అనే రాక్షసుడిని సంహరించి, ముండేశ్వరిగా వెలిసిన ఈ మాత, తాంత్రిక శక్తుల ఆరాధికులకు ఆరాధ్య దైవంగా బాసిల్లుతోంది. ఈ ఆలయంలో, ఏడవ శతాబ్దంలో, శివుని విగ్రహాన్ని ప్రతిష్టింపజేశారు. ఇక్కడున్న పరమశివుడు, తత్పురుష, అఘోరా, వామదేవ, సద్యోజాత ముఖాలతో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో కొలువైన శివుణ్ణి, మండలేశ్వర్ అని పిలుస్తారు. అంతేకాక, ఇక్కడ విష్ణు భగవానుడూ, సూర్యుడూ, వినాయకుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం నిర్మించబడినప్పటి నుండి, నేటి వరకూ, శతాబ్దాలు మారినా, పూజాదికాలు మాత్రం, నిత్యం కొనసాగుతూనేవున్నాయి. దాంతో, ఈ ఆలయం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 

సాత్వికబలి : 
అమ్మవారి నామాలలో ‘బలిప్రియా’ (132- లలితా సహస్రనామం) అనేది ఒకనామం.  త్యాగాన్ని ఇష్టపడే మాత గా ఇక్కడ మనం దేవిని అర్థం చేసుకోవాలి . కానీ ఇతర దేవీ ఆలయాల్లో సాధారణంగా కోళ్లూ, మేకలూ, పొట్టేళ్లను బలి ఇస్తుంటారు. కానీ, ఈ ఆలయంలో సాత్విక బలే ప్రధాన విశేషం. సాత్వికబలి అంటే  , మొదటగా బలి ఇవ్వాల్సిన మేకను, అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు. ఆ తరువాత పూజారి, మంత్రించిన అక్షతలను మేకపై జల్లుతాడు. వెంటనే మేక కొన్ని క్షణాల పాటు సృహ తప్పి పడిపోతుంది. తరువాత పూజారి మరలా, అక్షతలను మేకపై వేస్తాడు. దాంతో, ఆ మేక తిరిగి యథా స్థితికి వచ్చి, అక్కడి నుండి వెళ్లిపోతుంది. 

అక్షతలు వేసిన వెంటనే మేక సృహ తప్పి పడిపోవడం, తిరిగి అక్షతలు వేయగానే లేచి వెళ్లిపోవడం అనేది, భక్తులకే కాదు, అపర మేధావులకు కూడా అంతు చిక్కని రహస్యం. ఈ వింతను  చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులూ, పర్యాటకులూ వస్తుంటారు. చైత్ర మాసంలో, భక్తుల సంఖ్య రెట్టింపవుతుంది. 

చరిత్ర :
ఈ ఆలయం చుట్టు ప్రక్కల, సామాన్య శకం 625 వ సంవత్సరం నాటి శాసనాలు బయల్పడ్డాయి. సామాన్య శకం  101-77 సంవత్సరాల మధ్యకాలంలో, శ్రీలంకను పాలించిన చక్రవర్తి మహారాజా దత్తగామణి రాజముద్ర కూడా, ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో లభ్యమైంది. శ్రీలంకకు చెందిన యాత్రికుల బృందం, బోధ్ గయ నుండి, సారనాధ్ వెళ్లే మార్గ మధ్యలో, ఈ ఆలయాన్ని దర్శించి ఉండవచ్చనీ, ఇక్కడ వారి రాజ ముద్రను పోగొట్టుకుని ఉండవచ్చనీ, చరిత్ర కారుల అభిప్రాయం. 

ఇక్కడున్న గణేశుని విగ్రహాంపై, ‘నాగజనేయు’ అనబడే పవిత్ర సూత్రము ఆనవాలుంది.  శివలింగంతో పాటు, ఆలయం చుట్టుప్రక్కల, ముక్కలై చెల్లాచెదురుగా పడిఉన్న మరికొన్ని విగ్రహాలపై కూడా, పాము ఆకారాలున్నట్లు, చరిత్రకారులు గుర్తించారు. దానిని బట్టి, సామన్యశకపూర్వం 110 నుండి సామాన్యశకం 315 వరకూ పాలించిన నాగరాజవంశం వారు, ఈ ఆలయ నిర్మాణంలో భాగమైనట్లు భావిస్తున్నారు. ఎందుకంటే, వారు పామును వారి రాజ చిహ్నంగా ఉపయోగించేవారు. అంతేకాదు, మహభారతంలో కూడా, ఈ ప్రాంతాన్ని నాగ రాజ వంశీయులు పాలించినట్లు చెప్పబడింది. కౌరవులూ, పాండవులకు గురువైన ద్రోణాచార్యునికి గురు దక్షిణగా, నాగజాతి వారు నివసించే, ప్రస్తుత నగరాలైన అహినౌరా, మీర్జాపూర్, సోన్‌భద్రా, కైమూర్ ప్రాంతాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

ఈ ఆలయ శిలా శాసనాల్లో పేర్కోనబడిన ఉదయసేనకు, నాగ రాజవంశం పాలకులు నాగ సేన, వీర సేన మొదలైన వారితో పోలిక ఉంది.  నాగ వంశీయులు పాలించిన తరువాత, ఈ ప్రాంతం, గుప్త రాజుల వశమైంది. వారే ఈ ఆలయాన్ని నగర శైలిలో నిర్మింపజేసినట్లు, చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. పురావస్తుశాఖ అధికారులు, భద్రతా కారణాల వల్ల, ఆలయానికి చెందిన 9 విగ్రహాలను, కొలకత్తా సంగ్రహాలయానికి తరలించారు. వేల సంవత్సరాల నాటి ఆ అత్యద్భుత విగ్రహాలను, ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. పవిత్రతకూ, ప్రాచీనతకూ ఈ ఆలయం నిలయంగా చెప్పవచ్చు.

నిత్యం భక్తులతో కళకళలాడే ఈ ఆలయానికి దసరా నవరాత్రుల సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మను దర్శించుకుంటారు. రామనవమి, శివరాత్రి పండుగలు శక్తి ఉత్సవాలు,ఎంతో వైభవంగా చేస్తారు.

ఎలా చేరుకోవాలి :
పాట్నా ,గయా  లేక వారణాసి లనుండి ఇక్కడికి రోడ్డు ద్వారా  చేరుకోవచ్చు .దగ్గర రైల్వే స్టేషన్’’ మోహన –బాబువా జంక్షన్ రైల్వే స్టేషన్ ‘’.ఇక్కడి నుంచి దేవాలయం కేవలం 22 కిలోమీటర్లు.’’లాల్బహదూర్ ఎయిర్ పోర్ట్ వారణాసి’’ దగ్గర విమానాశ్రయం .ఇక్కడి నుండి దేవాలయం 102  కిలోమీటర్లు .

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi