Online Puja Services

అష్టాదశ శక్తిపీఠం-3 శృంఖలాదేవి

3.144.102.239

ప్రద్యుమ్నే శృంఖలాదేవి

శ్రీ శృంఖలాదేవి ధ్యానం

 

ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖలా నామ భూషితే
విశ్వవిమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ

శక్తి పీఠాల్లో కొన్నింటిని గురించి పండితుల్లోనూ, చరిత్రకారుల్లోనూ విభేదాలు వున్నాయి. ఆవిధంగా విభేదాలు ఉన్న క్షేత్రాల్లో ప్రద్యుమ్నం ప్రధానమైంది. ప్రద్యుమ్నం ఎక్కడ వుందనే విషయమై వీరిలో ఏకాభిప్రాయం లేదు.

ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ప్రాంతం ’ప్రద్యుమ్నం’గా భావిస్తున్నారు. శృంఖలాదేవి ఆలయం ఎక్కడ వుండేది సరిగ్గా తెలియడం లేదుగానీ, కొందరు హుగ్లీ జిల్లాలోని ‘పాండువా’ అనే గ్రామంలో కొలువుదీరి వున్న దేవియే ’శృంఖలాదేవి’ అని పేర్కొంటున్నారు. పాండువా కలకత్తా నగరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో వుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ హజ్రత్ షా దర్గా - మినార్ మాత్రమే ఉంది... అవసాన దశలో ఉన్న ఆలయంలోని కొన్ని ప్రదేశాలు మాత్రం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నాయి..

ఇప్పటికీ ఇక్కడ ఏ ఆలయం లేనప్పటికీ ప్రతి మాఘమాసంలో మేళతాళాలతో ఉత్సవాలు/తిరున్నాళ్ళ జరుగుతుంటాయి... ఒక పేరుగాంచిన శక్తి పీఠం ఇలా ఏ ఆదరణకు నోచుకోక పోవడం ఒక ఆలయం లేకపోవడం.. మన దౌర్భాగ్యం.

స్థలపురాణం:

త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్లు కథనం. పూర్వం వంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలించేవాడు. రాజ్యం సస్యశ్యామలమై ఉండేది. అయితే ఒకసారి తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడి ప్రజలు విలవిలలాడసాగారు. కరువును గురించి తీవ్రమైన ఆలోచనలు చేసిన రోమపాదుడు ఋష్యశృంగుని గురించి విన్నాడు. ఋష్యశృంగుడు – విభాండకుడు, చిత్రరేఖల కుమారుడు. తపోబల సంపన్నుడు. ఆయన ఎక్కడ కాలుమోపితే అక్కడ సస్యశ్యాలమే! ఈ విషయం గురించి విన్న రోమపాదుడు, ఋష్యశృంగుని తీసుకువచ్చేందుకు కొందరు యువతులను ఆశ్రమానికి పంపాడు.

అంతవరకూ ఆశ్రమం వదలి బయటకు వెళ్ళని, ముని కుమారులను మినహా యితరులను చూసి ఎరుగని ఋష్యశృంగుడు యువతులను, వారి అందాలను చూసి ఆశ్చర్యపడి, వారి ఆశ్రమాలు ఎంత అందంగా వుంటాయో చూడాలనే ఉత్సాహం కలుగగా, వారి వెంట వంగదేశం చేరుకున్నాడు. ఋష్యశృంగుడి పాదం మోపడంతోనే కరువుపోయి, వర్షాలు కురిసి రాజ్యం సస్యశ్యామలం అయింది. రోమపాదుడు తన కుమార్తె శాంతాదేవిని ఋష్యశృంగునికిచ్చి వివాహం చేశాడు. ఈవిధంగా కొంతకాలం వంగదేశంలో గడిపిన ఋష్యశృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించి పూజించినట్లు కథనం.

శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కనుక శృంగలా దేవి అని పేర్. కాలక్రమంలో ఆ పేరు శృంఖలాదేవి అయింది.  శృంఖల అంటే రెండు రకాల అర్థాలున్నాయి.. మొదటిది.. బంధనానికి ఉపయోగించే గొలుసు (సంకెళ్ళు.)అని.. రెండవది బాలింతలు నడుముకు కట్టుకునే గుడ్డ అని అర్థం.. ఇక్కడ అమ్మవారు బాలింతలా నడుముకు గుడ్డ కట్టుకుని దర్శనమిస్తారు... శృంఖలాదేవి భక్తుల సమస్యల సంకెళ్ళు తొలగించే తల్లిగా పేరుపొందింది. సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటారు. దీనికి బాలింత నడికట్టు అని పేరు. దీనికే శృంఖల అనే పేరు వుండడం వల్ల క్రొత్తగా ప్రసవించిన బాలింత చంటి బిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతుందని భక్తుల నమ్మకం. కొంతకాలం తర్వాత ఋష్యశృంగుడు ఈ ప్రాంతంనుంచి వెళ్ళిపోవడంతో గ్రామంలోని శృంఖలాదేవితో పాటు కలకత్తాకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో వున్న ’గంగాసాగర”లోని గంగాదేవి కూడా శక్తిపీఠమే అని చెప్తారు.

ఏమైనప్పటికీ పురిటి బిడ్డల్లాగా తన భక్తులను రక్షించే కరుణా కల్పవల్లి – శ్రీ శృంఖలాదేవి! సతీదేవి ఉదరం పడిన ప్రాంతంలో వెలసిన శక్తిపీఠం ఇది. 

సర్వేజనా సుఖినోభవంతు 

- రామ కృష్ణంరాజు గాదిరాజు 

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore