Online Puja Services

సూర్యోపాసన చేయడం ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక ప్రగతికి ఒక సాధనం

3.17.6.75

సూర్యోపాసన చేయడం ఆరోగ్యానికీ, ఆధ్యాత్మిక ప్రగతికి ఒక సాధనం . 
లక్ష్మీ రమణ 

సూర్యోపాసన మనకి అనాది కాలం నుండీ వస్తూన్నదే. సూర్యోపాసన వలన, ఆరోగ్యం , ఆనందం రెండూ ప్రాప్తిస్తాయని మన ధర్మం చెబుతుంది . ఈ సూర్యోపానని అనుష్టించినవారిలో అగస్త్య మహర్షి , రాములవారు, ఆంజనేయుడు, యాజ్ఞవల్క్యుడు ప్రధానంగా కనిపిస్తారు . సూర్యనమస్కారాలని నిత్యం చేయడం వలన ఎన్నో ఉపయోగాలున్నాయంటుంది యోగశాస్త్రం . ప్రస్తుతకాలంలో శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నా ఈ సూర్యోపాసనా విధానాన్ని , అద్భుతమైనవాటి ఫలితాన్ని గురించి రథసప్తమి సందర్భంగా తెలుసుకుందాం . 
 
సూర్యుడు ప్రతక్ష్య నారాయణుడని , స్వయంగా కనిపించే విష్ణురూపమైన  దైవంగా కొలవడం మనకి అనాదినుండీ అలవాటే ! ఆంజనేయుడు ఆ సూర్యుని దగ్గరే విద్యని అభ్యసించి, ఆయన పుత్రిక అయిన సువర్చలా దేవిని వివాహం చేసుకున్నారు కాబట్టే, ఆయన బల, బుద్ధి సంపన్నుడయ్యారు. ఇక ఆయన గురువుగారు, దైవమూ, సర్వమూ అయినా శ్రీరామచంద్రులవారు సూర్యోపాసన చేశారు . రావణాసురుడి తో యుద్ధంచేస్తున సమయంలో అలిసిపోయిన రాములవారి అగస్త్య మహాముని ఆదిత్యహృదయాన్ని ఉపదేశించారు . అలా అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్యోపాసన చేయడం వలన,  రావణాసురుడిపైన విజయాన్ని సాధించారు . 

యోగాభ్యాసము సూర్యోపాసన గురించి అద్భుతంగా చెబుతుంది . యోగ ప్రక్రియలో సామూహిక ఆసనాల స్వరూపమే సూర్య నమస్కారాలు. 12 భంగిమలు, 12 మంత్రాలతో కూడిన ఈ ప్రక్రియలో ఒక సంక్షిప్తమైన వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం ఇమిడి ఉన్నాయి. ఈ సాధన వల్ల శరీరంలో ఉండే ప్రతి అవయవం ఉత్తేజితమై విష పదార్థాలను విసర్జిస్తుంది. శరీరంలో గ్రంథులు, అంతరంగిక గ్రంథులు, అంతస్రావాలు (హార్మోనులు) సమతుల్యం అవుతాయి. అంతేకాకుండా, పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి, కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియను సూర్యోదయం సమయంలో సూర్యుడికి అభిముఖంగా సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిజానికి సకల జీవరాశులకు ఆధారభూతమైనవాడు సూర్యుడు. ఆయన రాకతోనే జీవనం ప్రారంభం అవుతుంది. ప్రస్తుత కరొనా కాలంలో అందరికీ కావాల్సింది ఆరోగ్యం. రోగనిరోధక శక్తి. అటువంటివి ఇవ్వగలిగిన వాడు సూర్యుడు. పూర్వీకులు చెప్పినవి ఒక్కొక్కటి నేటి శాస్త్రవేత్తలు అంగీకరించడం మనం చూస్తూనే ఉన్నాం.

ప్రస్తుతం సూర్యారాధన ఏయే మాసాలలో ఏ పేర్లతో చేయాలో తెలుసుకుందాం… అనేక పురాణాల్లో సూర్యోపాసన విధానం గురించిన వివరాలెన్నో ఉన్నాయి. భవిష్య పురాణంలో రాజు మాంధాత సూర్య వ్రతాన్ని గురించి తమ కులగురువు వశిష్టులవారిని అడిగినప్పుడు ఆ మహర్షి చెప్పిన విశేషాలు ఇలా ఉన్నాయి. అన్ని మాసాలలోకీ సూర్యారాధనకి ప్రాశస్త్యమైన మాసం మాఘమాసం. ఆయన పుట్టిన రోజు రథసప్తమి ఈ నెలలోనే వస్తుంది మరి .

మాఘమాస సూర్య (ఆది)వారంనాడు ‘వరుణాయ నమః‘ అనీ, ఫాల్గుణమాసంలో ‘సూర్యాయ నమః‘ అనీ, చైత్ర మాసంలో ‘భానవే నమః‘ అని, వైశాఖమాసంలో ‘తపనాయ నమః‘ అని, జ్యేష్టమాసంలో ‘ఇంద్రాయ నమః‘ అని, ఆషాఢమాసంలో ‘రవయే నమః‘ అని, శ్రావణమాసంలో ‘గభస్తయే నమః‘ అని, భాద్రపదమాసంలో ‘యమాయ నమః‘ అని, అశ్వయుజమాసంలో ‘హిరణ్య రేతసే నమః‘ అని, కార్తీక మాసంలో ‘దివాకరాయ నమః‘ అని, మార్గశిర మాసంలో ‘మిత్రాయ నమః‘ అని, పౌష్యమాసంలో ‘విష్ణవే నమః‘ అనీ వివిధ మాసాలలో, వివిధ నామాలూ, వివిధ నైవేద్యాలతో సూర్య వ్రతం చేసిన తరువాత, ఉద్యాపన కూడా చేయాలి అని మనకి ఆ మహర్షి చెబుతారు .

ఈ విధానంగా మనం సూర్యారాధన చేయడం వలన ఆధ్యాత్మికమైన , ఆరోగ్యమైన అనేక ప్రయోజనాలు లభిస్తాయి . సూర్యునికి సంబంధించిన దేవాలయాల దర్శనం కూడా చక్కటి ఫలితాన్ని అందిస్థుడి . మన దేశంలో సూర్యునికి గల దేవాలయాలలో ప్రముఖమైనవి ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం. గుజరాత్ మోదెరాలో సూర్య దేవాలయం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యదేవాలయం, పెద్దాపురం వద్ద ఉన్న పాండవుల మెట్ట మీద ఉన్న సూర్యదేవాలయం ప్రముఖమయినవి. అదేవిధంగా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడ లో కూడా సూర్యదేవాలయం ఉంది. 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi