Online Puja Services

అమ్మవారిని ఆరాధించే ఐదు పద్ధతులు ఏమిటి

18.224.63.87
అమ్మవారిని ఆరాధించే ఐదు పద్ధతులు ఏమిటి.....!!???
 
మొదటిది విగ్రహారాధన. అమ్మవారి యొక్క విగ్రహమునో లేక చిత్రపటమునో పూజగదిలో పెట్టుకుని పూజిస్తాము. స్త్రీ సాక్షాత్తూ అమ్మవారి యొక్క అంశ స్వరూపమే కాబట్టి, నవ రాత్రులయందు లేక పుణ్య దినములయందు, కుమారీ పూజనో లేక కౌమారీ పూజనో చేస్తాం.ఇదంతా బాహ్య పూజ. రెండో విధములో, అమ్మవారి యొక్క రూపమును లేక పాదములను మనసులో నిలిపి పూజిస్తాము. దీనినే మానసిక పూజా లేక అంతర్ముఖ పూజ అని కూడా అంటారు.

మూడవ విధానములో, కుండలినీ రూపముగా అమ్మవారిని ఆరాధించటం (ఎలాగో 9 మరియు 10 శ్లోకముల వ్యాఖ్యానం ద్వారా చెప్పుకున్నాము) .కుండలిని రూప ఆరాధనకు వచ్చేసరికి, బాహ్య మరియు అంతర అనే రెండు విధానములకు అవకాశమే లేదు. కుండలిని అంతా అంతర్ముఖమే.

నాలుగవ విధానం శ్రీచక్ర ఆరాధన. ఈ విధానములో మనము శ్రీ చక్రమును ఒక యంత్ర రూపముగా కానీ, లేక ఒక ప్రతిమ రూపముగా కానీ, సంపాదించి పూజిస్తాము. కానీ ఇది కూడా, బాహ్య పూజాయే.

ఇక ఐదవ విధానములో, మనం పద్మాసనంలో కూర్చుని ఉంటే మన శరీరమే శ్రీచక్రము అని అర్థం చేసుకోగలుగుతాము మరియు మన ఉపాదిలో అనగా శరీరంలో కొలువై ఉన్న, మహాశక్తి అయినటువంటి శ్రీ కనకదుర్గా మాతను, దహరాకాశములో అనగా మన హృదయ స్థానములో, లేక చిత్తాకాశములో అనగా బృగు మధ్య స్థానములో ( అజ్ఞాచక్రములో), లేక చిదాకాశములో, నిలిపి పూజించగలుగుతాము.
శంకరులు, "సౌందర్యలహరి" లోని పదకొండవ శ్లోకాన్ని, శ్రీచక్ర స్వరూపాన్ని గూర్చి వర్ణిస్తూ, ఇలా రచించారు,

"చతుర్బిః శ్రీకంఠైః - శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభిః శంభో - ర్నవభి రపి మూలప్రకృతిభిః
త్రయశ్చత్వారింశ - ద్వసుదళకళాశ్రత్రివలయ
త్రిరేఖాభిః సార్దం - తవ శరణకోణాః పరిణతాః"

అనగా,అమ్మవారు కొలువై ఉండే శ్రీచక్రము,నాలుగు శివ కోణములు మరియు ఐదు శక్తి కోణములు కలిగి, సృష్టికి మూల కారణమైన తొమ్మిది మూల ప్రకృతులతోనూ,అష్టదళపద్మమూ,షోడశదళ
పద్మమూ, మేఖలా త్రయము, రేఖా త్రయము, అనే భూపురత్రయముతోనూ కలిసి, నలభై నాలుగు అంచులు కలిగి ఉంటుంది.
భైరవ యామళము అనే గ్రంథంలో ఏమి వివరించారు అంటే...!? ,
శివాశివుల (అనగా పార్వతీ పరమేశ్వరుల) యొక్క శరీరమే శ్రీచక్రము.

శ్రీ చక్రములోని, త్రికోణము, అష్టకోణములు, దశకోణములు రెండూ, చతుర్దశారము అనే ణదు శక్తి చక్రములు.
బిందువూ, అష్టదళ పద్మమూ, షోడశదళ పద్మమూ, చతుర్దశ దళ పద్మమూ, అనబడే నాలుగూ, శివ సంబంధమైన చక్రములు.
శివశక్తి చక్రముల కలయికే శ్రీచక్రము.

త్రికోణము అనే శక్తి చక్రంలో బిందువు అనే శివ చక్రము కలిసి ఉంటుంది. అలాగే అష్టకోణము అనే శక్తి చక్రములో, అష్టదళ పద్మము అనే శివ చక్రము కలిసి ఉంటుంది. శక్తి చక్రములైన దశకోణములు రెండింటిలోనూ, షోడశదళపద్మము కలిసి ఉంటుంది. చతుర్దశారము అనే శక్తి చక్రంలో, భూపురము చేరి ఉంటుంది. అలా, శ్రీచక్రము నవచక్రాత్మకము.

శ్రీచక్రము యొక్క కోణములు ఎన్ని ...!?
"త్రయశ్చత్వారించత్" అంటే నలుబది మూడు కోణములు అన్నది శాస్త్రము.
 
అవి ఏమిటి అంటే..!?,
1) శక్తి చక్రములలోని "త్రికోణానికి" ఉన్న 
ఊర్ధ్వకోణము = 1
2) శక్తి చక్రములలోని "అష్టకోణానికి" ఉన్న 
కోణములు = 8
3) శక్తి చక్రములలోని రెండు దశకోణముల లోపలా మరియు బయట ఉన్న కోణములు= 20
4) శక్తి చక్రములలోని చతుర్దశార కోణములు = 14
వెరసి నలుబది మూడు (43) కోణములు.
 
శంకరులు "త్రయశ్చత్వారింశ" అన్నారా..!? లేక "చతుశ్చత్వారింశత్" అన్నారా..!?
అనగా అంచులు 43 అన్నారా లేక 44 అన్నారా అని పాఠాంతరం ఉంది.
సౌందర్యలహరి మూల గ్రంథము చదివిన వారు చెప్పగలరు.
 
శివ శరణము కలిపితే అనగా శివుని యొక్క నివాస స్థానమైన బిందువును కూడా కలిపితే 44 లెక్క కూడా సరిపోతున్నది.
 
"నవభి రపి మూలప్రకృతిభిః" శ్రీ చక్రమునకు కారణమైన 9 కోణములే, ప్రపంచమునకు కారణమైన 9 యోనులు. ఈ నవ యోనులే పిండాండ కారణమైనటువంటి 9 ధాతువులు.
 
"కామికా తంత్రము" అనే గ్రంథము, ఈ తొమ్మిది ధాతువులనూ విశ్లేషిస్తుంది.
 
చర్మము రక్తము మాంసము మెదడు మరియు ఎముకలు అనే "అయిదు ధాతువులు" శక్తి సంబంధమైనవి.
మజ్జ అనగా ఎముకలలోని గుజ్జు, శుక్లము అనగా వీర్యము, ప్రాణము మరియు జీవము "శివ మూలకములు".
నవ ధాతుమయమే మానవ శరీరం.
 
శ్రీ చక్రములోని మధ్య బిందువే దశమయోని. ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ కనకదుర్గా మాత.
 
శ్రీ కనకదుర్గా మాతయే తన నుండి ఒక అండమును బయటికి తీసి, దానిని పిండముగా మార్చి, దానితోనే బ్రహ్మాండమును చేసింది. కనుక, శ్రీ దుర్గయే విశ్వజనని.51 తత్త్వములు ఆమెవే.
 
శ్రీ చక్రము మరియు శ్రీచక్రార్చన రెండు విధములు. 1) సమయాచారము మరియు 2) కౌలాచారము.
 
మనది సమయాచారము. మనం పూజించే శ్రీచక్రములో, పైకి శీర్షములు కలిగిన త్రిభుజములు నాలుగు , క్రిందికి శీర్షములు కలిగిన త్రిభుజములు ఐదు ఉంటాయి.
 
కౌలాచారములో పూజింపబడే శ్రీచక్రములో

పైకి శీర్షములు కలిగిన త్రిభుజములు ఐదు, క్రిందికి శీర్షములు కలిగిన త్రిభుజములు నాలుగు ఉంటాయి
శ్రీ చక్రమును అర్థము చేసుకోవటమే మహాభాగ్యము.
శ్రీ శంకర భగవత్పాద విరచిత
సౌందర్య లహరి.
సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే
 
- శివకుమార్ రాయసం 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha