ప్రపంచానికి ప్రాణశక్తి సూర్యభగవానుడు

3.238.174.50
ఆయన సకల లోకాలకు ఆత్మ స్వరూపుడు. ప్రపంచానికి కాల స్వరూపుడు. గ్రహాలకు అధిపతి. దేవతల్లో అగ్రగణ్యుడు.జ్ఞానాన్ని పంచే శివరూపుడు. మోక్షాన్ని ప్రసాదించే జనార్థనుడు. ఐశ్వరాన్నిచ్చే, ఆరోగ్యాన్నిచ్చే అగ్నిరూపుడు. ఆయనే ప్రత్యక్షదైవం శ్రీసూర్యనారా యణ భగవానుడు. ఆయన లేకపోతే సృష్టేలేదు. రేయింబవళ్లుండవు కాలానికి కొలమానం సూర్యగమనం. అందుకే సకల చరాచర సృష్టికి, జీవరాశి మనుగడకు సూర్యశక్తి తప్పనిసరి.
మాయవలన పుట్టిన మనుష్య, పశ్వాదులైన జరాయుజములకు, గుడ్ల నుంచి పుట్టిన పక్షులు, పాములు వంటి అండజములకు, చెమట వల్ల పుట్టిన దోమలు, నల్లులు వంటి స్వేదజములకు, విత్తనము పగలదీసి జన్మించిన వృక్షజాతుల వంటి ఉద్భిజ్జములతో కూడిన లోకాన్ని ఎల్ల వేళలా రక్షించే ఆదిత్యుడు. అందుకే ఆ పరమాత్ముడిని ప్రత్యక్షమైన కర్మకర్తగా, ప్రత్యక్షబ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, రుగ్వేదం, యజు ర్వేదం, సామవేదం, అధర్వణ వేదమగు ఛంద స్వరూపుడని సూర్యో పాసకులు చెబుతుంటారు. ఆదిత్యుడి నుంచే వాయువు, భూమి, జ్యోతి, ఆకాశం,దేవతలు, వేదములు ఉద్భవించాయి.
భాస్కరుడు ఈ మండలాన్ని ప్రకాశింపజేస్తాడు. ఆయనే పంచ ప్రాణవాయువులు. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, శబ్థ, స్పర్శ, రూప రస. గంధములు గా ప్రపంచానికి ఆపద్భాందువుడయ్యాడు. సూర్యునిగా సర్వదిక్కుల కు వ్యాపించి,సర్వశుభాలు, దీర్ఘాయువును ప్రసాదిస్తున్నాడు. రోహిణి నక్షత్రంలో ఆదివారం సూర్య నారాయణమూర్తి జన్మించాడు. జల ప్రళయానంతరం వైవస్వత మనువుకు సూర్యభగవానుడు కన్పించిన రోజునే రథసప్తమి అని పిలుస్తారు. ఆదివారం నాడు రథసప్తమి వస్తే మహాయోగమనే చెప్పాలి. సప్త అశ్వాలతో కూడిన రథంలో ఆశీనుడైన సూర్యభగవానుడు మనువుకు దర్శనమిచ్చే దినమే సూర్య జయంతిగా సూర్యపురాణం తెలియజేస్తుంది. సూర్యుని యొక్క సంచారాన్ని బట్టే ఉత్తరాయణం, దక్షిణాయణాలుగా విభజించారు.
మకరం నుంచి మిధునం వరకు గల సూర్యసంచారాన్ని ఉత్తరాయణమని,ఇది ఎంతో శుభప్రదమైనదని, ఆరోగ్యకాలమని చెబుతుంటారు. కర్కాటకం నుంచి ధనుస్సువరకు దక్షిణాయనమని, ఉత్తరాయణంలో మరణంలో వల్ల సూర్యమండలం ద్వారా ఉత్తమలోకాలకు జీవి చేరుతుందని పురాణా లు స్పష్టం చేస్తున్నాయి. అందుకే భీష్మ పితామహుడు శరతల్పగతుడై ఉత్తరాయణం వచ్చేవరకూ వేచి వుండి దేహత్యాగం చేశాడని శాస్త్రం పేర్కొంటుంది. సూర్యోపాసన ప్రాముఖ్యత రామా యణ కాలం నుంచి వుంది. మహర్షి విశ్వామిత్రుడు ఆవిష్కరించిన గాయత్రీ మంత్ర మే సూర్యోపాసనగా కొందరు భావిస్తారు. అగస్త్య మహర్షి ద్వారా ఆదిత్య హృదయాన్ని స్వీకరించిన రాముడు రావణ సంహారం చేసినట్టు రామాయణం చెబుతుంది.
అందుకే సర్వదేవతా సమాహార మే సూర్య భగవానుడని చాలా మంది నమ్ముతారు. ‘ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ! అంటూ ఆయన్ని ప్రతీ నిత్యం సేవించే వారికి చర్మ, శ్వాసకోశ, దీర్ఘరోగాలు సైతం మటు మాయమవుతాయి. ఎందుకంటే సూర్యశక్తిలో అంత పవర్‌ దాగి వుంది. సూర్యకాంతి మన కంటికి తెల్లగా కనిపిస్తుంది. కాని సప్తవర్ణ కారకమైనది.ఇంగ్లీషులో విబ్జియార్‌ అంటారు. ఇందులో వి అంటే ఊదా రంగని అర్థం. ఐ అంటే నీలిరంగు. బి అంటే నీలం, జి అంటే ఆకుపచ్చ, వై అంటే పసుపు పచ్చ, ఓ అంటే నారింజపండు, ఆర్‌ అంటే ఎరుపు. ఈ ఏడు రంగుల కలయికే తెలుపని శాస్త్రవేత్తలు సైతం చెప్పారు. వర్షాలు పడినప్పుడు సూర్యకాంతి ప్రభావం వల్లే ఆకాశం లో కొన్నిసార్లు హరివిల్లు (ఇంద్రధనస్సు) ఏర్పడుతుంది. ఇందులో సూర్యుని కాంతిలో గల ఏడురంగులూ మనకు స్పష్టంగా కనిపిస్తుం టాయి. ఈ ఏడురంగులనే మన పురాణాలు సూర్యభగవానుడి సప్తా శ్వాలుగా చూపించాయి. ఆయన 12 నెల ల్లోనూ 12 పేర్లతో, పన్నెండు రకాలుగా కనబడతాడు. అందుకే శాస్త్రంలో కూడా ద్వాదశ ఆదిత్యులుగా పేర్కొన్నారు.

చైత్రమాసంలో ధాతగా, వైశాఖంలో ఆర్యముడిగా, జ్యేష్టంలో మిత్రుడిగా, ఆషాడంలో వరుణుడిగా, శ్రావణంలో ఇంద్రునిగా, భాద్రపదంలో వివస్వంతునిగా, అశ్వీయుజంలో త్వష్టగా, కార్తీకం లో విష్ణువుగా, మార్గశిరంలో తర్యముడుగా, పుష్యం లో భగుడు,మాఘంలో పూషుడు, ఫాల్గుణంలో క్రతువుగా సూర్యనారాయణుడిని సూర్యోపాసుకులు కొలుస్తుంటారు.

చన్నీటి స్నానం చేసేవారికి ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. దీని వెనుక సూర్యుని ప్రభావం ఎంతో వుంది. సూర్యకిరణాల తాకిడికి నీరు తేజస్సును సంతరించుకుంటుంది. సూర్యుని లేలేత కిరణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయన ప్రపంచానికి వెలు గును, వేడిని ప్రసాదించే అపూర్వ శక్తి సంపన్నుడు. సూర్యుడు లేక పోతే భూమిపై జీవరాశి ఉనికి కష్టమనే చెప్పాలి. ఆయన లేకపోతే ఈ భూమండలంపై ఆహారమే తయారుకాదని చెప్పొచ్చు. అందుకే సూర్యభగవానుడి ఆరాధనపూర్వం నుంచి ఆచారంగా వస్తోంది. సాధా రణంగా దైవశక్తి అనేదిమనకు కన్పించదు.

సూర్యభగవానుడు మాత్రం మనకు కన్పిస్తాడు. అందుకే ఆయన ప్రత్యక్ష దైవంగా పూజలందు కుంటాడు. అంతెందుకు రెండు మూడు రోజులు వర్షాలు పడి ఆకాశం మేఘావృతమైతే సూర్యకాంతి కోసంజనులు తల్లడిల్లిపోతారు. ఆయన శక్తిని లోకం అనుభవిస్తోంది. సూర్యుని యొక్క మూడు దశలు సృష్టి, స్థితి, లయగా చెప్పొచ్చు. సూర్యోదయం సృష్టిగాను, మధ్యాహ్నం సూర్యశక్తి, ప్రకాశం సృష్టిని పాలించడానికి, సూర్యాస్తమయం సృష్టి లయమవ్వడాన్ని పోలివుంటాయి.

సూర్యు డు నాశనం లేనివాడు. రోజూ ఉదయస్తూ అస్తమిస్తూనే వుంటాడు. ఆయన ప్రపం చంలోని చీకటిని తొలగిస్తూ వెలుగులను ప్రసరిస్తూ నిద్రపోయే ప్రపంచాన్ని మేలు కొలుపుతాడు. అంత మహిమను స్వంతం చేసుకున్నవాడు కాబట్టే ఆ సూర్యనారా యణమూర్తికి నమస్కారాలు చేయడమ నేది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచార మని చెప్పొచ్చు.

రుగ్వేద, యజుర్వేద, సామవేదాల్లో సూర్యనమస్కారాల ప్రస్తా వన, వాటి ఫలితం ఎలా వుంటుందో తెలుస్తుంది. సూర్యోదయ వేళల్లో ఆయన ప్రసరించే లేలేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో లేముచేస్తాయని, డి.విటమిన్‌ లభి స్తుందంటూ వైద్యశాస్త్రమే చెబుతోంది. పూర్వం ఎందరో మహానుభావులు మంత్రా లతో పలురకాల సూర్యనమస్కారాలు చేసే వారు. రోజూ ఉదయాన్నే సూర్యనమస్కారం చేయడం వల్ల మనస్సు కు, మనిషికి తేజస్సు, శక్తి చురుకుదనం లభిస్తుందని చెప్పొచ్చు. అంతెందుకు మనకెవరైనా కొద్దిపాటి సాయంచేస్తే కృతజ్ఞతా భావంతో వారికి థ్యాంక్స్‌ చెబుతుంటాం.

జీవితానికి ఉపయోగపడేవిధంగా ఎవ రైనా సహకరిస్తే జీవితాంతం రుణపడి వుంటామని వారితో పదేపదే చెబుతాం. ఇదంతా మన బాధ్యతగా చేస్తుంటాం. ప్రతీరోజూ 12 గంటలు వెలుగును ప్రసాదించేశక్తి ఒక్క ఆదిత్యుడికి మాత్రమే వుంది. ఆ వెలుగు లేనప్పుడు విద్యుత్‌ వెలుగులు కింద కొన్ని గంటలు కరెంటు వాడుకున్నందుకుగాను వందల నుంచి వేల రూపాయల్లో బిల్లులు చెల్లిస్తాం. మరి అలాంటిది ఎన్నో సంవత్సరాల నుంచి వెలుగునిచ్చే సూర్యకాంతికి డబ్బు కట్టవల్సివస్తే ఆ పని మనం చేయగలమా? అది మనతరమా? నాలుగురోజులు ఎండ లేకపోతేనే వాతావరణమంతా కలుషితమైపోయినట్టు కన్పిస్తుంది.

మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తున్న సూర్యభగవానుడి సేవలను లెక్కకట్టలేము. ఇంతటి మహత్తర శక్తి,వెలకట్టలేని మేలు చేస్తున్న ప్రత్యక్షదైవమైన భాస్కరుడికి మనం ఏనాడైనా థ్యాంక్స్‌చెప్పామా? అని ప్రశ్నించు కోవాలి. మేము నీకు రుణపడి వున్నామన్న కృతజ్ఞత మనసులో ఎప్పుడైనా కలిగిందో లేదో ఆలోచించు కోవాలి. మనకు ప్రాణశక్తిని అందిస్తున్న సూర్యుడికి పూర్వీకులు రోజూ స్నానం చేసిన వెంటనే దోసెడు నీటిని తీసుకుని అర్ఘ్యం ఇచ్చేవారు. ఆపై నమస్కరించు కునేవారు.

అంతెందుకు కురుక్షేత్ర సమయంలో భీష్ముడు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేందుకు నీరు లేకపోతే మూడు దోసిళ్ల ఇసుకనే అర్ఘ్యంగా ఇచ్చినట్టు శాస్త్రం తెలియజేస్తోంది. అటువంటి ఉన్నతమైన సంప్ర దాయంలో జన్మించిన మనం సూర్యభగవానుడికి రోజూ రెండు చేతు లు జోడించి నమస్కరించి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం మన కనీస ధర్మమని చెప్పాలి. అందుకే స్థూలంగా కాకపోయినా సూక్ష్మంగా సూర్యునికి నమస్కరించేందుకు కొన్ని మంత్రాలను పఠి ద్దాం.

ఇప్పటికీ చాలా మంది యోగా చేసేవారు సూర్యనమస్కారాలు చేస్తుంటారు. ఒక సెట్‌ సూర్యనమస్కారాలు చేసే వారికి ఎంతో ఆరోగ్యం వుంటుంది. విపరీతమైన కాళ్లు నొప్పిలు,అనేక మైన శారీరక బాధలుపోతాయి. ఇది కేవలం సూర్యనమస్కార వ్యాయా మం వల్ల మాత్రమే సాధ్యమని చెప్పాలి. సూర్య నమస్కారాలు 12 భంగిమలు 12 రాశులను సూచిస్తాయి. సూర్యుని ప్రయాణంలో ఒక్కోరాశిలో 30 రోజులుం టాయి. 30 రోజుల తరువాత సూర్యుడి వేరొక రాశిలోకి ప్రయాణిస్తాడు.

1) ఓం మిత్రాయ నమః (స్నేహితుడు లాంటివాడు) 2)ఓం రవియే నమః (మెరిసేవాడు ) 3)ఓం సూర్యాయనమః (అందమైన వెలుగులు కలగవాడు) 4) ఓం భావనే నమః (మేధస్సుగలవాడు) 5)ఓం ఖగాయ నమః( ఖగోళంలో సంచరించేవాడు) 6) ఓం పూష్ణేనమః (బలాన్నిచ్చేవాడు) 7) ఓం హిరణ్యగర్భాయ నమః (మధ్య బంగారు రంగు కలవాడు) 8)ఓం మరీచయే నమః (పగటికి రాజు) 9)ఓం ఆదిత్యాయ నమః(అదితి కుమారుడు) 10) ఓం సవిత్రే నమః ( ప్రయోజనం చేకూర్చేవాడు) 11)ఓం అర్కాయ నమః (శక్తిగలవాడు) 12)ఓం భాస్కరాయ నమః (పరిపక్వత నిచ్చేవాడు) ఇక నుంచైనా సూర్యనమస్కారం అలవాటులేని వారు కనీసం రోజూ స్నానం చేసేటప్పుడైనా మూడు దోసిళ్ల అర్ఘ్యాన్ని ఆ మహానుభావునికి సమర్పించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Quote of the day

Condemn none: if you can stretch out a helping hand, do so. If you cannot, fold your hands, bless your brothers, and let them go their own way.…

__________Swamy Vivekananda