Online Puja Services

అంతర్ముఖ జీవనం!!!

18.119.255.94

అంతర్ముఖ జీవనం!!!

★ ఆధ్యాత్మికతలో విశేష ప్రాధాన్యం కలిగిన అంశాలెన్నో ఉన్నాయి. అందులో అంతర్ముఖత్వం ముఖ్యమైనది. 

★ దీని గురించి కొంతైనా తెలుసుకోకుండా ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం దాదాపు అసాధ్యం. ఆకాశం గురించి చెప్పుకొనేటప్పుడు మేఘం ప్రస్తావన తేకుండా ఉండలేం. అలాగే సూర్యుడు-కాంతి, సముద్రం-కెరటం, తేనె-తీపి, ఆధ్యాత్మికత-అంతర్ముఖత్వం... ఒకదానితో మరొకటి విడదీయరాని బంధం కలిగి ఉంటాయి.

★పుట్టుకతోనే మనుషులు బహిర్ముఖులు. అంతర్ముఖత్వం గురించి ఎక్కువమందికి పెద్దగా  తెలియదు. తెలుసుకోవలసిన అవసరం రాదు. 
అతి కొద్దిమందికే ఆ దృష్టి కోణం ఏర్పడుతుంది. బాహ్య ప్రపంచాన్ని చూస్తూ, కనిపించిందే నమ్ముతూ జీవనం సాగించేవారు బహిర్ముఖులు. 

★అంతర్ముఖులు అలా కాదు. వాస్తవానికి, అంతర్ముఖులు అని వేరేగా ఉండరు. బహిర్ముఖులే చూపు మారి అంతర్ముఖులవుతారు. 
ఈ మార్పు ఎలా సంభవిస్తుంది? ప్రపంచం వెంటపడుతున్న మనిషి ఆగి, ఆలోచించి చూసే విధానంలో మార్పు తెచ్చుకుని అంతర్ముఖుడవుతాడా? అవును. అవుతాడు. అలా అయ్యారు కొంత మంది. వారే యోగులు, జ్ఞానులు.

★బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వం వైపు మనసును తిప్పుకోవడమే సాధన...
 అదే మానవుడి విజయం. ప్రపంచం అంతటా నిండి ఉన్న ఆశ, వ్యామోహాల వెంబడి జీవితాంతం తిరిగేవారికి అంతర్ముఖత్వం అంటే ఎన్నటికీ తెలియదు. బయటి ప్రపంచం విరక్తి పుట్టించాలి. లోపలి ఆత్మ ఆకర్షించి లోపలికి లాక్కోవాలి. అప్పుడే అంతర్ముఖత్వం అంటే ఏమిటో అవగాహనకు వస్తుంది. 

★ప్రపంచం మీద అంత సులువుగా వెగటు పుట్టదు. కష్టాల కొలిమిలో మండిపోవాలి. 
లేదా ఆత్మాన్వేషణలో మునిగిపోవాలి. ప్రాపంచిక సుఖాల్లో అంతర్ముఖత్వం అనే మాటకు అర్థం ఉండదు.

★కొంతమంది మిథ్యా వేదాంతులు అటొక కాలు, ఇటొక కాలు వేసి, రెండు పడవల్లో ప్రయాణించాలనుకుంటారు.
 బహిర్ముఖులుగా ఉంటూ అంతర్ముఖత్వం గురించి మాట్లాడుతూ, తాము అంతర్ముఖులం అని అనుకుంటారు. అది సరి కాదు. 
అంతర్ముఖులు కావడానికి జీవితం కొన్ని సందర్భాలు సృష్టిస్తుంది. ఆయా సందర్భాల్లో మనిషి సహజంగా లోచూపు చూస్తాడు. 
అక్కడే ఉండిపోవాలనుకుంటాడు, కాని ఉండలేడు, ఎవరో తోసేసినట్లు బాహ్య ప్రపంచంలోకి వచ్చి, మాయతో మమేకమైపోతాడు. ఎవరైతే చూపును లోపలకు తిప్పి, అంతర్ముఖులై అక్కడే ఉండిపోతారో- వారికి సత్య దర్శనం అయి తీరుతుంది. అలాంటి వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.

★అంతర్ముఖత్వంతో మొదలై, అంతరంగంలో నిలిచిపోయి నిశ్చలమయ్యే జీవితమే చరితార్థమవుతుంది. 
శ్రీరాముణ్ని అంతర్ముఖుడిగా మార్చినవాడు వసిష్ఠుడు. 
కురుక్షేత్రం కారణంగా అర్జునుణ్ని అంతర్ముఖుడిని చేసినవాడు శ్రీకృష్ణుడు. 
ప్రహ్లాదుడు పుట్టుకతో అంతర్ముఖుడు. 
ధర్మరాజు సహజంగా అంతర్ముఖుడు...
అంతర్ముఖత్వానికి అర్థం చెప్పినవాడు జనకుడు. 

★అంతర్ముఖత్వం ఆధ్యాత్మికతకు ఒక మలుపు...
★బహిర్ముఖుడైన మనిషికి, అంతర్ముఖుడైన సాధనాపరుడికి తేడా ఉంటుంది. 
★బయట ప్రపంచంలో అతడి ప్రవర్తనా శైలిలో చాలా మార్పులు కనిపిస్తాయి...
★రాగ, ద్వేషాలకు అతీతంగా ఉండి, నిత్యం శాంతిలో ఓలలాడుతుంటాడు...
★అలా జీవించడమే మానవ జీవన పరమార్థం, దాన్ని సాధించాలి.

- వాట్సాప్ సేకరణ               

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya