Online Puja Services

శనిదోషం ఉన్నవారు ఇలాచేస్తే...

18.116.40.177

శనిదోషం ఉన్నవారు ఇలాచేస్తే దోషపరిహారం అవుతుంది !

పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైనవి బిల్వాలు . 

త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మపాపసంహారం - ఏకబిల్వం శివార్పణమ్‌| 

అని ఒక్క బిల్వదళాన్ని ఆయనకీ సమర్పిస్తే మూడుజన్మాలలో చేసిన పాపాలు దగ్ధం అవుతాయాయట. మరే  వృక్షరాజానికీ లేని శివాష్టకం గౌరవం ఈ బిల్వపత్రాలతో శివుని అర్చించే ఈ బిల్వాష్టకానికి దక్కింది .  మారేడు దళాలతో తెలిసి చేసినా తెలీక చేసినా శివార్చన చేసిన జీవి అంతాన శివసాయిద్యాన్నే పొందుతుంది . కార్తీక పురాణంలో ఇటువంటి ఎన్నో అమృతోపమానమైన కథలు మనకి కనిపిస్తాయి . బిల్వపత్రం క్రింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణు మరియు అగ్ర భాగంలో శివుడు కొలువై ఉంటారు. బిల్వ వృక్షం లక్ష్మీదేవి శివుని గురించి ఘోరమైన తపస్సు చేయడం వలన ఉత్పన్నమయ్యింది . అందుకే  బిల్వవృక్షంపై శివునికి ఎంతో అభిమానం. యజ్ఞాలు, త్యాగాలు కంటే బిల్వపత్ర సమర్పణ ఎంతో శక్తివంతమైనది.  మారేడు దళాలతో అర్చించడంవలన తన భక్తులు శనిదోషంనుండీ బయటపడతారని పరమేశ్వరుడే వరమిచ్చిన వృత్తాంతం ఇక్కడ చూద్దాం . 

 ఓసారి శివుణ్ని దర్శించుకోవడానికి కైలాసం చేరుకున్నారు శని . పార్వతీ పరమేశ్వరులను భక్తితో ప్రార్థించారు . అయితే పరమేశ్వరుడికి ఎందుకో శనిని పరీక్షించాలి అనిపించింది. నేను ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా నీవు గుర్తించగలవా అని శనిని ప్రశ్నించారు. మీ అనుగ్రహం ఉన్నంత కాలం మీరు ఏ రూపంలో ఉన్నా గుర్తుపట్టగలనని శని బదులిచ్చారు. అయితే నేను ఎక్కడ ఉండేది కనిపెట్టి, నన్ను పట్టుకో చూద్దాం అని శివుడు శని దేవుడికి సవాల్ విశిరారు . మరుసటి రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించేలోగా మిమ్మల్ని పట్టుకుంటానని శని శివుడికి చెప్పారు. 

దీంతో శనికి దొరక్కుండా ఎక్కడ దాక్కోవాలా అని ఆలోచించిన శివుడు సూర్యోదయ సమయంలో బిల్వ వృక్ష రూపంలోకి మారాడు. సాయంత్రం తర్వాత, సర్వేశ్వరుడు  బిల్వ వృక్షం రూపాన్ని విడిచి తన అసలు రూపాన్ని ధరించారు. వెంటనే శివుడితోపాటే శని కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. 

శనీ! నన్ను పట్టుకోలేకపోయావుగా? అని పరమేశ్వరుడు శనిని ప్రశ్నించారు. దానికి శనిదేవుడు బదులిస్తూ.. స్వామి ‘నేను మిమ్మల్ని పట్టుకున్నాను కాబట్టే కదా.. మీరు బిల్వ వృక్ష రూపంలోకి మారారు. నేను కూడా ఈ బిల్వవృక్షంలో అదృశ్య రూపంలో మీతోపాటే నివసించాను. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. అని వినమ్రంగా పలికారు. శని దేవుడి విధి నిర్వహణకు, భక్తికి ముగ్ధుడైన పరమేశ్వరుడు ఈశ్వరుడినైన నన్నే పట్టావు కాబట్టి ఇక నుంచి నీవు నా నామాన్ని చేర్చుకొని శనీశ్వరుడిగా ప్రసిద్ధి చెందుతావని వరమిచ్చారు. 

బిల్వ దళాలతో నన్ను పూజించిన వారికి శని దోష నివృత్తి కలుగుతుంది. మారేడు ఆకులతో నాకు పూజ చేసిన వారిని, శివభక్తులను శనీశ్వరుడు బాధించరు అని అభయం ఇచ్చారు. నాటి నుంచి బిల్వ వృక్షాన్ని శివుడి స్వరూపంగా భావించి బిల్వ పత్రాలతో పరమేశ్వరుణ్ని పూజించడం సంప్రదాయంగా మారింది.

- లక్ష్మి రమణ 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore