Online Puja Services

గజలక్ష్మికి ఏనుగులెందుకు?

3.145.47.253

గజలక్ష్మికి ఏనుగులెందుకు?

లక్ష్మీదేవి 8 అవతారాలతో దర్శనం ఇస్తుంది. అష్టలక్ష్మి అన్నమాట ఇటీవల కాలంలో సుప్రసిద్ధంగా వినబడుతోంది. ఈ అష్టలక్ష్ములలో ఒకటి గజలక్ష్మి. తామర పువ్వులో పద్మాసనం మీద కూచుంటుంది గజలక్ష్మి. ఈమెకు ఇరుపక్కలా రెండు ఏనుగులు ఉంటాయి. ఆమె కూచునే భంగిమలోనే యోగముద్ర ఉంది. ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి. పై చేతులలో తామర పువ్వులు  ఉంటాయి. కింది చేతులు అభయ, వరద ముద్రలు చూపెడుతుంటాయి. లక్ష్మీదేవి సమృద్ధికి, సంపదకు, అదృష్టానికి, గౌరవానికి, దర్జాకు, దర్పానికి సంకేతం. ఆమె సర్వసంపత్కరి..

పరమపవిత్రకు చిహ్నం. ఈ విషయం చెప్పడానికే ఏనుగులు తొండంతో నీరు చిమ్ముతూ అమ్మవారికి అభిషేకం చేయిస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. తామర పువ్వుకే పద్మం అని మరో పేరు కూడా ఉంది. పద్మంలో ఉండే తల్లి కాబట్టి ఆమెను పద్మ, పద్మిని అని కూడా పిలుస్తారు. ఈ పద్మం నవనిధులలో ఒకటి. పద్మం అనే నిధిలో కూచునే తల్లి కనుక ఆమెను సంపదదాయిని, భాగ్యదాయినిగా ఆరాధిస్తారు. సామాజికంగా ఆలోచించినపుడు సంపద చంచలమైనది.

ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, ఎంతకాలం ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. పరమ చపలమైంది. ఇవాళ కోటీశ్వరుడుగా ఉన్నవాడు తెల్లారేలోపు భిక్షాధికారి అయి దేహీ అని రోడ్డున పడుతున్నాడు. ఈ చంచలత్వానికి, చాపల్యానికి తామర ఒక సంకేతం. సరసులో పద్మం నిలకడగా ఉండదు.  అటూ ఇటూ కదులుతూ ఊగుతూ ఉంటుంది. దాని మీద కూచున్న లక్ష్మి పద్మాన్ని కదిలిపోకుండా నిరోధిస్తుంది. అలా కూచునే లక్ష్మి యోగముద్రలో ఉంటుంది.
నిలకడలేని సంపదకు కుదురు తెచ్చేది యోగం మాత్రమే అన్న సందేశం ఇందులో ఉంది. యోగబుద్ధితో సంపదలను అనుభవించే వారికి ఆ సంపద మీద వ్యామోహం ఉండదు. కాబట్టి సంపదను ఎవరైనా స్వార్ధ బుద్ధితో కాక త్యాగబుద్ధితోనే అనుభవించాలని గజలక్ష్మి ఉపదేశిస్తోంది. 

ఇలా సిరిసంపదలను నిర్మోహత్వంతో అనుభవించేవారే సర్వసమర్థులనీ, శక్తిశాలురనీ, వారిని లోకమంతా ఆరాధిస్తుందని చెబుతుంది. ఈ మాట చెప్పడానికే ఏనుగులు లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నట్టుగా, అభిషేకిస్తున్నట్టుగా చిత్రాలలో చూపిస్తారు

- శ్రీ రాధాలక్ష్మి 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore