Online Puja Services

అష్టాదశ శక్తిపీఠం-5 జోగులాంబా

18.189.2.122

అలంపురీ జోగులాంబా 

శ్రీ జోగులాంబా దేవి ధ్యానం 

జోగులాంబా మహాదేవీ రౌద్రవీక్షణ లోచనా
అలంపురీ స్థితా మాతా సర్వార్ధ ఫల సిద్ధిదా

తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌జిల్లాలో అలంపురం క్షేత్రంనందు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ జోగులాంబాదేవి మరియు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి కొలువైనారు. క్షేత్రమున సతీదేవి శరీరాంతర్గత వజ్రాస్తికులు పడినట్లు ప్రతీతి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ పీఠముగా పరిగణించబడుతోంది. శ్రీ జోగులాంబను ”విశృంఖలా” అని లలితాసహస్రనామములో చెప్పబడింది. నిత్యానాధ సిద్ధుని ”రసరత్నాకరము” నందు అమ్మను యోగాంబాగాను, తాంత్రికుడగు మహాభైరవుడు తన ”ఆనందకరము”లో యోగేశ్వరిగాను పేర్కొన్నారు.

శ్రీ బాల బ్రహ్మేశ్వరాలయమునకు ఆగ్నేయ దిశలో శ్రీ జోగులాంబా ఆలయం వుండేది. పూర్వకాలము నాటి ఆలయం శిథిలముకాగా, అమ్మవారి మూలవిగ్రహమును, శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయము నందు భద్రపరచినారు. శ్రీ జోగులాబా అమ్మవారి నూతన ఆలయమునకు దేవస్థానము వారు సంకల్పముచేసి, శ్రీశైలదేవస్థానము మరియు కంచి కామాక్షీపీఠం తాలూకా సహాయముతో ఆలయమును పూర్తిచేసినారు. శ్రీబాల బ్రహ్మేశ్వరాలయములోని శ్రీ జోగులాంబా మూల విగ్రహమును నూతన ఆలయం నందు తిరిగి ప్రతిష్ఠించినారు.

అలంపుర క్షేత్రంలోని ఆలయ సమూహం నందు శ్రీ జోగులాంబా ఆలయముతోపాటు బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ మరియు పద్మబ్రహ్మ అను నవబ్రహ్మాలయాలున్నాయి. వీటిలో తారకబ్రహ్మ ఆలయం ధ్వంసమైనది. ఆలయములోని శివలింగము రక్షింపబడినది. మిగిలిన ఎనిమిది ఆలయాలల్లో శ్రీ బాలబ్రహ్మేశ్వరాయలము ప్రధానమైనది. నవబ్రహ్మాలయముల నందు ప్రతిష్ఠించిన శివలింగాలు ప్రాచీనమైనవి. ఆలయ సమూహమునకు పశ్చిమదిశలో మహాద్వారం వుంది. శిల్పసృష్టితో మహాద్వారమును చాలా ప్రశస్తమైనది.

నాటి ముస్లింపాలకులు పశ్చిమద్వారమును ఆక్రమించి, దర్గా నిర్మించినారు. శ్రీ బాల బ్రహ్మేశ్వరాలయమునకు చుట్టు కట్టబడిన ప్రాకారములపై, బండలమీద కొన్ని సంకేతములు చెక్కబడినవి. తాంత్రిక చిహ్నముల నెరిగినవాటి సంకేతముల భావములను గ్రహింపగలరు. ఆలయసమూహంలోని శిల్పాలు, కళాఖండాలు తాంత్రిక చిహ్నములు కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. ఆలయం బయట గల పురాతన వస్తు ప్రదర్శనశాల నందు మరికొన్ని దర్శించగలము. శ్రీ జోగులాంబా సిద్ధులకు ఆరాధ్యదైవం. మంత్ర సిద్ధిని పొందగోరినవారు, అలంపుర క్షేత్రమున జపమొనరించినా, సిద్ధి కాగలదని ఆర్యులు నమ్మకం.

శ్రీ జోగులాంబా అమ్మవారికి ప్రత్యేకముగా ఆలయం వుండేది. శ్రీ జోగులాంబా మహోగ్రురాలై యుండేది. శ్రీ ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రాన్ని తగ్గించుటకు తగిన ప్రక్రియ యంత్రశక్తిని స్థాపించి, అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించారని ప్రతీతి. 16వ శతాబ్దంలో బహమనీసుల్తాన్‌ శ్రీ జోగులాంబా ఆలయ విధ్వంసానికి పూనుకొన్నాడు. ధ్వంసమైన ఆలయంలో శ్రీ జోగులాంబా విగ్రహమును, శ్రీ బాలబ్రహ్మేశ్వరాలయములోని నవగ్రహములు సమీపమున శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినారు. సుమారు 630 సంవత్సరములు తరువాత దేవస్థానంవారు, అదే పవిత్ర స్థలము నందు నూతన ఆలయం నిర్మించి, 13 ఫిబ్రవరి 2005వ సంవత్సరములో శ్రీ జోగులాంబా విగ్రహమును పునఃప్రతిష్ఠ చేశారు. నూతన ఆలయం చక్కటి ఆహ్లాదకరమైన ప్రాంతములో నిర్మించబడినది. ఆలయమంతా ఎర్రని ఇసుకరాయితో నిర్మించారు. ఆలయమండపము నందు అష్టాదశ శక్తి పీఠాలను పొందుపరచినారు.

ఆలయం చుట్టూ చక్కటి ఉద్యాన వనము వుంది. తూర్పున 5 అంతస్తులు మరియు పశ్చిమాన 3 అంతస్తులు గాలిగోపురములు కలవు. శ్రీ జోగులాంబా కుడివైపున పవిత్రమైన తుంగభద్రానది మరియు ఎడమవైపున శ్రీ బాలబ్రహ్మేశ్వరాలయ సమూహం కలవు. అమ్మవారి ఆలయం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 8 గంటల వరకు తెరచివుండును. సర్వదర్శనము ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లభ్యమవుతుంది. అర్చనలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించుతారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక అర్చనలు మరియు 7 గంటలకు మహామంగళహారతి సేవ జరుగుతాయి. ఆలయం బయట పూజాసామాగ్రీలు విక్రయించు షాపులు కలవు. ఆశ్వయుజ మాసమున దేవీనవరాత్రులు, రథోత్సవాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం సేవలు విశేషముగా వుంటాయి.


II సర్వేజనా సుఖినోభవంతు II

- రామ కృష్ణంరాజు గాదిరాజు 
 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha