Online Puja Services

ప్రేమా ప్రేమా నీరూపం ఏది ?

18.217.194.39

ప్రేమా ప్రేమా నీరూపం ఏది ? అంటే, నారదుని భక్తి సూత్రాలు సమాధానం చెబుతాయి ! 
-సేకరణ 

ప్రేమంటే ఏమిటంటే, అని ఏమాటా చెప్పలేక కిందామీదాపడే ప్రేమికులు  ఇక ఆబాధని పడాల్సిన అవసరం ఏమీ లేదు ! ప్రేమంటే ఇదీ అని నారదీయ భక్తి సూత్రాలు చక్కగా చెప్పాయి . భక్తి సూత్రాలలో భగవంతునిపైన అమితమైన ప్రేమని కలిగిఉండడమే భక్తి అని నారదులవారు చెబుతారు . ఇంతకీ ఆయన ప్రేమ గురించి ఏం చెప్పారో తెలుసుకుందామా !

క్రింది పంక్తులు నారదభక్తిసూత్రాలలోనివి. "భగవంతునిపై అమితమైన ప్రేమ కలిగియుండటమే భక్తి" అని నారద మహర్షి నిర్వచిస్తారు. "మఱి ప్రేమ అంటే ఏమిటీ" అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ పంక్తులు ఆ తరువాత చెబుతారు. ఆ ప్రేమలో రమించిపోయే కదా, గోదామాత ఆ రంగనాథుణ్ణి , గోపికలు కృష్ణ స్వామిని , పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి చేరుకున్నారు .  మధుర భక్తిలో ఆ సర్వేశ్వరుడే నాథుడు. జీవుడే ప్రకృతి రూపమైన ప్రేయసి . ఇంతకీ నారదుడు ప్రేమని గురుంచి ఏమన్నారు ?

51. అనిర్వచనీయం ప్రేమస్వరూపమ్|| 

ప్రేమ యొక్క నిజమైన తత్త్వం మాటలకు అందనిది, ఇలా ఉంటుందీ అని చెప్పటానికి వీలు కానిది. అనంతమైన ప్రేమను వివరించటానికి, ప్రేమతో పోలిస్తే అననంతాలైన మాటలు ఏ మూలకూ సరిపోవు.

52. మూకాస్వాదనవత్

మూగవాడు దేనినైనా కేవలం ఆస్వాదించగలడే కానీ దేనినీ మాటలలో చెప్పలేడు. అలాగే ప్రేమను కేవలం అనుభవించగలమే తప్ప దానిని మాటలలో వ్యక్తీకరించడం కుదరదు. ప్రేమయొక్క స్వరూపాన్నే కాదు, ప్రేమానుభవాన్ని కూడ మాటలలో వెలిబుచ్చలేము అని అర్థం.
ఈ సందర్భంలో సాక్షాత్ ఈశ్వరస్వరూపుడైన దక్షిణామూర్తిని స్మరించటం చాల ఉచితం.

మౌనవ్యాఖ్యాప్రకటితపరంబ్రహ్మతత్త్వం యువానం వర్షిష్ఠాన్తేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః।
ఆచార్యేన్ద్రం కరకలితచిన్ముద్రమానన్దమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే।।

53. ప్రకాశతే క్వాపి పాత్రే

సరే. ఈ ప్రేమ ఎక్కడ కనబడుతుంది? ప్రేమను పొందటానికి పాత్రులైనవారిలోనే, నూటికో కోటికో ఒక్కరిద్దరిలోనే కనబడుతుంది. తప్పితే ఎవఱిలో పడితే వాఱిలో ప్రకాశించదు. ప్రేమకు అర్హత సంపాదించుకోవటం ఎలా? ప్రేమను పొందటానికి ప్రయత్నించటమే. ప్రయత్నించేకొలదీ తనంత తానుగా ప్రేమ అదే చేరువౌతుంది. సాధారణంగా ఏతావత్ప్రేమకై చాల తక్కువమంది మాత్రమే ప్రయత్నిస్తారు అని చెప్పడమే నూటికో కోటికో ఒక్కరిద్దరిలోనే కనబడుతుంది అనటం వెనక ఆంతర్యం. అలా చాలా అరుదుగా కనబడినా, ప్రయత్నించినవారికి క్రమేణ అందటం మాత్రమే కాకుండా, ఆ పాత్రుని చుట్టూ ఉన్నవారికి కూడ ఆ వెలుగును (ప్రేమను) పంచుతుంది. ప్రపంచాన్ని ప్రేమోద్దీపితం చేస్తుంది, ప్రేమమయం చేస్తుంది.

54. గుణరహితం కామనారహితం ప్రతిక్షణవర్ధమాన మవిచ్ఛిన్నం సూక్ష్మతర మనుభవరూపమ్

మామూలుగా ఈ చరాచరజగత్తులో ఉండే వస్తువులకు ఆపాదించదగిన సత్వము రజస్సు తమస్సు అన్న గుణాలు ప్రేమకు ఉండవు. అలాగే షట్ఛత్రువులు నశించటంవలన ప్రాపంచికమైన ఏ కోరికలూ బంధాలూ ప్రేమను కట్టలేవు. ఐనా, ప్రాపంచికమైన గుణాలూ బంధాలూ ఉంటే ప్రేమ అనిర్వచనీయమైనదీ కేవలాస్వాదనీయమైనదీ అరుదైనదీ ఎందుకౌతుంది? అలాంటి ప్రేమను ఒకసారి అనుభవించటం మొదలైతే, ఆ ప్రేమకు నిరంతరం పెరుగుదలే తప్పితే తరుగుదల ఉండదు. కోరికకూ ప్రేమకూ ఇదే ప్రధానమైన తేడా. తీరిన తరువాత కోరిక తరిగిపోతుంది. ప్రేమ అనుభవించేకొద్దీ పెరుగుతూనే ఉంటుంది (అనుభవంలో మాత్రమే కాదు, పరిధిలో కూడా). అందుకే ప్రేమ ఆనందస్వరూపం, అమృతం. 

ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. ఈ ప్రపంచమంతటా ప్రేమ నిండి ఉంది. స్థూలమైనవాటికి ఇలాంటి సర్వవ్యాపకత్వం ఉండదు. ఉదాహరణకు, భూమినీ నీటినీ తీసుకుంటే, భూమి చేరలేని ప్రదేశాలలో కూడ నీరు చేరగలదు. అందువల్ల భూమి నీటికన్నా స్థూలమైనదీ (gross), లేదా భూమికన్నా నీరు సూక్ష్మమైనదీ (subtle) అంటున్నాం. నీటి కన్నా నిప్పుకూ, నిప్పు కన్నా గాలికీ, గాలి కన్నా శూన్యానికీ (ఆకాశానికీ) సూక్ష్మత ఎక్కువ. ప్రేమ వీటన్నింటికన్నా చాలా సూక్ష్మమైనది. అంటే ఎక్కడైనా దేనియందైనా చేరిపోగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అనంతమైనది. మఱి ఇలాంటి అనంతమైన మితిలేని ప్రేమను పరిమితమైన మాటలలో చెప్పడం కుదరదు కాబట్టి ప్రేమ కేవలం అనుభవైకవేద్యం.

55. తత్ప్రాప్య తదేవావలోకతి తదేవ శృణోతి తదేవ భాషయతి తదేవ చిన్తయతి

ప్రేమను అనుభవంలోకి తెచ్చుకున్నవారికి ఈ సృష్టిలో దేనిని చూచినా ప్రేమమయంగానే కనబడుతుంది (సూక్షతరమ్). ఏది చూచినా ప్రేమమయంగానే కనబడుతూంటే, దేనినీ అసహ్యించుకోవడమంటూ ఉండదు. ఏది విన్నా ప్రేమగానే వినబడుతుంది. వ్యర్థభాషణలూ కామాలాపాలూ వ్యంగ్యసంభాషణలూ దూషణలూ అన్నీ ప్రేమవాక్కులుగానే వినబడడం చేత ఎవఱిపైనా రాగద్వేషాలు ఉండవు. ఏది మాట్లాడుదామన్నా ప్రేమగానే పలుకబడుతుంది. ఇది కావాలీ ఇది వద్దూ అన్న కార్యకారణసంబంధాలు తెగిపోవటం చేత తక్కువగానే మాట్లాడుతారు, ఒకవేళ మాట్లాడినా ప్రేమతో నిండియుండటం చేత అది అందఱికీ ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఏది ఆలోచించినా ప్రేమతోనే ఆలోచించబడుతుంది. మనోవాక్కాయకర్మలు ప్రేమయందే వాటి ప్రతిపత్తిని కలిగి ఉంటాయి.

భక్తిని భగవంతునియందు ప్రేమగా చెప్పడం వలన, ఆ భక్తి కలిగినవానికి ఈ లోకంలో అన్నిటియందూ భగవంతుడే గోచరిస్తాడు. ఏమి విన్నా భగవంతుని మధురమంగళనాదంగానే వినబడుతుంది. ఏమి అందామన్నా భగవంతునితో సంభాషిస్తున్నామన్న స్పృహవలన మృదువాక్కులే నోటియందు జనిస్తూ ఉంటాయి. కర్మ వాక్కులతో పాటు మనస్సులో కూడ భగవంతుడే ఎల్లప్పుడూ కొలువైయుంటాడు. తనే ఆనందస్వరూపమని తెలుసుకుంటాడు. ఇతరమైన ప్రాపంచిక సౌఖ్యాలను ఇచ్చేవి ఏవీ దీనిముందు అగుపడవు, వినబడవు, అనబడవు. ఇలా నిరంతరమూ ఆనందంలో మునిగి తేలటమే మోక్షం. అద్భుతం కదా ఈ భావన ! అవధరించండి , ఆనందించండి మరి ! శుభం . 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha