లలితా నేతి దర్శనం.

44.192.25.113

దంపతుల మధ్య అన్యోన్యతని ప్రసాదించే  లలితా నేతి దర్శనం. 
లక్ష్మీ రమణ 
   
మేఘాలకు నాథుడైన పరమేశ్వరుడు శ్రీచక్రస్థిత లలితా స్వరూపిణిని శాంతింపచేసిన పుణ్యస్థలం ఈ దక్షిణ భారతదేశంలోనే ఉంది . లలితా పారాయణ చేసేవారందరూ తెలుసుకోవాల్సిన, దర్శించుకోవాల్సిన పుణ్యస్థలి ఇది .  ఇక్కడ లోపాముద్రా సహితుడైన అగస్త్య మహర్షి లలితాదేవిని లలితా సహస్రనామంతో అర్చించారు. భార్యాభర్తల అన్యోన్యత , ఆయుష్షు వృద్ధి, ఆరోగ్యసిద్ధి ఈ క్షేత్ర ప్రత్యేకతలు . రండి ఆ దేవదేవి దర్శనం చేసుకుందాం. 

పాండాసురుడు  అనే రాక్షసుడు దేవతలని , ఋషులనీ నానారకాలుగా హింసించడం మొదలుపెట్టారు . వారు రక్షించమంటూ జగన్మాతని వేడుకున్నారు . ఆవిడ శ్రీచక్రాన్ని రథంగా అధివసించి , ఆ రాక్షసుణ్ణి సంహరించింది .  కానీ,ఆ క్రోధం , ఉగ్రం మాత్రం ఆమెని వీడలేదు . అటువంటి పరిస్థితిలో పరమేశ్వరుడు ఆమెని భూలోకానికి వెళ్లి మనోన్మనీ  అనే పేరుతొ తపస్సు చేయమని ఆదేశిస్తారు . ఆవిధంగా అమ్మవారు తపస్సు ఆచరించి శాంతిని పొందిన చోటిది . లలితా సహస్రనామాలలో 

‘సర్వయంత్రాత్మికా।  సర్వతంత్రరూపా।  మనోన్మనీ। 
మాహేశ్వరీ।  మహాదేవీ।  మహాలక్ష్మీ।  మృడప్రియా।’ 

అని ఉందికదా!  అసలు లలితా సహస్రనామం కోటిరెట్ల ఫలితాన్నిచ్చి సిద్ధించాలంటే  కూడా ఈ క్షేత్రం ప్రశస్తమైనదని ఐతిహ్యం .

బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం "లలితోపాఖ్యానం"లో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది. ఇందులో లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. శ్రీమహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి మొదట ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు . హయగ్రీవుడే ఈ స్తోత్రాన్ని పఠించడానికి , అది సిద్ధించడానికీ ఈ క్షేత్రం చాలా మంచిదని వివరించారని అగస్త్యునికి చెప్పగా, ఆయన లోపాముద్రా సహితుడై ఇక్కడి లలితాంబికనీ అర్చించారని పురాణాలు చెబుతున్నాయి . లలితా పురాణంలో భండాసురుని సంహరించడానికి దేవి అవతరించినట్లుగా వర్ణించారు. ఈ గ్రంథాలలో శ్రీపురమును సూచించే శ్రీచక్రం నిర్మాణం వర్ణించబడింది.   

ఇంతకీ , అలా తపస్సు చేసి దేవి శాంతాన్ని పొందిన తర్వాత పూజలందుకొంటున్న ఈ  క్షేత్రం, అగస్త్యుడు లలితాసహస్రనామాన్ని పఠించిన దివ్యాలయం  తమిళనాడు రాష్ట్రంలోని తిరువరూర్ జిల్లాలో ఉంది . ఇక్కడ కొలువైయున్న అమ్మవారు స్వయంగా శ్రీచక్ర సింహాసనాస్థిత అయినా  లలితాంబికా దేవి .  పరమేశ్వరుడు మేఘనాధునిగా అమ్మవారి చెంత కొలువై పూజలందుకుంటున్నారు . 

ఇక్కడి విశేషం ఏమిటంటే, అమ్మవారిని ఆవిడ ముందర ఏర్పాటుచేసిన నేతి లో దర్శనం చేసుకోవాలి . దేవిముందర పోసిన ఆ కిలోలకొద్దీ ఆవునెయ్యి గడ్డకట్టదు. ఒక అద్దంలో అమ్మని దర్శించినంత చక్కని స్పష్టమైన ప్రతిబింబాన్ని మనం ఇక్కడ నేతిలో దర్శించుకోవచ్చు. ఈ దర్శనం అద్భుతమైనది. మహాపాపవినాశనం అనుగ్రహించేది . 

భార్యాభర్తలు ఈ అమ్మవారిని ఇలా నేతిలో దర్శించుకుంటే జీవితాంతం వారి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉండదు. ఈ ఆలయంలో 60, 80వ పుట్టినరోజులను జరుపుకుంటే మంచిది. ఏప్రిల్ మే నెలల్లో ఈ ఆలయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను నేరుగా స్పృశిస్తాయి. 
ఈ ఆలయంలో లలితా దేవిని, మేఘనాధుడైన పరమేశ్వరుణ్ణి దర్శించుకొని, వారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే, ఆరోగ్యపరమైన సమస్యలన్నీ సమసిపోతాయి . జటిలమైన రోగాలు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు.  

ఇలా చేరుకోవాలి :

తిరువరూర్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది . ఇక్కడికి మధురై , తిరుపతి నుండీ బస్సులున్నాయి . 
 
పేరళం రైల్వేస్టేషన్ నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna