Online Puja Services

ఆధ్యాత్మిక భావనలో ప్రేమ !

18.190.217.134

ఆధ్యాత్మిక భావనలో ప్రేమ ! 
లక్ష్మి రమణ 

ప్రేమ అనేది మన ఆధ్యాతిమా భావనలో విశ్వ జనీనమైనది . సంపూర్ణ స్వేచ్ఛకి తార్కాణం ఈ రెండక్షరాల పదం .  ప్రేమంటే, ఒక రోజుకి పరిమితమైనది కాదు . విశ్వములో ప్రతి అణువులోనూ నిండి ఉన్న అనంతచైతన్య స్వరూపం ప్రేమ . ఈ రెండక్షరాలనీ సరిగా అర్థం చేసుకుంటే, జగతిలో సగం సమస్యలు ఉండవేమో !

ప్రేమ అనే పదంలో, ప ర మ అనే అక్షరాల సమన్వయ శబ్దం ఉంది . దీని అర్థం ఏమిటంటే, ప్రాపంచికమైనది కాదు అని అర్థం . అడిగే సినిమాలో చెప్పినట్టు ఇన్ఫాచ్యుయేషన్ కాదిది .  యవ్వనంలోని ఆకర్షణ కాదిది. రెండు తనువులని కలిపే కలయిక కాదిది .  రోడ్లవెంట షికార్లు తిరగడం , లేదా ఒకే కప్పులో రెండు స్ట్రాలు వేసుకొని డ్రింకులు తాగడం వంటి వాటికి అతీతమైనది . 

ఒకర్నొకరు లోబరచుకోవటం, ఒకరి మీద మరొకరు ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఈ ప్రేమ అంగీకరించదు .  ప్రేమ అంటే సంపూర్ణమైన స్వేచ్ఛ .  ఈ మాటకి కూడా నానార్ధాలు తీసుకునేవారికి తక్కువేమీ లేదు . కానీ ఈ స్వేచ్ఛకి అర్థం వేరు . 

ప్రేమనేది ఆత్మ సంబంధమైనది మాత్రమే. దీని అర్ధం జీవాత్మ-పరమాత్మను పొందటమే. మనలోని జీవుడు, మనలోనే కొలువైన ఆ పరమాత్మని చేరుకోవడం నిజమైన ప్రేమ . జీవాత్మని పరమాత్మని అర్థం చేసుకున్నవాడికి అణువణువునా భగవంతుని దర్శనం సాధారణమైన విషయమే . అలా దర్శించుకోగలిగిన మహా యోగికి తరతమ భేదాలు ఏముంటాయి . ఆయన ప్రతి జీవిలోనూ, ఆ మాటకొస్తే, చారాచర సృష్టి మొత్తం అణువణువునా  పరమాత్మని దర్శించుకొంటూ ఉంటారు . కాబట్టి ఆయనకీ విశ్వమే ప్రేమ మయం .  ఆ రాధమ్మ , సంతు మీరాబాయి వంటి వారు అటువంటి భక్తిలో , ప్రేమమయ భక్తిలో రమించిపోయినవారే కదా ! 
 
అందుకే ప్రేమ అనేది కోరిక కాదు. అదో త్యాగం.  మోహం కాదు. అది మోక్షం. ఇందులో స్వార్థం లేదు. పరహితమే ఉంది .

విశ్వజనీనమైన  ఈ ప్రేమలో ఎడబాటు లేదు. విరహ వేదన
లేనే లేదు. అంటా నిండిన ఆ పరమాత్మలో సంలీనమే ! ఆయనతో నిత్యమైన అనుబంధంలోని ఆధ్యాత్మిక రసాస్వాదనమే ! దివ్యమైన ప్రేమ తత్వమే ! 

ఈ ప్రేమనే మనకి మన సంస్కృతీ బోధించింది . దీనినే మనం అలవర్చుకుని పంచాల్సింది , పెంచాల్సింది . కాబట్టి , కేవలం ఒకరోజుకి ఈ దివ్యమైన ఈ భావనని ఒకే రోజుకి పరిమితం చేసుకోవద్దు మనం , నిత్యం ఆ అనంతుని దివ్యభావనలో లీనమై , ఆయన ప్రేమ సంద్రంలో మునిగి , ఆ సౌందర్య అనుభవ దీప్తిని, నలుగురికీ పంచుదాం . దానివల్ల మనం మరింతగా ఆ దేవదేవుని కృపకి , ప్రేమకి పాత్రులమవుదాం ! శుభం .  

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya