Online Puja Services

అమ్మవారిని చేరే దారి ఏది...!?

3.138.69.45

శాస్త్ర నియమానుసారం, పురుష దేవతలను వర్ణించే క్రమములో పాదముల నుండి మొదలు పెట్టి శిరస్సు వరకు మరియు స్త్రీ దేవతలను వర్ణించే క్రమములో శిరస్సు నుండి మొదలుపెట్టి పాదముల వరకు వర్ణన చేయవలసి ఉంటుంది. ఈ శాస్త్రం నియమము ఎందుకంటే, చివరికి మన యొక్క మనస్సు, స్త్రీ దేవతా యొక్క పాదముల పైన లగ్నము అవ్వాలి. కానీ, శంకరులు అమ్మవారి యొక్క పాద వర్ణనతో మొదలు పెట్టారు సౌందర్యలహరిని. శంకరులకు ఈ నియమం తెలియదు అని అంటే, అలా అన్నవారి యొక్క అజ్ఞానము బయటపడుతుంది. ఒక ప్రత్యేక ప్రయోజనము మనకు చేకూర్చడానికి అలా మొదలుపెట్టారు శంకరులు సౌందర్యలహరిని. మొదటగా దేవి మాత యొక్క విశిష్టతను, విలక్షణతను చెప్పిన తరువాత, అమ్మవారి యొక్క పాద మహిమను విశ్లేషించి, తదుపరి అమ్మవారి యొక్క సాధనా ఫలమును విశదీకరించి, శంకరులు, "సౌందర్యలహరి" లోని తొమ్మిదవ శ్లోకాన్ని, అమ్మవారి యొక్క విలాసమును చేరే దారిని వివరిస్తూ, ఇలా రచించారు.

"మహీం మూలాధారే - కమపి మణిపూరే హుతవహం
స్ధితం స్వాధిష్టానే - హృది మరుత మాకాశ ముపరి
మనోపి భ్రూమధ్యే - సకలమపి భిత్త్వా కులపథం
సహస్రారే పద్మే - సహ రహసి పత్వా విహరసే "

పైన చెప్పబడిన సంస్కృత శ్లోకమునకు అర్థము ఏమిటంటే, "అమ్మా !! భగవతీ!!!నీవు మూలాధార చక్రములో భూమితత్త్వాన్ని, మణిపూరక చక్రములో ఉదకతత్త్వాన్ని, స్వాధిష్ఠాన చక్రములో అగ్నితత్త్వాన్ని, అనాహత చక్రములో వాయుతత్త్వాన్ని, విశుద్ధ చక్రములో ఆకాశతత్త్వాన్ని, ఆజ్ఞా చక్రములో మనస్తత్త్వాన్ని, సుషుమ్నా మార్గములో చేదించి, సహస్రార పద్మములో నీ భర్త అయిన సదాశివుడితో కలిసి విహారిస్తున్నావు."

పరాశక్తిని ఉపాసించే యోగ మార్గములోని తత్త్వాన్ని చెబుతున్నారు శంకరులు. ప్రతి వ్యక్తి ఉపాధిలో అనగా శరీరములో కుండలినీ రూపముగా అమ్మవారే ఉన్నారు.అయితే సాధన లేనిది మనలో ఉన్న అమ్మవారి యొక్క కుండలినీ శక్తి జాగృతి కాదు. అలా కానంతవరకు జీవుడు ఒక పశువు. .వాడి స్థితి, జీవ తాదాత్మ్యం చెందినస్థితి. (micro level), సాధన ద్వారా పంచ భూతములను చేదించి సదాశివుడుని చేరిన సాధకుడిది సమిష్టీ స్థితి.(macro level). 

అదే, "శివోహం" అనగా. సాధన ద్వారా, ఆరు చక్రముల కుండలిని దాటి సహస్రారంలో సదాశివుడితో కూడియున్న పరాశక్తిని చేరుకోవాలి!!. అప్పుడు జీవుడే పరబ్రహ్మ.అప్పుడు జీవుడే పశుపతి.అలా దారి మరియూ గమ్యము, రెండునూ అమ్మవారే.అమ్మవారిని చేరే దారి గురించి వశిన్యాది వాగ్దేవతలు లలితా సహస్ర నామములో ఏమన్నారు అంటే, "కులామృతైకరసికా, కులసంకేత పాలినీ,కులాంగనా, కులాంతస్ధా, కౌళినీ, కులయోగినీ, అకులా, సమయాంతస్ధా, సమయాచారతత్పరా, మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ, మణిపూరాంతరుదితా, విష్ణుగ్రంధి విభేదినీ,అజ్ఞాచక్రాంతరాళస్ధా రుద్రగ్రంధి విభేదినీ, సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ, తటిల్లతా సమరుచిః,ష్షట్చక్రోపరిసంస్ధితా, మహాశక్తిః కుండలినీ" బిసతంతు తనీయసీ" కనుక వేద వేదాంగములు మరియు వేదాంతములు చెప్పినా, వశిన్యాది వాగ్దేవతలు చెప్పినా, శంకరులు చెప్పినా,మనకు జ్ఞానము కావలసినదే మరియూ మనము కర్మనూ ఆచరించవలసినదే.జ్ఞానము లేని కర్మ మరియు కర్మ లేని జ్ఞానము, రెండింటి ఫలితమూ శూన్యమే. ఇదే బాగా అర్థం చేసుకోవలసిన విషయము. మనం ఒక గవర్నమెంటు అధికారి ఉద్యోగానికి పోటీ పరీక్ష రాయటానికి కూర్చున్నాం. ప్రశ్నలన్నింటికి సమాధానము వ్రాయగలిగిన జ్ఞానము మనకి ఉన్నది. కానీ మనము సమాధానములు వ్రాయలేదు. ఉత్తీర్ణత సాధిస్తామా..!?

సమాధానాలు వ్రాశాము కానీ, ప్రశ్నలకు సంబంధించిన సరిఅయిన సమాధానముల జ్ఞానము మనకు లేదు. ఉత్తీర్ణత సాధిస్తామా..!? గోవు గురించిన సమస్త జ్ఞానము మనకు ఉన్నప్పటికీ, దానివల్లనే మనకు గోవు లభిస్తుందా...!? కాబట్టి జ్ఞానము మరియు కర్మ , పక్షి యొక్క రెండు రెక్కలలాంటివి. ఒక్క రెక్కతో పక్షి ఎలాగైతే ఎగరలేదో, జ్ఞానము మరియు కర్మ (సాధన)లను కలిపి ఆచరిస్తేనే అమ్మవారిని మనము చేరగలమన్నది ఈ శ్లోకం యొక్క విశేషార్థం.

శ్రీ శంకర భగవత్పాద విరచిత
సౌందర్యలహరి.
సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే

- శివకుమార్ రాయసం 

Quote of the day

A small body of determined spirits fired by an unquenchable faith in their mission can alter the course of history.…

__________Mahatma Gandhi