Online Puja Services

పాండురంగ నామం సర్వపుణ్య ధామం !

18.221.129.19

పాండురంగ నామం సర్వపుణ్య ధామం !
లక్ష్మీ రమణ 

వైశాల్యం వలన మహారాష్ట్ర ప్రాంతం ‘ మహారాష్ట్రం’ మనే పేరుని సంపాదించుకోలేదేమో ! అక్కడ పుట్టిన మహాను భావుల పాదధూళి , ఆ ప్రాంతంలో మారుమ్రోగిన పాండురంగ నామం , వారి అద్భుతమైన చరితల వల్లనే ఆ నేల మహారాష్ట్రమని పేరు పొంది ఉంటుంది. అటువంటివారిలో తుకారాం అగ్రగణ్యుడు . వేల మంది చూస్తుండగా, దివి నుండీ దిగి వచ్చిన పుష్పక విమానమెక్కి నారాయణుని సన్నిధి చేరినవాడు . అటువంటి వారి కథలని చదువుకోవడం కూడా సత్సాంగత్యం చేసిన దానితో సమానం. 

 తుకారాం పాండురంగడి భక్తుడు. మహారాష్ట్రలోని దేహో గ్రామ నివాసి. ఆయన వర్తక, వ్యవసాయాలు జీవనాధారంగా గలిగిన వారు. అయినా పాండురంగని కోసమే తపించి,  పాండురంగడిని సేవించడమే తన జీవితానికి పరమార్థంగా భావించాడు. పాండురంగడి ఆదేశం మేరకు అనేక 'అభంగాలు' రచించి వాటిని ఆ స్వామికే అంకితం చేసిన పరమభక్త శిఖామణి. తనకున్న కొద్దిపాటి ఆస్తి పాస్తులను పాండురంగడి సేవకే ధారపోసిన తుకారాం, మానవసేవే మాధవ సేవగా భావించి భక్తి మార్గాన రాగ పరిమళాలు వెదజల్లాడు.

ఆయన నిరుపమానమైన భక్తికి నిదర్శనంగా ఒక తీయని సంఘటన చెబుతారు. 

ఒకనాడు ఒక రైతు స్వామికి చెరకుగడలు అర్పించాడు. వాటిని మోసుకొస్తుండగా వీధిలో బాలురు అతని చుట్టూ మూగి చెరకు ముక్కలడిగారు. వాళ్లందరికీ తలా ఒక గడ ఇవ్వగా ఒక్క గడ మాత్రం మిగిలింది. దాన్ని తెచ్చి భార్యకిచ్చాడు స్వామి. ఆమె వీధిలో అందరి చేతుల్లోనూ చెరకు గడలుండటం గమనించి, జరిగిందేమిటో గ్రహించి ఒల్లెరుగని కోపంతో చెరకుగడతో స్వామినెత్తిన ఒక్కటి వడ్డించింది. అది రెండు సమానమైన ముక్కలైంది. ఒక ముక్క ఆమె చేతిలోనే ఉండిపోయింది.'సమర్థురాలవు సుమా! గడను సమానంగా పంచావు. బాగుంది. నీ చేతిలో ముక్క నువ్వు తిను. ఇది పిల్లలు తింటారు!' అంటూ క్రిందపడిన ముక్కను పిల్లలకు ఇచ్చాడు స్వామి. అంతటి శాంతమూర్తి ఆయన. 

ఒక వైపున భార్యా బిడ్డలు ఆకలితో అలమటించి పోతున్నా, పాండురంగడి గురించి మాత్రమే ఆలోచించిన అనితర సాధ్యమైన భక్తి ప్రపత్తులు ఆయనలో కనిపిస్తాయి.  పాండురంగడు ప్రసాదించినది మినహా వేరెవరు ఏది ఇచ్చినా స్వీకరించనంటూ, శివాజీ మహారాజు పంపిన కానుకలను సైతం తిప్పి పంపిన మహనీయుడు ఆయన.

 తనను అన్ని విధాలుగా పరీక్షించిన పాండురంగడిని, ఒకానొక సమయంలో తుకారాం నిరసించాడు. అలాంటి పరిస్థితుల్లోనే తుకారాంకి పాండురంగడు దర్శనమిచ్చాడు.

తుకారాం జీవితంలో దైవ లీలలకు సంబంధించిన ఎన్నో అపూర్వమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి. 

తుకారాంకి పాండురంగడి ధ్యాస తప్ప మరో ఆలోచన వుండేది కాదు. ఆ స్వామిపై అనేక అభంగాలను రచిస్తూ వాటిని పాడుకుంటూ పరవశించిపోయేవాడు. తనకి మంచి జరిగినా, చెడు జరిగినా ఆ పాండురంగడి అనుగ్రహంగానే భావిస్తూ నిరంతరం ఆయన సేవలోనే కాలం గడిపేవాడు. అలాంటి తుకారాంకి ఒకసారి ఒక పరీక్ష ఎదురైంది.

తుకారాం పాండురంగడిపై అభంగాలను రాసి పాడుతుండటం, అవి వింటూ ప్రజలు మైమరచి పోతుండటం, అగ్రవర్ణానికి చెందిన రామేశ్వరభట్టుకి అసూయ కలిగించింది. గ్రామ ప్రజలు తన కంటే తుకారాంనే ఎక్కువగా గౌరవించడాన్ని ఆయన సహించలేకపోయాడు. గ్రామస్తుల సమక్షంలో తుకారాంని దోషిగా నిలబెట్టి, తక్కువ కులంలో పుట్టిన ఆయనకి భగవంతునిపై భజనలు, కీర్తనలు రాసే అర్హత లేదని చెప్పాడు. ఇక నుంచి ఆ అలవాటు మానుకోవడమే కాకుండా, అంతవరకూ రాసినవి ఇంద్రాణి నదిలో పారేయ్యాలని ఆదేశించాడు. భగవంతునికి కులాలు , మతాలూ అవసరమా ? భక్తి ఎక్కడుంటే, ఆయన అక్కడే ఉంటాడు. 

అది పాండురంగడు తన భక్తికి పెట్టిన పరీక్షగా భావించిన తుకారాం, తాను అభంగాలను రాసిన తాళపత్రాలపై నాపరాతి పలకలు పేర్చి వాటిని గుడ్డలో మూటగట్టి ఇంద్రాణి నదిలో ముంచేశాడు. తనకి ఎంతో ఇష్టమైన అభంగాలను వదిలేసినందుకు బాధతో, భారమైన మనసుతో ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు నుంచి ఆయన నిద్రాహారాలను మానేశాడు. అలా ఓ 13 రోజులు గడిచిపోయాక తుకారాం ఇంద్రాణి నదిలో ఎక్కడైతే ఆ అభంగాలను ముంచాడో అక్కడే అవి పైకి తేలి గ్రామస్తులకు కనిపించాయి. అవి ప్రవాహానికి కొట్టుకుపోకుండా వుండటం చూసి అంతా ఆశ్చర్య పోయారు.

ఈ విషయం తుకారాంకి తెలియగానే ఆయన నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన్ని చూస్తూనే , తల్లిని చూసిన పిల్లవాడిలా  ఆ తాళ పత్రాలు ఆయనున్న దిశగా కొట్టుకువచ్చి ఆగాయి. ఆ పాండురంగడికి తనపై దయ కలిగిందంటూ ఓ బిడ్డను దగ్గరికి తీసుకున్నట్టుగా, ఆయన ఆ తాళపత్రాల మూటను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ దైవలీలను చూసిన వారంతా ఆశ్చర్య చకితులయ్యారు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం రామేశ్వర భట్టుకి తెలిసింది. అంతే ఆయన పరుగు పరుగునా వచ్చి తుకారాం పాదాలపై పడ్డాడు. అతని పట్ల అహంకారంతో వ్యవహరించినందుకు మన్నించమంటూ ప్రాధేయపడ్డాడు

ఈ సంఘటన తరువాత తుకారాం విషయంలో గ్రామస్తుల ప్రవర్తనలో ఎంతో మార్పువచ్చింది. తుకారాం మాత్రం సాధారణమైన వ్యక్తిగా అతి సాధారణమైన జీవితాన్నే గడిపాడు.  ఆ పాండురంగడి సేవలోనే తరించాడు.

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda