Online Puja Services

భగవంతుని చేరుకోవడానికి తొమ్మిది మార్గాలు

18.222.117.109

భగవంతుని చేరుకోవడానికి తొమ్మిది మార్గాలు
- లక్ష్మి రమణ 

భగవంతుడు సర్వవ్యాపి. సర్వాంతర్యామి. కానీ, ఆయన్ని దర్శించాలి అంటే మాత్రం కావలసింది పరిపూర్ణమైన భక్తి.  ఆ భక్తి కూడా తొమ్మిది రకాలుగా ఉంటుందని అంటారు నారద మహర్షి.  ఆ తొమ్మిది రకాలైన భక్తులూ కూడా భగవంతుని చేరుకోవడానికి తొమ్మిది మార్గాలు.  నవవిధ భక్తి మార్గాలుగా ప్రసిద్ధమైన వాటిని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 

1. శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు. 

2. కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.

3. స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.

4. పాదసేవన భక్తి : భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.

5. అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. 

6. వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.

7. దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.

8. సఖ్య భక్తి : సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.

9. ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు. 

భక్తితో ముక్తిని పొందేందుకు ఎన్ని మార్గాలున్నాయో, ఎందరు మహాత్ములు ఆయా మార్గాలని అనుసరించి ఆ పరమాత్మని పొందారో చూడండి.  వీటిని గురించి మరింత వివరంగా మరిన్ని పోస్టుల్లో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం . 

శుభం . 

9 ways to reach god.

#sravana #shravana #bhakti #bhakthi #Prapathi #atmanivedana #keerthana #sakhya #dasya #vandana #archana #padasevana #smarana #kirthana

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha