భృగు మహర్షి శాపం ఉత్తి మాటేనా ?

100.24.115.215

భృగు మహర్షి శాపం ఉత్తి మాటేనా ? 2000 ఏళ్ళ నాటి  ఆలయం చూస్తే, అలాగే అనిపిస్తుంది . 
-లక్ష్మీ రమణ 

బ్రహ్మదేవునికి ఆలయాలు లేవు . ఆయనకి గుడి కట్టరాదని భృగువు శాపమిచ్చారనేది పురాణకథనం . కానీ మన ఆంద్రప్రదేశ్ లోనే ఒక చక్కని , బృహత్తరమైన బ్రహ్మదేవాలయం ఉంది . అయినా స్థితికారకునికీ, లయకారకునికీ దేవాలయాలు కట్టి ఆరాధించే మనం, పాపం ఆ సృష్టి కర్తని విస్మరించడం అన్యాయం కదా ! విరామమే యెరుగకుండా నిరంతరం పనిచేసే ఆ పరబ్రహ్మని వదిలేస్తే, ఎలా అన్న ఆలోచనే ఈ ఆలయానికి అంకురార్పణ చేసిందా ? చూదాం పదండి . 

భృగు మహర్షి " బ్రహ్మకు ఎక్కడా పూజింపబడవని " ఇచ్చిన శాపం కారణంగా బ్రహ్మ దేవునికి ఎక్కడా కూడా ఆలయాలు ఉండవు. కానీ రాజస్థాన్ లోని పుష్కర్ లో, తమిళనాడు లోని కుంభకోణంలో  ,కాశీ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయాలు కనిపిస్తాయి . కాగా విదేశాలలో ఉన్న సుప్రసిద్ధ ఆంకోర్వాట్ దేవాలయం కూడా విష్ణు ఆలయంగా  చెబుతున్నప్పటికీ , ఇది  బ్రహ్మకి అంకితమైన ఆలయం అనే వాదనలూ ఉన్నాయి . ఇక మన తెలుగు ప్రాంతంలో , ఆంద్రప్రదేశ్ లో, గుంటూరు జిల్లాలో ఉన్న చేబ్రోలు గ్రామంలో బ్రహ్మకు ప్రత్యేక ఆలయం ఉంది . 

 బ్రహ్మలింగేశ్వరుడు:

బ్రహ్మాకి ఆలయాలు ఉండవు అని మహర్షి ఇచ్చిన శాపం వృధా పోతుందా ? అనే సందేహం ఈ వివరాలు విన్నాక ఖచ్చితంగా తలెత్తక మానదు . అయితే, ఇక్కడ బ్రహదేవుడు ప్రత్యేక్షంగా పూజలు స్వీకరించడు .  ఆయన బ్రహదేవుడే అయినా ఈశ్వర స్వరూపాన్ని కలిగినవాడు. ఒక లింగాకృతిలో ఇమిడిపోయి, నాలుగు ముఖాలతో చతుర్ముఖుడై , నిలువెల్లా విభూతిని ధరించి , పద్మోద్భవుడైన ఆకృతిలో ఇక్కడ ఆ సృష్టి కర్త పూజలందుకుంటున్నాడు. అందుకే ఆయనిక్కడ బ్రహ్మలింగేశ్వరుడు అని పిలుస్తారు . 

నిర్మాణ చాతుర్యం :

గుంటూరు నుండి తెనాలి వెళ్లే దారిలో ఉంటుంది చేబ్రోలు గ్రామం .ఈ బ్రహ్మస్వరాలయం  గుంటూరు జిల్లాలో నే కాక, తెలుగు రాష్ట్రాలలోనే పురాతన ఆలయంగా చరిత్రకెక్కింది. ఈ ఆలయ ప్రాంగణంలో రెండువేల సంవత్సరాల క్రితం, అంటే దాదాపు  క్రీ. శ. 14 వ శతాబ్ధంలో నిర్మించిన ఆలయాలు సైతం ఉన్నాయి. ప్రధానాలయం , ఆలయకోనేరు మధ్యలో నిలబడి ఉంటుంది .  నాలుగువైపులా శివ, విష్ణు,శక్తి దేవాలయాలతో అలరారుతుంది. మున్నీట పవళించిన నాగశయుని నాభి లో విరిసిన కమలం , అందులో జన్మనొందిన బ్రహ్మ అని కదా పురాణం .  అందుకే ఇక్కడా కోనేటి మధ్యలో విరిసిన కమలం నుండీ ఉద్భవించిన బ్రహ్మ ఆయన దర్శనం అనుగ్రహిస్తుంటారు . రెండువేల ఏళ్ళ క్రితంనాటి చరిత్రకి సాక్ష్యాలైన ఇక్కడి శిలా రూపాలు అప్పటి కదలని వినగలిగిన మనసున్నవారికి హృద్యంగా వివరిస్తుంటాయి . ఆనాటి ఆలయమే , కోనేటి మధ్యలో ఉన్నదే, అయినా దాని సౌందర్యం ఇసుమంతైనా చెడకపోవడం విశేషం . 

పల్లవ, చాళుక్యుల, చోళుల శిల్ప కళా వైభవానికి ఇక్కడి ఆలయాలు వేదికగా నిలుస్తున్నాయి. ఆరోజుల్లో చతుర్ముఖ బ్రహ్మ దేవాలయాన్ని ఏనుగుల మీద ఎర్రటి ఇసుకను తీసుకొనివచ్చి కట్టారని ఇప్పటికీ చెప్పుకుంటూంటారు . దానికి సాక్ష్యమా అన్నట్టు ,  ప్రత్యేకమైన యెర్రని మండపంలో చూడచక్కని నంది కనువిందు చేస్తుంటారు . కోనేరులో స్వామి వారి దేవాలయం ఉన్నా నేటికీ చెక్కుచెదరని శిల్ప సౌందర్యం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది.

ఉపాలయాలు : 

ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే , బ్రహ్మ చూపు నేరుగా పడితే అరిష్టం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడి బ్రహ్మశ్వరాలయాలన్ని దేవతామూర్తుల ఆలయాలతో అష్ట దిగ్బంధనం చేసినట్లు పూర్వీకుల కథనం.

బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయసముదాయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, భీమేరాశ్వరాలయం, వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, వీరభద్రుడు, రంగనాధ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, సహస్ర లింగేశ్వర స్వామి, నవగ్రహమూర్తులు, నాగేశ్వరాలయాలు, నంది మండపం  పక్కపక్కనే ఉన్నాయి.

భీమేశ్వరాలయం :

భీమేశ్వర ఆలయం క్రీ.శ. రెండవ శతాబ్ధంలో నిర్మించారని భావిస్తున్న బీమేశ్వర ఆలయానికి జీర్ణోద్ధారణ ప్రక్రియ నిమిత్తం బాగుచేస్తుండగా రెండువేల ఏళ్ళ సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి. ఇక్కడే పన్నెండడుగుల నటరాజ విగ్రహం కూడా ఉండేదట.

ఇలా చేరుకోవాలి :

విమాన మార్గం చేబ్రోలు కు 62 కి. మీ. దూరంలో గల విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం సమీప విమానాశ్రయం. 

రైలు మార్గం చేబ్రోలులో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుండి విజయవాడ, గుంటూరు వంటి దగ్గరి నగరాలకు ప్రయాణించవచ్చు. లేకుంటే 32 కి. మీ. దూరంలో ఉన్న గుంటూరు రైల్వే స్టేషన్ లో గాని, 60 కి. మీ. దూరంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ లో గాని దిగి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. 

రోడ్డు మార్గం విజయవాడ, గుంటూరు వంటి నగరాల నుండి బస్సులు చేబ్రోలు కి వస్తుంటాయి. గుంటూరు బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. తెనాలి నుండి కూడా చేబ్రోలు కి బస్సులో ప్రయాణించవచ్చు.

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna