మనసు

34.204.193.85
అమృత వాక్కులు
మనసు
 
మనసు ,చిత్తం ,బుద్ది ,అహంకారం - అంతః కరణ చతుష్టయం .
 
"మనసొక సత్య పదార్థం .దానికి నామ రూపాలు లేవు "అంటారు స్వామి వివేకానంద ."అగమ్య గోచరమైన శక్తి కానీ బాహ్యప్రపంచంలో సంభందాలు ఏర్పరుచుకొని అనుభవాలను గడిస్తుంది "అంటుంది కేనోపనిషత్తు .
 
అర్జనుడు శ్రీకృష్ణుడితో భగవత్ గీతలో అంటాడు " క్రిష్ణా , మనసు చంచల మైనది ,ఒక మాటాన వినదు ,లోకమంతా చుట్టివస్తుంది .నా స్వాధీనంలో రావడం లేదు "అని .దానికి శ్రీకృష్ణుడు జవాబిస్తాడు "అర్జునా ! చంచల మైన మనసు రెండు విధాలుగా స్వాధీన పరుచుకోవచ్చు .ఒకటి ప్రయత్నం చేస్తూ వుంటే అది స్వాధీనమౌతుంది .ఇంకొకటి వైరాగ్యం తో .వైరాగ్యం అంటే కుటుంబాన్ని వదిలి అరణ్యాలకు వెళ్ళమనడం లేదు .ఈ కుటుంబం లో వుంటూనే వ్యామోహాలు తగ్గించుకొని తామరాకుపై నీటి బొట్టులా అంటకుండా వుండాలి .
 
శ్రీ కృష్ణునుని బోధ అక్షరాలా సరైనదే .మన మనసు గుర్రంలా పరుగెడుతుంది .ఎక్కడికి పోతుంది కూడా తెలియదు .ఏమి చేస్తుందో కూడా అంతుచిక్కదు .అందుకని ఈ చంచలమైన మనసు ధ్యానంతో కళ్ళు మూసుకొని ఏకాగ్రత వచ్చేలా చేయాలి .ఆలా చేస్తూ పొతే మనసు చంచలత్వాన్ని తగ్గి ఒక చోట వుంటుంది .దాన్ని స్వాధీన పరుచుకున్నా మనవద్దు .ఎందుకంటే దాన్ని స్వాధీన పరుచుకోవడం ఋషులకు ,గురువుకే కష్టతరమైంది. మనసు ఒక్క సారి ఒక్క చోట వుంటే అప్పుడు మనము అనుకున్నది మనసుతో చేయించుకోవచ్చు .మనసు ,చిత్తం ,బుద్ది వీటిలో మనసు ఆలోచనా శక్తి అంటే సంకల్పం చేస్తుంది ,చిత్తం ప్రణాళిక సిద్ధం ఆ సంకల్పానికి చేస్తుంది ,బుద్ధి ఆ సంకల్పం ప్రణాలికాను సారంగా కార్య రూపం చేస్తుంది .చివరికి కార్యం చేసేది బుద్ధిమాత్రమే .
 
విశ్వామిత్రుడికి వ్యామోహం మనసులో కలిగి మేనకతో సంభోగం చేసి ,శకుంతలను కన్నాడు .పరశురాముని తండ్రి ఋషి అయ్యికూడా మనసు ఆగక పెళ్ళిచేసుకుని సంసారం చేసి పరుశురామునికి జన్మనిచ్చాడు ."మనసు మాట వినదు "అని ఒక సినిమా పాట కుడా వుంది .
 
భగవత్ గీతలో వుంది -మనసు చేసే మాయాజాలమే విచారం ,ఆనందం .ఆకర్షణలనే మాయ పొరలు మనసును కమ్మితే ఇక కర్తవ్యాన్ని వదిలేస్తాం .మంచి వాటిని కూడా మనసు అంగీకరించదు .జీవితంలో దేహం ,మనసు మనకు మంచి ఉపకరణాలు మోక్షం సాధించడానికి .మనిషికి విజయాలకు మనసే మూల కారణం .ఈ ప్రపంచంలో ఎ ప్రయత్నం చేయాలన్నా ,ఎ విజయం సాధించాలన్న ,ఎ అన్యాయాలను ఎదిరించాలన్నా మనసే చేస్తుంది .
 
ఎదుటివారి మనసు చదవడం ,అర్థం చేసుకోవడం వివేకంతో కూడిన ప్రజ్ఞాసూచకాలు .అద్భుతమైన మనోపరిణతికి అది నిదర్శనం .ఇద్దరి మనోభావాలు ఒక్కటిగా వుండవు .కాని పరస్పర అభిప్రాయాల గౌరవంతో "ఏకిన్ముఖంగా సాగడమే వివేకం ".మనసుకు విస్తృతమైన పరిధి ఉందని ,సంకుచిత ధోరణితో దాన్ని కుదించక ,వికసింప జేసే వివేకం ,జీవన సాఫల్యతను ఇస్తుందని మనిషి గ్రహించాలి .
 
మనసును మంచి సలహాదారుగా తన కర్తవ్యం నెరపుతుంది .మనసు ఇంద్రియాలతో సంయోగం చెందినప్పుడు మాత్రమే బాహ్యజగత్తులోని దృశ్యం అవగతమౌతుందని పతంజలి యోగ శాస్త్రం అంటుంది .ధ్యాస ,ధ్యానమనే ప్రక్రియ సాధన ద్వారా మనసును అమృతకలశంగా చేసుకోవాలని యోగశాస్త్ర నిపుణులంటారు .సమదృష్టి ,సమభావన ఉండేలా చేస్తాయి .నిర్మల చిత్తాన్ని ప్రసాదిస్తాయి .
 
ఆత్మ భగవంతుని నిలయం ,మనసు అరిషడ్వార్గాల నిలయం .అరిషడ్వార్గాలు అంటే కామ,క్రోధ ,లోభ ,మద ,మోహ ,మత్సరాలు .మనసుఈ ఆరింటి తో కొట్టుమిట్టాడుతు వుంటుంది .ఆత్మ నిద్రలో శాంత స్వరూపాన్ని అనుభవిస్తుటుంది .కాని మనసు రోజంతా చేసినవి రాత్రి నెమరు వేసుకుంటు ప్రశాంతతను కోల్పోతుంది .
 
ఒకసారి యక్షుడు ,ధర్మరాజును అడుగుతాడు "ధర్మజా ,లోకంలో మనిషి వెంట చివరిదాకా వుండవలసింది ఏంటి ?అని .ధర్మరాజు చెబుతాడు "మనోబలం .మనిషికి చివరి దాకా వుండవలసింది ఇదే "అని అంటాడు .
 
అందుకని మనోబలం కోల్పోయిన వాళ్లు పిచ్చివాలై ఆసుపత్రి పాలవుతుంటారు .ఇంకొందరు కుటుంబంలో వుంటూ వారు గడిచిన దుర్ఘటనలను నెమరు వేసుకుంటూ వారు మనశాంతి లేకుండా ,కుటుంబాన్ని మనశాంతిలేకుండా చేస్తారు .మనసే అందరిని ఆకర్షిస్తుంది తన వైపు తిప్పుకుంటుంది మనసే శత్రువులను కూడా చేసుకుంటుంది .
 
మనోబలం వున్న శాస్త్ర వేత్తలు అద్భుతాలను సృష్టిస్తారు .మనోబలం వున్న స్వామి వివేకానంద ,చికాగోలో తన ప్రసంగంతో ప్రపంచ మత పెద్దలను సమ్మోహితులను చేసి ఆకర్షించుకున్నారు .మనోబలంతోనే ఆదిశంకరాచార్యలు భారత దేశపు ఆధ్యాత్మిక పీఠాన్ని అధిరోహించాడు .
 
మనోబలం తోనే శుభాష్ చంద్ర బోస్ జపాన్లో భారత సైన్యాన్ని స్థాపించాడు .మనోబలం తోనే అల్లూరి సీతారామరాజు ,వీరపాండ్య కట్టబ్రహ్మన్ బ్రిటిష్ వారిని ఎదిరించారు .కాకతీయుల రుద్రమా దేవి మనోబలంతో కాకతీయ సామ్రాజ్యాన్ని స్వాధీన పరుచుకుంది .ఇలా చెప్పుకుంటూ పొతే ఎందరో మనోబలం తో అద్భుతాలు సాధించారు .
 
మనోబలం వున్న వారే జగత్ జట్టీలు ,జగత్ విజేతలు ,జగత్ నాయకులు ,లోకపాలకులు ,సామ్రాజ్యాధినేతలు ,సంకల్ప సిద్ధులు ,భగవనమార్గాన్ని తెలుసుకున్న వారు ,మోక్ష అర్హులు .
 
మనం పూజ చేసినప్పుడు అర్చకులు మనకు మనోవాంఛాఫలసిద్ధిరస్తు అని దీవిస్తారు .
 
మనము మనోబలంతో అందలాలను అధిరోహిద్దాం ,దేశ ప్రగతికి పాటుపడదాం ,కీర్తి ప్రతిష్టలు స్వంతం చేసుకుందాం ,చరిత్రలో నిలిచిపోదాం .
 
ఒక మాట - వినడంలో మనిషి తొందర పడాలి , మాట్లాడటంలో కాదు - జేమ్స్ జూడియల్ .
 
బిజ్జ నాగభూషణం .

Quote of the day

There is poison in the fang of the serpent, in the mouth of the fly and in the sting of a scorpion; but the wicked man is saturated with it.…

__________Chanakya