Online Puja Services

సూర్యుని జన్మ ఈ సృష్టి రహస్యాన్ని చెబుతుందా?

3.141.152.173

సూర్యుని జన్మ ఈ సృష్టి రహస్యాన్ని చెబుతుందా? 
-లక్ష్మీ రమణ 

 సూర్యుడు ఒక పెద్ద మండే అగ్ని గోళం . కేవలం ఒక అగ్నిగోళమైతే , మనం దానిగురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . కానీ సూర్యుడు ఈ జగతిని పోషించే పోషకుడు .  ఒకవేళ సూర్యుడే గనుక లేకపోతె, సూర్యరశ్మిగనుక ఈ భూమిని తాకకపోయి ఉన్నట్టయితే, అసలు ఈ మట్టి మీద జీవం ఆవిర్భావం , దాని మనుగడ సాధ్యమయ్యేదే కాదు . సూర్యరశ్మినుండీ ఆహారాన్ని తయారు చేసుకొని మొక్కలు , వాటిని ఆహారంగా చేసుకొని శాకాహార జీవులు, వాటిని ఆహారంగా చేసుకొని మాంసాహార జీవులూ బ్రతుకుతున్నాయి . అంటే, ఈ ఆహార క్రమానికి మూలం సూర్యుని వేడిమే కదా ! 

ఆదిత్య హృదయం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది . 
‘ఆదిత్య స్సవితా సూర్య: – ఖగ: పూషా గభస్తిమాన్‌ |
సువర్ణసదృశో భాను: – స్వర్ణరేతా దివాకర: ||”
అంటుంది . 

అంటే, ఆదిత్యుడే  జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుకునేందుకు ప్రేరణ ఇచ్చేటటువంటివాడు.  లోకోపకారం కోసం  ఆకాశములో సంచరిస్తూ, వర్షముల ద్వారా జగత్తును పోషించి, తన కిరణములను ప్రకాశింపజేస్తాడు.  బంగారు వన్నెతో తేజరిల్లుతూ  అద్భుతముగా ప్రకాశిస్తూ , బ్రహ్మాండముల ఉత్పత్తికి స్వయముగా బీజమైనవాడు.  చీకట్లను తొలగిస్తూ, ఉదయించి, వెంటనే  ప్రాణులను కార్యనిమగ్నులను చేసేటటువంటివాడు అని . 

ఇటువంటి సూర్యుడు ఎలా జన్మించాడో మనకి బ్రహ్మపురాణం విపులంగా చెబుతుంది . మామూలుగా శిశువు , తల్లి గర్భం నుండే కదా జన్మిస్తాడు . వేకువ ఝామున నింగి గర్భంలోనుండీ జన్మించే భానుడు , మధ్యాహ్నానికి మార్తాండ తేజస్సుతో వెలిగిపోతుంటాడు .  ఆసమయంలో భూమిని  తాకే ఆయన అకిరాణాల వేడినే మనం తట్టుకోలేము . కానీ, సూర్యుని కన్న తల్లి, ఆయన తేజస్సుని గర్భంలో  భరించిందంటే, ఆవిడ ఎంతటి తపస్సంపన్నురాలో అర్థం చేసుకోవాలి . ఆవిడే దేవమాత అదితి . సూర్యుని తండ్రి కశ్యప మహాముని .  ఈ పుణ్యదంపతులకి సూర్యుడు ఉదయించడమూ ఒక అద్భుతమైన సృష్టిరహస్యమే . 

కశ్యపమహాముని  ప్రజాపతులలో ముఖ్యుడు. ఈయన స్వరూపాన్ని వివరిస్తూ , 'ఆకారాత్‌ కూర్మ:' అని చెబుతుంది శతపథ బ్రాహ్మణం. అంటే,  ఈయన  కూర్మం లేదా తాబేలు లాగా ఉండేవారు అని కదా!  'కశ్యపం' అంటే కూడా తాబేలు అనే అర్థం. అథర్వణ  వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే, అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ జీవుడనీ భావం. ఇక ఇప్పుడు మానమున్న మన్వంతరం పేరు  వైవస్వత మన్వంతరం. ఈ కాలానికి అధిపతి  వివస్వతుడు అనే మనువు. ఈ వివస్వత మనువుకు కూడా తండ్రి కశ్యపుడే. అంటే,  మన మన్వంతర కాలానికి అధిపతికి కూడా పూర్వజుడు ఈ కశ్యప ప్రజాపతి  అన్నమాట .   

ఇక , వాల్మీకి రామాయణం ప్రకారం కశ్యపుడు బ్రహ్మగారి కొడుకు. మహా ఋషి పుంగవుడు .  కశ్యపుని పేరు మీదుగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు పురాణాలు చెబుతాయి. ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు. అంటే స్వయంగా ఆ దక్షుని కూతురిని వివాహం చేసుకొన్న పరమేశ్వరునికి  ఈయన తోడల్లుడన్నమాట. 

కశ్యపునికి  బ్రహ్మ విషానికి విరుగుడు ఉపదేశించారు.  పరశురాముడు భూమినంతా దానం చేశారు . ఈయనకున్న మరో పేరు అరిష్టనేమి. విశేషం ఏమిటంటే, దేవతలకి, రాక్షసులకు జన్మనిచ్చింది కశ్యపుడే . రాక్షసులకు తల్లి దితి . దేవతలకి తల్లి అదితి . అంటే ఇద్దరూ ఒకరికి ఒకరు దాయాదులు కదా ! ఇలాగే, పరస్పరం వైరులైన పక్షులకి వినుత , నాగులకి కద్రువ జన్మనిచ్చారు . 

ఆ విధంగా ఆరంభమైన సృష్టిలో కశ్యప ప్రజాపతికి , అదితికి జన్మించిన మహానుభావుడు , ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు . ఈ సూర్యుని 12 పేర్లతో వివరిస్తూ , 12 మంది సంతానం  అనీ, వారే  ద్వాదశ ఆదిత్యులు అంటుంది బ్రహ్మ పురాణం. ఈ 12 మంది సూర్యులు జన్మించేనాటికే , అప్పటికే ఉన్న ప్రపంచంలో రాక్షసుల ఆగడాలు పెచ్చు మీరిపోయాయి . చెడు ఎప్పుడూ చాలా త్వరగా వ్యాపిస్తుంది . ఆ సమయంలో అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి తేజోశక్తిని ప్రార్థించింది. విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి. 

పుట్టబోయే కొడుకు, ప్రపంచాన్ని పోషించగలిగినవాడు , అసమాన తేజో సంపన్నుడు , అపార శక్తి కలిగినవాడు కావాలని , దైవ శక్తిని ప్రార్ధిస్తూ , వారి అనుగ్రహం కోసం వ్రతాలూ, ఉపవాసాలూ చేయసాగింది అదితి. అయినా ఆవిడ అసమాన తేజోసంపన్నంగా , మహా జీవకాంతితో దివ్య స్వరూపంగా, ఆరోగ్యంగా ఉంది . అయినా,  ఆమె చేస్తున్న ఉపవాసాల వల్ల  బిడ్డకి ఇబ్బంది కలగొచ్చనే జాగ్రత్తతో , అనుమానపడి, కాస్త అసహనంగా భార్యని మందలించారు కశ్యపుడు. గర్భిణీ అని ఆయన చేసిన మందలింపు, కాస్త కటువుగా అమ్మ మనసుని తాకడంతో ఆవిడ బాధపడింది . తన గర్భంలో పెరుగుతున్న అండాన్ని  త్యజించింది. 

ఆమె కడుపులోంచి ఆ అండం నేలమీదకి జారగానే, లక్ష అగ్నిగోళాలు ఒక్కసారే బయల్పడినట్టు  భగభగా మండింది.  ఆ వేడికి సృష్టి మొత్తమే అతలాకుతలమైంది. అదితీ,కశ్యపుల ప్రార్థన తర్వాత, ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటికొచ్చాడు. అసమాన తేజో సంపన్నుడైన ఆ బాలుడే భానుడు! అలా సూర్యుడు ఉద్భవించిన ఆ రోజు  మాఘశుద్ధ సప్తమి. ఆరోజునే మనం ఈ నాటికీ  రథసప్తమి పేరిట పండుగగా జరుపుకుంటున్నాం . పుడుతూనే ఆయన సప్త అనే గుర్రాన్ని పూన్చిన  రథాన్ని అధిరోహించి, వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతోంది. ఆ తర్వాత, అప్పటికే జగతిని పీడిస్తున్న అసురీ శక్తులని తల్లి కోరిక మేరకు ఓడించి ఆదిత్యుడని పేరొందాడు. 

ఇక ఆయన రూపము ఆయన చేసే పని కూడా భానుని జన్మోదంతం లాగానే, అద్భుతంగా అనిపిస్తాయి . ఒక రకంగా ఈ సృష్టి జననాన్ని , పోషణనీ, లయాన్ని ఆదిత్యుడే సర్వ దేవతా స్వరూపమై నిర్దేశిస్తున్నాడు. రాక్షసులని, దేవతలనీ కూడా సమదృష్టితో చూడగలిగిన సాత్వికత ఆ ఆదిత్యునిది. ఆయన స్వరూపానికి సంబంధించిన విశేషాలని మనకి ఆదిత్య హృదయం విపులంగా చెబుతుంది . 

 సూర్యుడు కాలస్వరూపుడు. ఆయన యెర్రని రంగులో ఉంటారు .సప్త ఛందస్సులు రధరూపం ధరిస్తే ఆ ఛందోరధముపై నిత్యము గగన మార్గంలో సంచరిస్తున్న మహనీయుడు భాస్కరుడు.ఆ రథాన్ని నడిపే గుర్రాలు ఆకుపచ్చని రంగులో ఉంటాయట .  సృష్టినంతా కలయతిరిగే  ఆయన రథానికి ఒకే ఒక చక్రముంటుంది. ఆ చక్రమే కాలాన్ని కొలిచే సంవత్సరము.  ఇందులోనే  పన్నెండు మాసములు, నాలుగు – నాలుగు మాసముల చొప్పున మూడునాభులుగా ఏర్పడి ఆరు ఋతువులుతో సహా కూడి ఉంటాయి. దీన్నే కాలచక్రమని కూడా అంటారు.  కాబట్టి, ఈ పోషకుడైన సూర్యభగవానుడు పన్నెండు మాసములలో పన్నెండు పేర్లతో ఆరాధించబడతాడు. వారే ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు. "ఆదిత్యానా మహం విష్ణుః" - ఇటువంటి  ఆదిత్యులలో నేను విష్ణువును - అని భగవద్గీతలో భగవానుడు చెబుతారు.  ఆ విధంగా స్వయంగా విష్ణువే ఆదిత్యుడయ్యారు . విష్ణువు పోషకుడు . ఆ పోషణా బాధ్యతలని నిజానికి నిర్వర్తిస్తున్నవాడు సూర్యుడు . అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని కీరిస్తూ ఉంటాము .

ఈ ద్వాదశ ఆదిత్యుల స్వరూపంలో సూర్యుడు పన్నెండు నేలల్లోనూ పరివార జనులతో కూడి తన రథం మీద లోకమంతా సంచరిస్తూ ఉంటారు . రాజుగారు బయటికి వెళ్లినా, యుద్ధానికి వెళ్లినా, కర్తవ్యపాలనకి వెళ్లినా, వెనకాల పరివారం లేకుండా వెళ్ళరు కదా ! అలాగన్నమాట . సూర్యుని వెనకాల ఉండే ఈ పరివారం ప్రతి నెలా మారుతూ ఉంటుంది . మహాభాగవతం 12వ స్కంధం చివరిలో మనకి ఈ ద్వాదశాదిత్యుల వర్ణన ఉంటుంది . దీని ప్రకారమా ఆదిత్యుని వెంట ఆరుగురు పరిజనులు ఉంటారు. వారిలో ఒక అప్సరస , ఒక రాక్షసుడు , ఒక నాగప్రముఖుడు , ఒక యక్షుడు , ఒక మహర్షి , ఒక గంధర్వుడు  ఉంటారు . ఉదాహరణకి  సూర్యుడు ‘ధాత’ అనే స్వరూపంలో ఉండే చైత్రమాసంలో  కృతస్థలి  అనే అప్సరస, హేతి అనే రాక్షసుడు, వాసుకి అనే నాగ ప్రముఖుడు , రథకృత్తు అనే యక్షుడు, పులస్త్యుడు అనే ఋషి, తుంబురుడు అనే గంధర్వుడు ఆయన వెంట సూర్యరథంలో పరివార జనులుగా ఉంటారు . అలాగే వైశాఖ మాసంలో సూర్యుడు ‘అర్యముడు’ గా ప్రభవిస్తే,  ఆయన వెంట  పుంజికస్థలి అనే అప్సరస, పులహుడు అనే  రాక్షసుడు , ఓజస్సు  అనే  నాగము , ప్రహేతి అనే యక్షుడు, నారదుడు అనే ఋషి , కంజనీరుడు అనే గంధర్వుడు పరివార జనులుగా ఆయన వెంట కర్తవ్య నిర్వహణకై సూర్యరథంలో వెంట కదుల్తారు . అదే విధంగా మిగిలిన పదిమంది ఆదిత్యులూ కూడా ఆయా మాసాలలో వేరు వేరు పరివార జనులతో కలిసి వుంటారన్నమాట .  

ఈ పరివార జనులు ఏంచేస్తారనే వివరణ కూడా భాగవతం చెబుతుంది .  ఈ పన్నెండుగురు ఆదిత్యులూ కూడా  విష్ణువు యొక్క సూర్యరూప విభూతులే . పరివార జనులుగా సూర్యుని వెంబడించే వారిలో ఋషులు వేదత్రయాన్ని చదువుతుంటారు. గంధర్వులు గానాన్ని చేస్తుంటారు. అప్సరసలు నాట్యం చేస్తుంటారు. నాగులు సూర్య రథాన్ని చుట్టుముట్టి ఉంటారు. యక్షులు రథ యోజన చేస్తారు. రాక్షసులు రథాన్ని వెనుక వైపు నుండి తోస్తుంటారు. వాలఖిల్యులనే పేరుగల బ్రహ్మర్షులు అరవైవేలమంది  రథం ముందు ,  సూర్య భగవానునికి అభిముఖులై నిలబడి  త్రయీమూర్తిని ప్రస్తుతిస్తుంటారు. ఇలా తన తేజస్సుకు ధీటైన వైభవంతో , చైతన్యంతో ముందుకు కదులుతూ జగతిని ప్రకాశింపజేస్తుంటారు సూర్య భగవానుడు . 

కాలమే తానైనవాడి వయసుని కొలవడం కాస్త కష్టమైన పనే . అయినా మన లెక్కలు మనకుంటాయి కదా ! అలా ఖగోళశాస్త్రం ప్రకారం, సూర్యుడి వయసు నాలుగువందల అరవై కోట్ల సంవత్సరాలు.  విశేషం ఏమిటంటే, దాదాపుగా సృష్టి వయసు కూడా అదే! సూర్యుడు వేల వేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్‌, హీలియంలతో నిండిన వాయుగోళం. ఆ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే, భూమి సహా వివిధ గ్రహాలు సూర్య భ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థలో తొంభైతొమ్మిది శాతం దినకరుడి అధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే వందరెట్లు పెద్దది. ఇదీ మన ఖగోళశాస్త్రం చెప్పే మాట . 

అదే విధంగా,  సూర్యుడు వేసే ప్రతి అడుగు- వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. అందుకే కాలమైన సూర్యుడే వేదస్వరూపం అంటోంది వేదం. కాలం కంటికి కనబడదు. దైవమూ అంతే. కానీ కాలానికి ప్రమాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్షదైవంలా కొలిచి, ఆది నారాయణుడిగా ఆరాధిస్తాం. భౌతిక, వైజ్ఞానిక, దృష్టితో పరిశీలిస్తే సృష్టి, స్థితి, లయ కారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది.

ఈ చైతన్య స్వరూపమైన సూర్యుడు జగతిలో చైతన్యాన్ని ఎలా కలుగ జేస్తున్నాడు ? అని ప్రశ్నిస్తే, తన కిరణముల చేత అనే సమాధానం వస్తుంది . ఆ కిరణములే సప్త వర్ణములు. తెల్లని కాంతి పరావర్తనమే రంగులు. అనుకుంటే, ఆ కాంతి ఎక్కడ పరావర్తనం చెంది భూమిని తాకటం వలన ఈ రంగులు ఏర్పడుతున్నాయి కూడా మనకి సనాతన శాస్త్రం చెప్పడం విశేషం . ఈ ఏడు రకాలైన కాంతులు సప్త వర్ణాలని కలిగి ఉండి , ఏడు రకాలైన చైతన్య కార్యక్రమాలని ఈ జగతిలో  నిర్వహిస్తాయి. ఆమాటకొస్తే, సూర్యుని శక్తిని వినియోగించుకోవడం ఎలా అని చెప్పేదే వేదం . 

అనంతకోటి కాంతులతో ప్రకాశమవుతున్నప్పటికీ, సూర్యుని ప్రధానమైన ఈ ఏడు కాంతులకి పేర్లున్నాయి. సుషుమ్నా, సురాదనా, ఉదన్వసు, విశ్వకర్మా, ఉదావసు, విశ్వవ్యచా, హరికేశ అనేవి ఆ పేర్లు . ఇక్కడ విచిత్రమేమంటే స్వయంప్రకాశుడైన సూర్యభగవానుడు తన యొక్క ఒక్కొక్క కిరణంతో ఒక్కొక్క గ్రహాన్నిఆవిర్భవింపచేసి ప్రకాశించేట్లు చేస్తున్నాడు. ఇటువంటి వర్ణముల కిరణములని ఉపయోగించి వైద్యం చేయడం చాలా విశిష్టమైన విధానం .దాన్ని ‘కోరమోపతీ’ అంటారు. ఈ విధానంలో ఎన్నో తీవ్రమైన , మొండి వ్యాధులకు కూడా పరిష్కారం దొరుకుతూ ఉండడం విశేషం . ఈ విషయం మన పెద్దలకీ,  ఋషులకీ ముందుగానే తెలుసు అనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా ఈరోజుకి మనం పాటిస్తున్న సంప్రదాయాలు నిలుస్తున్నాయి .  ఉదాహరణకి మన  పూర్వజులు సూర్యునికి  అర్ఘ్యం ఇచ్చే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు .  అలా నీటిని ఆర్ఘ్యంగా సూర్యునికి సమర్పించేప్పుడు ఆ నీటిమీద ప్రతిఫలించిన సూర్యకిరణాలు , పరావర్తనం చెంది మన శరీరంపై ప్రసరించడం వల్ల, మన శరీరంలోని రోగకరములైన క్రిములన్నీ నశిస్తాయి. అంతే కాకుండా  మన శరీరశక్తి సంపన్న మవుతుంది.

ఈ విధంగా,సూర్యుని గురించి యెంత చెప్పుకున్న ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. అటువంటి అనంతమైన నిఘంటువు ఆయన .  “మనువుకు పూర్వజుడు, మనుష్యులకు మూల పురుషుడు అయిన ఆదిత్యుడికి నేనే స్వయంగా యోగమును ఉపదేశించాను. ఆ తర్వాత సూర్యవంశానికి మూలపురుషుడైన ఇక్ష్వాకుడికి సూర్యుడు ఈ యోగమును బోధించాడని” గీతలో భగవానుడు అంటారు . ఆవిధంగా మనకి పూర్వజుడు, మన జన్మలకి కారణమైనవాడు సూర్యుడే. 

ఇదీ స్థూలంగా సూర్యుని జన్మ వృత్తాంతం . రోజూ ఈ సూర్యుని ఆరాధనని , వీలయితే, అరుణం పారాయణం , లేదా ఆదిత్య హృదయం పారాయణం చేసి  సూర్యనమస్కారాలు చేస్తే, ఖచ్చితంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది . ప్రత్యేకించి సూర్యుడు నమస్కార ప్రియుడు కనుక ఆ విధంగా చేసి సూర్యుని అనుగ్రహానికి పాత్రులమవుదాం .

నమస్కారం  . 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda