Online Puja Services

తేనెటీగలు కాపలా కాసే రంగనాయకస్వామి ఆలయం !

18.189.2.122

తేనెటీగలు కాపలా కాసే రంగనాయకస్వామి ఆలయం !
లక్ష్మీ రమణ

రంగనాధుడనగానే , శ్రీరంగం లోని రంగనాధుడు రమణీయంగా కనులముందర కదలాడుతాడు.  అమలిన ప్రేమని పెనవేసుకున్న గోదామాత నిలువెల్లా పూలమాలలు  ధరించి ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణ దేవరాయలు వర్ణించినంత సమ్మోహనంగా మన కనులముందు నిలబడుతుంది . అయినా రంగనాధుడు ఎక్కడున్నా కన్నెలని వలపించి , తననే వలచేలా చేసుకోవడం బాగా అలవాటు . ఆ గోదామాతని స్వీకరించినట్టే, ఒక గిరిజన యువతిని కూడా స్వామి చేపట్టి , రంగనాథుడై వెలసిన క్షేత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది . 

స్వామి దర్శనం :  

నెమలిగుండం రంగనాయక స్వామి ఆలయం - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతిపురాతనమైన ఆలయంగా పేర్కొంటారు. గర్భగుడిలో రంగనాథస్వామి శయనభంగిమలో ఉండి దర్శనమిస్తారు .  అమ్మవారు పాదాలు ఒత్తుతూ ఉన్నట్టు  నిజరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. త్రేతాయుగం కాలం నుంచీ ఈ ఆలయంలో స్వామి పూజలు అందుకుంటున్నట్లు చెబుతారు.

నెమలిగుండం  :

రంగనాయక స్వామి ఆలయం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది . ఇక్కడ మయూర మహర్షి తన ఆశ్రమాన్ని  నిర్మించుకొని,మహావిష్ణువు కోసమ్ తీవ్రమైన తపస్సు చేశారు . మయూర స్వరూపుడైన ఆ మహర్షి ,  తన ముక్కుతో ఇక్కడి గుండాన్ని తవ్వారు . అలా త్రవ్విన మరుసటి రోజు సూర్యోదయానికి , గుండం నిండుగా నీరు ఉబికి వచ్చాయని ఇక్కడి వారు చెబుతారు .  అందువల్ల ఈ ప్రాంతానికి ఆయన పేరిట, నెమలిగుండం అని పేరొచ్చిందని స్థానిక కథనం . 

రంగని వరించిన రంగనాథుడు !

 ఇక, నల్లమల్ల కొండలలో ఇసుకగుండమనెచోట చెంచు జాతికి చెందిన బయన్న, బయ్యక్క దంపతులుండేవారు. వారికి ఏకైక కుమార్తె పేరు రంగ. పెళ్ళిడు కొచ్చిన రంగ తన కులాచారాన్ని దిక్కరించి, కులపెద్దలతో విభేదించి, మహావిష్ణువును పెళ్ళడాలనే తలంపుతో చెంచుగూడెం వదలి నెమిలిగుండం చేరుకుంది .  అక్కడ  తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది. ఆయన ఉపదేశంతో ,  మనో భీష్ట సిద్దికొసం మహర్షితో కలసి విష్ణుమూర్తికోసం తపమాచరించిది. ఎట్టకేలకు వారి తపస్సుకు చలించిన స్వామి  ప్రసంన్నుడై రంగను భార్యగా . స్వీకరించారు .  అలా రంగనాథుడు అయ్యారు . 

స్వయంభువు :

మయార మహర్షి కొరిక మేరకు నెమలిగుండం ప్రక్కనే పడమటి కొండపైన స్వయంభుగా వెలసి భక్తుల పాలిట ఆరాధ్యదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్నారు.

ప్రత్యేకత :

ఆ ఆలయంలో శౌచానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది . ఇక్కడ శుచీ , శుభ్రత లేకుండా గనక ఎవరైనా ఆలయంలోకి ప్రవేశిస్తే, వారిని తేనెటీగలు వెంటాడి వెంటపడి తరిమి తరిమి కుడతాయట .  బహుశా తమని ఎల్లవేళలా కాపాడే, కొండదేవత రంగాదేవి ఆనతి మీద ఇలా చేస్తాయేమో తెలీదుగానీ, ఇక్కడ తేనెటీగలు ఆలయాన్ని కాపు కాస్తుంటాయని చెబుతుంటారు స్థానిక ప్రజలు . 

వనభోజనాలు :
  
ఆలయం పక్కనేఉన్న జలపాతం వద్ద స్నానాలు ఆచరించవచ్చు. ఒక్కరోజు పర్యటన కు నెమలిగుండం (లేదా నెమలిగుండ్ల) ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. చుట్టుపక్కల స్థానికులు, పర్యాటకులు ముఖ్యముగా పండుగ మరుసటి రోజులలో (సద్ది పండగ) కుటుంబసభ్యులతో, బంధుమిత్రులతో కలిసివచ్చి వనభోజనాలు చేస్తుంటారు. 


లక్ష్మణ వనం - ఉపవాసాలు :

ఉపవాసాలు ఈ ప్రదేశాన్ని లక్ష్మణ వనంగా పిలుస్తారు. ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పదనం నెమలిగుండ రంగనాయక స్వామికి వుంది. గత కొన్ని సంవంత్సరాలుగా ప్రతి ఎటా చైత్ర మాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదియలో మూడు రోజుల పాటు ఉపవాసాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని శని, ఆది వారాలు  మాత్రమే తెరుస్తారు.  మరియు సాయంత్రం 6 అయ్యిందంటే ఎవ్వరినీ అనుమతించరు.

గుండ్లకమ్మ :

నెమలిగుండాన్ని 'గుండ్లకమ్మ' జన్మస్థానం అని అంటారు. గుండ్లకమ్మ నది బ్రహ్మెశ్వరం వద్ద ఆవిర్భవించి నల్లమల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండల మధ్య జాలువారి నెమలిగుండ్లలోకి చేరుతుంది. ఏడాది పొడవునా ఈ జలపాతం జాలువారుతూనే ఉంటుంది. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం, ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది

గిద్దలూరు నెమలిగుండం వెళ్లాలంటే గిద్దలూరు, మార్కాపురం, నంద్యాల ప్రాంతాల నుండి ప్రతి శనివారాలలో బస్సులు ఉంటాయి. గిద్దలూరు వరకూ రైలు సౌకర్యం ఉంటుంది .  అక్కడి నుండీ ఆటోలు అందుబాటులో ఉంటాయి . 

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya