ఇక్కడి శనీశ్వరుడు గరికపూజలతోనే సంతృప్తిపడతారు

44.192.25.113

ఇక్కడి శనీశ్వరుడు గరికపూజలతోనే సంతృప్తిపడతారు !
లక్ష్మీ రమణ 

సూర్యుభగవానుడికి ఛాయదేవికి పుట్టిన  సంతానం శనిదేవుడు. యమధర్మరాజుకు అన్నగారు .  అందుకే ఆయన ధర్మం తప్పరు . జీవుడైనా , దేవుడైనా ఆ ప్రభావం నుండీ తప్పించుకోవడం అనేమాట కల్ల. కానీ ఆయన ధర్మవర్తనులు , ఆధ్యాత్మిక చింతన కలిగినవారిని ఆశీర్వదిస్తారు .  అయినా సరే, ఆయనకి ఉన్న చెడ్డపేరు అంతాఇంతాకాదు . అసలు శనిదేవుని పేరు చెబితే చాలు , ఉలిక్కిపడే వారు లెక్కకి మిక్కిలిగానే ఉన్నారు . ఆయన అనుగ్రహం కోసం  ఖర్చు ఎక్కువైనా కిలోలకొద్దీ నువ్వులనూనె , నల్లనువ్వులు ఆయనకీ సమర్పిస్తుంటారు . కానీ ఈ ప్రాంతంలో కొలువైన శనీశ్వరుడు మాత్రం అవేవీ కోరకుండా కేవలం గరికెతోనే సంతృప్తి పడతాడు.  శరణన్న వారిని రక్షిస్తాడు . 

తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరునల్లూరు అనే గ్రామంలో శనిగ్రహ దేవాలయం ఉంది. ఇక్కడ వెలసిన ఈ ఆలయం ఎంతో పురాతనమైన, ప్రసిద్ధి చెందిన ఆలయం.

నలమహారాజు, దమయంతి ల అపూర్వ ప్రబంధాన్ని ఎవరు మరిచిపోగలరు .  ఆ కథలో నలుణ్ణి ఈ ప్రాంతంలోనే శనీశ్వరుడు పట్టుకున్నారని స్థల ఐతిహ్యం . ఈ ఆలయంలో వెలసిన శనీశ్వరునికి మరో పేరు దర్బరణ్యేశ్వరుడు. ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి గరిక అంటే మహాప్రీతి కరం. ఏవైనా కోరికలు కోరేవారు స్వామివారికి గరికను సమర్పించి పూజ చేయటం వల్ల వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. స్వామివారికి గరిక అంటే ఇష్టం కాబట్టి స్వామివారిని దర్బాధిపతి అని కూడా పిలుస్తారు.

ఆ ఇతిహాసాన్ని గురుతుచేస్తూ ఇక్కడ నలతీర్థం ఉంటుంది . ఇందులో స్నానమాచరించడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని చెబుతారు . 

ఈ ఆలయంలో శనీశ్వరునితో పాటు,నలనారాయణ దేవాలయం అనే వైష్ణవ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి వెళ్ళిన భక్తులు శనీశ్వరుని తో పాటు నల నారాయణ స్వామి వారిని పూజించడం వల్ల వారికి ఎటువంటి శని ప్రభావం శని దోషాలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.

ఇక్కడి  శనీశ్వరునికి వాహనంగా ఉండే కాకిని  బంగారంతో తయారు చేశారు . ఇక స్వామికి ఇష్టమైన శనివారంనాడు , ఉత్సవాల సమయంలో స్వామివారి మూలవిరాట్ కి బంగారు తొడుగు వేసి ఉత్సవాలను నిర్వహిస్తారు.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ‘శనిపీయేర్చి’ అనే ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. దీనివల్ల శనిబాథ నుండీ తాము విముక్తులమవుతామని భక్తులు విశ్వసిస్తారు  . 

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna