గుడిలో ఉన్నది రాతి బొమ్మే కావచ్చు! కానీ అది పరమాత్మే !

54.173.214.227

గుడిలో ఉన్నది రాతి బొమ్మే కావచ్చు! కానీ అది పరమాత్మే ! 
-లక్ష్మీ రమణ 

నిర్గుణుడు, నిరాకారుడు పరబ్రహ్మ . కానీ నిరాకార పరబ్రహ్మని సాధన చేసేకన్నా, సాకార రూపాన్ని సాధన చేయడం వల్ల ఫలితాన్ని పొందే అవకాశం త్వరితంగా ఉంటుందన్నది ఆ పరమాత్ముని మాట ! గుడిలో ఉన్నది రాతి బొమ్మే కావచ్చు , కానీ భక్తితో భక్తులు భావన చేయడం వల్ల  , అది పరమాత్మ స్వరూపంగా మారుతుంది . ఆవిధంగా భగవంతునికి , భక్తునికీ ఆ రూపం అనుసంధానమవుతుంది . ఇదే విషయాన్ని స్వామీ వివేకానందులవారు ఒక సందర్భంలో ఇలా ఆచరణాత్మకంగా ఒక రాజుగారికి బోధించారు  . 

ఒకరోజు ఆళ్వారు మహారాజు సమక్షంలో, వివేకానందుల వారు - రాజు చిత్రపటం దివానుతో తెప్పించారు. ఆ తర్వాత దివానుని ‘దీనిపై ఉమ్మండి’ అని కోరారు. ‘అలా చేసి ఆయనను అవమానించను’ అని దివాను జవాబిచ్చాడు. ‘రంగు పూసిన వస్త్రం ఇది. దీనిమీద ఉమ్మితే, రాజును అవమానించినట్లు కాదు’ అన్నారు వివేకానంద. దివాను నోటి వెంట మాట రాలేదు. అప్పుడు స్వామి ‘రాజా! ప్రజలు ఈ రంగుల చిత్రంలోనూ మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. భక్తులూ అంతే. విగ్రహాల్లో వారు తమ ఇష్టదైవాల్ని చూస్తారు’ అనడంతో ఆయనకు జ్ఞానోదయమైంది.

భగవంతుడి స్వరూపం అయిదు విధాలు. అవి: పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ స్వరూపాలు. సనాతన నిత్యరూపమే పర స్వరూపం. దీన్ని అందరూ దర్శించలేరు. పాలసముద్రంలోని శేషతల్పసాయిది వ్యూహ స్వరూపం. రాముడు, కృష్ణుడు విభవ స్వరూపాలు. అందరి హృదయాల్లోనూ సూక్ష్మరూపంలో ఉండేది అంతర్యామి స్వరూపం. భక్తులంతా పవిత్రభావంతో పూజించే విగ్రహం- అర్చ స్వరూపం. భగవంతుడు ఆ స్వరూపంలో అందర్నీ కరుణిస్తాడంటారు. ఆయనకు, భగవంతుడి నామానికి తేడా లేదు. అందుకే భక్తులు- భగవత్‌ నామాన్ని స్మరిస్తూ, విగ్రహాన్ని పూజిస్తారు. ఈ రహస్యం తెలియనివారు విగ్రహాల్లో శిల, లోహం, కొయ్య ముక్కల్ని మాత్రమే చూస్తారు!

Quote of the day

You cannot believe in God until you believe in yourself.…

__________Swamy Vivekananda