Online Puja Services

భాస్కరారాధన వలన కంటి ఆరోగ్యం

18.227.102.225

భాస్కరారాధన వలన కంటి ఆరోగ్యం మెరుగవుతుందని ‘బామ్మోవాచ’ !
-లక్ష్మీ రమణ 

“ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్ అని ఆర్ష వాక్యం .  సూర్యారాధన వలన ఆరోగ్యం చేకూరుతుంది .ప్రత్యేకించి కంటి సమస్యలు దూరమవుతాయి. అందుకే రోజూ సూర్య నమస్కారం చేసుకోవాలి .  ఆట్టే, ఆదివారమ్ అని రాగాలు తీస్తూ.. ముసుగుతన్ని తొమ్మిదింటిదాకా నిద్రపోతే ఎలాగురా ! లే లే! ” మా బామ్మ రవిని అరుస్తోంది . “సూర్యుణ్ణి  నేరుగా చూస్తే , కళ్ళు పోతాయి కానీ, కళ్ళ సమస్యలు ఎలాగండీ తగ్గుతాయి” మునగదీసుకొని గొణుగుతూ అటువైపు తిరుగుతూనే చెప్పాడు రవి . పెద్దావిడ ఊరుకుంటుందా ! చక్కగా వాడి పక్కనే సెటిలయ్యి , తల నిమురుతూ అదెలా సాధ్యమో వివరించింది . ఏమైనా బామ్మోవాచ వింటే వామ్మో అని మనమూ ఫాలో అవ్వాల్సిందే !! ఆ కథేమిటో చదవండి మరి !     

నమస్సవిత్రే జగదేక చక్షసే |
 జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే | 
త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే | 
విరించి నారాయణ శంకరాత్మనే || 

శ్రీ ఉషా సంజ్ఞా ఛాయా సమేత సూర్య నారాయణ పర బ్రహ్మణే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అని సూర్యునికి ముమ్మారు అర్ఘ్యయాన్ని సమర్పిస్తూంటారు కదా తాతగారు .  ఎప్పుడైనా వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశావంట్రా నువ్వు ! అలా చేసుంటే, నీకీ సందేహం వచ్చేదే కాదు . 

చూడు నాన్నా ! మన ఋషులు ఇచ్చిన సంప్రదాయాలు శాస్త్ర బద్ధత లేనివి కావు . మరోమాటలో చెప్పాలంటే , మన సంప్రదాయాల శాస్త్రీయతని నిరూపించే దిశగా సైన్స్ ఎదగాల్సి ఉంది . 

ఇంతకీ మీ తాతగారు నిత్యమూ చేసే సూర్య స్తుతి లోని సవిత్రి అంటే  సృష్టి కారకుడైన సూర్యునికి;  ‘జగదేక చక్షసే’ అనే ఈ  జగత్తు మొత్తానికీ  నేత్రముగా ఉన్నటువంటి  వానికి, జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే - ఈ విశ్వసృష్టి, స్థితి, లయాలకు హేతువైనటువంటి సామములనే మంత్రములతో కూడిన చతుర్వేదమయునకు,  త్రిగుణాత్మ ధారి అంటే సత్వ రజస్సు తమస్సు అనే గుణాలను ధరించిన వానికి , విరించి నారాయణ శంకరాత్మనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన వానికి నమస్కారము  చేస్తున్నాను అని భావము . 

 ఇది సూర్యుని దర్శిస్తూ చేయవలసినటువంటి స్తుతి. జగత్తుకే నేత్రమైనవాడు కాబట్టే, పరమాత్మ నేత్రముగా సూర్యుని అభివర్ణించారు . ఇందులో చెప్పుకున్నట్టు జగదేక చక్షుడికి ‘ దృష్టి వేల్పు’ అని మరొక పేరుంది . అందువల్ల  ఆయన అనుగ్రహం చేత దృష్టి లభిస్తుంది.  అది కేవలం మనుషులకి మాత్రమే కాదు, ప్రపంచానికి ఆయన లేకపోతే దృష్టే లేదు. చివరికి  త్రిమూర్తులు కూడా ఆయన స్వరూపమే అని ఈ స్తుతి ద్వారా తెలుస్తోంది కదా ! 

పైగా సూర్యుని నుండీ వెలువడే ఉదయపు కిరణాలల్లో చూపుకి మేలుచేసేవి కూడా ఉంటాయి . సూర్య కిరణాల్ని విశ్లేషించి వాటికి ప్రత్యేకమైన పేర్లని , వాటి ప్రయోజనాన్ని పొందేలా పూజా విధానాలనే రూపొందించిన మన ఋషుల గొప్పదనాన్ని కాదనగలమా ! కాబట్టు , వెంటనే లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, సూర్యనమస్కారం , సంధ్యావందమ్ చేసుకో నాన్నా !” అంటూ అనునయించింది .

 ఇక మా రవి , ఆ రవిని ఆరాధించేందుకు వెంటనే లేచాడు . ఇలాంటి అమ్మమ్మలు, నానమ్మలు ఉన్న ఉమ్మడి కుటుంబాలు తక్కువకావడమే బహుశా మనం గొప్ప సంప్రదాయాలు కోల్పోవడానికి కారణమేమో అనిపించింది నాకా క్షణం !!

సర్వేంద్రియానాం నయనం ప్రధానం:

#drusti #suryaradhana #bhaskararadhana #eyesight

Tags: sungod, surya, suryadev, dristi, drusti, eyesight, surya aradhana, bhaskara, aradhana,

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda