Online Puja Services

ఐదురోజుల దీపావళి - రోజుకో విశేషం

3.138.105.31

ఐదురోజుల దీపావళి - రోజుకో విశేషం!
సేకరణ : లక్ష్మి రమణ 

దీపావళి అయిదు రోజుల పర్వం. ప్రతి రోజుకూ ఒక విశిష్టత ఉంది.

ధన త్రయోదశి: ఆశ్వయుజ బహుళ త్రయోదశితో దీపావళి సంరంభం మొదలవుతుంది. ఆ రోజును ‘ధనత్రయోదశి’ అంటారు. క్షీరసాగరం నుంచి మహాలక్ష్మి ఆవిర్భవించిన దినం.

నరక చతుర్దశి: ప్రజాపీడకుడైన నరకాసురుడి వధ జరిగిన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘నరక చతుర్దశి’ అని పిలుస్తారు.

దీపావళి: ఆశ్వయుజ అమావాస్యను దీపావళిగా జరుపుకొంటారు. ఈ రోజు ఇల్లంతా దీపాలతో అలంకరిస్తే, ఆ ఇంట లక్ష్మి కొలువుంటుందని నమ్మకం.

బలి పాడ్యమి: వామనావతారి అయిన విష్ణువు పదఘట్టనకు పాతాళానికి వెళ్ళిన బలి చక్రవర్తి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి రోజున భూలోకానికి వస్తాడట! అందుకే ఈ రోజును ‘బలి పాడ్యమి’ అంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధ గిరిని ఎత్తిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి.

యమ విదియ: కార్తీక శుద్ధ విదియకు ‘యమ విదియ’, ‘యమ ద్వితీయ’, ‘భాతృ విదియ’ అనే పేర్లున్నాయి. యమధర్మరాజును ఆయన సోదరి యమునా దేవి ఈ రోజున ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చిందట. దానికి సంతృప్తుడైన యముడు ఈ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి అపమృత్యుభయం, నరక బాధ ఉండవని వరం ఇచ్చాడట! దీన్నే ‘భగినీ హస్త భోజనం’ అనీ, ఉత్తరాదిన ‘భాయ్‌ దూజ్‌’ అనీ, అంటారు. లోకుల పాపపుణ్యాల చిట్టా రాసే చిత్రగుప్తుడి జయంతి కూడా ఈ రోజే!
 
ఆర్ష సాంప్రదాయంలో దీపమే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టే-


‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో స్తుతే’’
అని ఆర్యోక్తి.
 
‘‘అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సకలాభీష్ట పరమార్థాలనూ సిద్ధింపజేసే పరబ్రహ్మ స్వరూపమైన ఆ దివ్య పరంజ్యోతికి ప్రణామం’’ అని దీని భావం. మన హృదయాల్లో ‘అజ్ఞానం’ అనే నరకాసురుణ్ణి అంతమొందించి, జ్ఞానపూర్ణ పరమార్థ జ్యోతి అయిన ‘శ్రీసత్యా-కృష్ణ పరంజ్యోతి’లో లీనమయ్యే ఆధ్యాత్మిక వికాసాన్నీ, మోక్ష పథాన్నీ పొందడం, తద్వారా విశ్వకల్యాణానికి దోహదపడడం దివ్య జ్ఞాన దీపావళిలోని పరమార్థం. యుగయుగాలుగా దీపావళి పర్వం భారతీయ ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిందని చాటి చెప్పే పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక గాథలెన్నో! వాటిలో కొన్ని:
 

శ్రీకృష్ణ సత్య- ధర్మరక్షణ దీపావళి:

కృతయుగంలో శ్రీ వరాహస్వామి ద్వారా భూదేవికి జన్మించిన నరకాసురుడు లోకకంటకుడయ్యాడు. ధర్మసంస్థాపన కోసం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మహా విష్ణువు అవతరించగా, సత్యభామగా భూదేవిగా జన్మించింది. వారి ద్వారా ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరకాసుర వధ జరిగింది. నరక పీడను తొలగించిన సత్యభామా శ్రీకృష్ణులపై దివి నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. భువిలో మానవులంతా ఆనందోత్సాహాలతో ఆ మరునాడు ఇంటింటా తైల దీపాలను వెలిగించి చేసుకున్న పండుగే దీపావళి. పౌరాణికంగా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది. ఈ విధంగా అధర్మంపై సాధించిన విజయానికి చిహ్నంగా, ప్రధానంగా వెలుగుల పండుగగా దీపావళిని నిర్వహించడం సంప్రదాయం అయింది.
 

బలి చక్రవర్తికి స్వాగత దీపావళి:

శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని మూడు అడుగుల నేలను దానంగా కోరాడు. ఒక అడుగుతో భూమినీ, రెండో అడుగుతో ఆకాశాన్నీ ఆక్రమించి, తుదిగా బలి ఆమోదంతో మూడో అడుగును అతని శిరస్సుపై ఉంచి పాతాళానికి అణిచేశాడు. బలి చక్రవర్తి తాత, తన భక్తుడు అయిన ప్రహ్లాదుడి కోరికపై ప్రతి సంవత్సరం ఒకసారి భూలోకానికి వచ్చి, భూలోక వాసుల సుఖ జీవనాన్ని చూసి ఆనందించే వరాన్ని బలికి శ్రీమహావిష్ణువు అనుగ్రహించాడు. దాన గుణానికి పేరుపొందిన బలి చక్రవర్తి భూమిపైకి రాగా, ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగించి స్వాగతం పలికారట! అదే దీపావళి అయింది. అప్పటి నుంచి- అంటే కృతయుగం నుంచే దీపావళి పండుగ జరుపుకొంటున్నారని భవిష్యోత్తర పురాణంలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పిన దీపావళి కథా విశేషం. దీపావళి మరుసటి రోజున బలిని పూజిస్తారు. కాబట్టి అది ‘బలి పాడ్యమి’గా ప్రసిద్ధి చెందింది.
 

యమధర్మరాజు పూజ:

‘నరకం’ అంటే ‘యమలోకం’ అని స్థూలార్థం. ‘నరకలోక విముక్తి కోసం యముణ్ణి భక్తి నిష్టలతో పూజించే విశేష పర్వం నరక చతుర్దశి’ అని వ్రత చూడామణిలో- యమధర్మరాజు అనుగ్రహం కోసం పేర్కొన్న పూజా విధానాన్ని బట్టి తెలుస్తోంది. యమధర్మరాజు పూజకు ప్రతీకగా దీపాలు వెలిగించే పండుగ దీపావళి అనీ, దీనివల్ల నరక భీతి పోతుందనీ, స్వర్గ ప్రాప్తి కలుగుతుందనీ పురాణాల్లో పేర్కొన్నారు.
 

చతుర్దశ్యాంతు యే దీపాన్‌ నరకాయ దదంతి చ
తేషాం పితృగణాః సర్వే నరకాత్స్వర్గ మాప్నుయుః

ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున ఎవరైతే దీపాలు వెలిగించి, యమధర్మరాజును పూజిస్తారో వారూ, వారి పితృదేవతలూ నరకలోక విముక్తులై, స్వర్గాన్ని పొందుతారని దీని అర్థం. కాబట్టి ‘నరక చతుర్దశి’ నాడు యముణ్ణి పూజించి, దీపాల బారులను వెలిగించాలి. ఆ దివ్య కాంతుల ద్వారా పితృ దేవతలకు స్వర్గ మార్గాన్ని చూపించడానికి అలా దీపాల వరుసను వెలిగించాలని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి.
 

రామరాజ్య దీపావళి:

త్రేతాయుగంలో రావణుణ్ణి వధించిన శ్రీరాముడు అయోధ్యకు సీత, లక్ష్మణ, హనుమాదులతో విచ్చేసి పట్టాభిషిక్తుడయ్యాడు. అయోధ్య ప్రజలతో పాటు అన్ని లోకాలవారూ సంతోషంగా దీపాలు వెలిగించి ఉత్సవాలు చేసుకున్నారు. ఆనాటి నుంచి రామరాజ్య దీపావళిని ప్రజలు జరుపుకొంటూ వచ్చారని మరో గాథ. ఉత్తర భారతదేశంలో రావణ వధకు చిహ్నంగా దీపావళిని జరుపుకొనే వాడుక ఉంది.
 

విక్రమార్క విజయోత్సవం:

కాళీమాత అనుగ్రహంతో దివ్యశక్తి సంపన్నుడైన విక్రమార్క చక్రవర్తి ఉజ్జయిని రాజధానిగా ఆర్యావర్తమంతటినీ మహోజ్జ్వలంగా, ఏకచ్ఛత్రాధిపత్యంగా సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన రాజ్యాభిషిక్తుడైన రోజు నుంచి విక్రమ శకం పరిగణనలోకి వచ్చిందనీ, ఆనాటి నుంచి భారతీయులందరూ సంతోషంగా దీపావళి చేసుకోవడం ప్రారంభించారనీ కొందరు పండితుల అభిప్రాయం.

వీటిలో శ్రీరామ పట్టాభిషేకం, విక్రమార్క విజయగాథలు ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. కాగా, నరకాసుర వధ కథ మాత్రం దేశమంతటా, ముఖ్యంగా ఉత్తరాదిలో ఎక్కువ ప్రసిద్ధి చెందింది.
 

శ్రీ లక్ష్మీ పూజ:

లక్ష్మీ దేవి సకలైశ్వర్యప్రదాయని. ‘దీప లక్ష్మీ నమోస్తుతే’ అంటూ దీపాన్ని మహాలక్ష్మీ స్వరూపంగా సంభావించి, భక్తితో దీపావళి రోజున ఆరాధిస్తారు. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాపారులు లక్ష్మీ పూజ చేసి, కొత్త ఖాతా పుస్తకాలను పూజామందిరంలో ఉంచుతారు. తమ వ్యాపారాలు జయప్రదంగా సాగేట్టు చూడాలని లక్ష్మీ దేవిని ప్రార్థిస్తారు. 

ఇలా దీపావళి పండుగ చుట్టూ ఎన్నో పురాణ కథలు, గాథలు ఉన్నాయి. వీటన్నిటినీ స్మరించుకొని, ఆనందంగా పండుగ జరుపుకొందాం. 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya