మణిద్వీపవర్ణన మహత్యాన్ని వర్ణించడానికి

3.234.244.105

మణిద్వీపవర్ణన మహత్యాన్ని వర్ణించడానికి వేయిపడగలున్న ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు . 
లక్ష్మీ  రమణ 

మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలూ దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చేఫలితాలను వర్ణించడానికి వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదు. వాస్తు దోషాలు తొలగిపోయి అనంతశుభాలు కలుగుతాయి . చాలా సులభంగా ఆ దేవి అనుగ్రహాన్ని మనకి అందించే మణిద్వీప వర్ణనలో అసలు ఏముంది ? మణిద్వీపంలో ఉండే ఆ దేవి భువనేశ్వరిని ఎలా పూజించాలి ?

ఈ విశ్వాచాలనమే మణిద్వీపవర్ణనలో నిబిడీకృతమై ఉంది. ఆ చాలనా శక్తే , ఆ జగన్మాత . శ్రీచక్ర బిందు రూపిణి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీదేవి, శ్రీ మహావిద్య, శ్రీ మహాత్రిపురసుందరి, శ్రీ లలితా జగన్మాత అయినా ఆ భువనేశ్వరీదేవి నివాసముండే పవిత్ర ప్రదేశమే ఈ మణి ద్వీపం. పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.

మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయముచేయగల ముప్పదిరెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్థ విశ్వమూ ఉంది . ఆ ముప్పది రెండు మహాశక్తులూ ఆ భువనేశ్వరి సంకల్పము వల్ల జన్మించినవే .  ముప్పదిరెండురకాల పూలతో, పసుపు, కుంకుమలతో, నవరత్నాలతో, రాగి, కంచు, వెండి, బంగారము, మెదలగు లోహాలతో తయారు చేసిన పూవులతో యథాశక్తి అమ్మకు పూజచేయవచ్చు. నైవేధ్యాలుగా 32 రకాల పదార్థాలని చేసి,సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజించాలి . 32 రకాల నైవేధ్యాలకు శక్తిలేనివారు యదాశక్తి నైవేధ్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చు. అమ్మకు భక్తి ప్రధానము. కొండంత మాతకి కొండంత పత్రిని తేలేముకదా !

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna