అతిథులను గౌరవించడమే మన సంప్రదాయం

54.165.57.161

నిండు మనసుతో అతిథులను గౌరవించడమే మన సంప్రదాయం . 
-సేకరణ : లక్ష్మి రమణ 

మనం తరుచుగా అతిథి, అభ్యాగతుడు అనే మాటలు వింటూ ఉంటాం కదా. అతిథి అంటే తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చే వాడు. అభ్యాగతుడు అంటే పర్వ దినాలలోను, భోజన కాలం లోను వచ్చే వాడు. సరే, భారతీయ సాంప్రదాయంలో అతిథి సేవకు గొప్ప స్థానం యిచ్చారు. అతిథి దేవోభవ  అని, అతిధిని దైవ సమానుడిగా చూడమని చెప్పారు . అతిథి సేవను నిష్ఠతో పాటించే వారు.దీనికి సంబంధించిన కొన్ని విశేషాలు ఇక్కడ మీకోసం . 

 అతిథిర్బాలక: పత్నీ, జననీ జనకస్తథా, పంచైతే గృహిణ: పోష్యా , ఇతరే చ స్వశక్తిత: 

అతిథులను, పిల్లలను, భార్యను, తల్లిదండ్రులను - ఈ ఐదుగురినీ గృహస్థు తప్పకుండా సేవించు కోవాలి. వీరిని నిష్ఠగా పోషించాల్సిన కర్తవ్యం ఇంటి యజమానిదే. ఇక తక్కిన వారినంటారా, యథా శక్తి పోషించ వచ్చును. అయితే, కవి ఇక్కడ మరో విషయం కూడా హెచ్చరిస్తున్నాడు. 

అతిథి ర్బాలకశ్చైవ స్త్రీజనో నృపతి స్తథా ఏతే విత్తం న జానంతి, జామాతా చైవ పంచమ: 

అతిథి, బాలురు, స్త్రీలు, రాజు, అల్లుడు - ఈ ఐదుగురున్నూ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితిని గురించి ఎంత మాత్రం పట్టించు కోరు ! అంటే, గృహస్థు దగ్గర డబ్బు ఉన్నా , లేక పోయినా తమకి సేవలు చేయించు కుంటూ, వారిని ఒత్తిడి చేస్తూ , వేధిస్తూ ఉంటారుట. 
అయినా, ఓరిమితో అతిథి సేవ చేయాలనేదే భారతీయ విశ్వాసం. 

అతిథిర్యస్య భగ్నాశో, గృహాత్ ప్రతి నివర్తతే స తస్మై దుష్కృతం దత్వా, పుణ్య మాదాయ గచ్ఛతి. 

అతిథి సేవను సక్రమంగా చేయని వాడికి ఎలాంటి ఫలితం ఉంటుందో కవి చెబుతున్నాడు. ఎవరి ఇంటి నుండి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి వెళ్ళి పోతాడో, ఆ అతిథి తాను వెళ్ళి పోతూ తన వెంట ఆ ఇంటి యజమాని చేసిన మంచి కర్మల ఫలితాన్ని తన వెంట తీసుకుని పోతాడు. అంతే కాదు, తన యొక్క చెడ్డ కర్మల పలితాన్ని ఆ యజమాని ఇంట విడిచి మరీ వెళ్ళి పోతాడు. అంటే, అతిథి సేవ చేయని వాడు మునుపు చేసికొన్న పుణ్య కర్మ ఫలాలను పోగొట్టు కోవడమే కాక, కొత్తగా చెడ్డ కర్మల ఫలితాలను మూటగట్టు కుంటాడని అర్ధం. 

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర: ఆపోశనం సురాపానం, అన్నం గోమాంసభక్షణమ్. 

అతిథి వాకిట ఉండగా వానిని విడిచి పెట్టి, గృహస్థు తాను ఒక్కడే భుజించడం మహా దోషం సుమా. అలాంటి వారు అన్నం తినడానికి కూర్చుంటూ పట్టే ఔపోశనం సురాపానంతో సమానం. వాళ్ళు తినే అన్నం గోమాంసంతో సమానం. 

మను చరిత్రలో పెద్దన గారి ప్రవరుని అతిథి సేవాతత్పరత ఎలాంటిదో చూడండి: 

తీర్ధ యాత్రలకు పోతూ ఎవరయినా వస్తున్నారని వింటే చాలు, నిత్యాగ్ని హోత్రడైన ప్రవరుడు ఎంత దూరమైనా సరే , వారికి ఎదురుగా వెళ్ళి, పాదాభివందనం చేసి తన యింటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని వేడు కుంటాడు. వారిని తన యింటికి తోడ్చుకుని పోయి భక్తియుతంగా ఆతిథ్యం యిస్తాడు.ఇష్ట  మృష్ఠన్నాలతో వారిని తృప్తి పరుస్తాడు. ఆతర్వాత వారి చెంత చేరి దేశ దేశాలలో ఉండే వింతలూ విశేషాలూ, పుణ్యతీర్ధాలూ వగైరాల గురించి అడిగి, తెలుసుకుని , ఓ సారి చూసి రావాలి అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తాడు. అలా ఉండాలి , అతిథి సేవ అంటే. 

భాగవతంలో రంతి దేవుని అతిథి సేవ ఎట్టిదో తెలిసినదే కదా రంతి దేవుడు తన సంపదలన్నీ దాన ధర్మాదులకి సమర్పించి, నిరు పేదయై, భార్యా పిల్లలతో ఎనిమిది దినాలు పస్తులు ఉన్నాడు. ఒక నాడు అతనికి దైవ వశాన నెయ్యి, పాయసం, నీళ్ళు లభించాయి. భుజిద్దామని కూర్చున్నాడో, లేదో, ఒక అతిథి వచ్చేడు.

రంతి దేవుడు అన్నదానాన్ని హరి సమర్పణంగా భావించి, తనకు లభించిన దానిలో కొంత అన్నమును వానికిచ్చి, వానిని సంతుష్టుని చేసి సాగనంపేడు. ఆ తరువాత శూద్రుడొకడు ఆకలితో వస్తే మిగిలిన దానిలో సగ భాగం యిచ్చి వేసి గారవించి పంపించాడు. తరువాత కుక్కల గుంపును వెంట నిడు కొనిన వాడొకడు రాగా, వానికి మిగిలినదంతా యిచ్చి వేసి భక్తితో నమస్కరించి పంపించాడు. తరువాత క్షుద్బాధతో వచ్చిన మరోకనికి దండమిడి, ‘అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావు మన్న ! రావన్న !’ అంటూ వానిని సగౌరవంగా పిలిచి తియ్యని నీళ్ళు సమర్పించుకున్నాడు. 

మన వారికి అతిథి మర్యాదలంటే ఇంత నిష్ఠ. హర విలాసంలో చిరుతొండ నంబి భక్తికి ఆది దంపతులు పరీక్ష పెడితే, ఆ నంబి తన శివ భక్త్యాచార సంపత్తిని ఎలా నిరూపించుకున్నాడో తెలిసినదే కదా. పదకొండు రోజుల పాటు ఎడ తెగని వర్షాలు శివ మహిమ చేత కురిస్తే, అతిథి సమర్పణకు వంటలు చేయడమే కష్టమై పోయింది. యింట ఎండిన వంట చెఱకు లేకుండా పోయింది. అయినా తైలంలో ముంచిన గుడ్డలకు నిప్పు అంటించి , పొయ్యలు వెలిగించి, వంటలు చేయించాడు. అతిథులు భుజిచనిదే తాను ఔపోసన పట్టని వ్రతం కలవాడు. అష్టకష్టాలూ పడి వంటలు ముగించినా, ఒక అతిథీ ( జంగముడూ) కనిపించక ఆశ్చర్య పోతాడు. ముసురు పట్టిన వేళ, తమ యింటి అరుగులు మీద, పంచల క్రిందా, భస్మం పూసుకున్న వాళ్ళూ, పరమ పావన మూర్తులు, మహా శివ భక్తులూ అయిన వారు అనేకులు ఉండే వారు. ఆ రోజు ఒక్కరూ కనబడక పోవడం చూసి నంబి ఆశ్చర్యచకితుడయ్యాడు. తర్వాత అతను భక్తి పరీక్షలో నెగ్గిన తీరు ఒళ్ళు జలదరింప చేస్తుంది.

 భోజరాజీయంలో ఇంటికి పోయి, బిడ్డనికి పాలిచ్చి మగిడి వత్తునని శపథాలు చేస్తూ పులితో ఆవు ఇలా పలుకుతుంది  ‘ఓ పులి రాజా, నేనింటికి పోయి తిరిగి నీ వద్దకు రాక పోతే, మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే వాడు ఏ దుర్గతి పాలవుతాడో నాకూ ఆ చెడ్డ గతే పడుతుంది’. అని ఆవు ఒట్టు పెట్టు కుంది. అతిథులంటే అంత శ్రద్ధాభక్తులు మరి. 

ఇదంతా అలా ఉంచితే, ఈ కాలంలో అతిథి సేవలు చేయాలంటే మరీ అంత వీజీ కాదు. గ్యాస్  ఎప్పుడు అయి పోతుందో తెలీదు. నల్లాలో నీళ్ళు వస్తాయో రావో తెలీదు. ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో తెలీదు. నగరంలో కర్ష్యూ ఎప్పుడు పెడతారో అసలే తెలీదు. కూరల ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నింగిని నంటుతున్నాయి.  చుట్టాల చిచ్చర పిడుగులు బంతాట ఆడుతూ ఏ టీవీ అద్దాన్నో ఎప్పడు బద్దలు కొట్టేస్తారో తెలీదు. ముచ్చట పడి చేయించుకున్న కొత్త ఫర్నీచరు ఎంతలా నాశనం కానున్నదో తెలీదు ఇలాంటి భయాలు ఎన్నో ! 

అందుకే అతిథి సేవా వద్దు, గాడిద గుడ్డూ వద్దు. మన యింటి తలుపులు మనకే తెరుచు కోవాలని మనసారా కోరుకుంటూ ఉంటాం. నిజానికి మీద చెప్పిన భయాలన్నీ కేవలం మన ఊహాపోహలు. కల్పనా కథలు. ముందు తరాల వారు ఇంత కంటె గడ్డు కాలం లో కూడా నిండు మనసుతో అతిథులను గౌరవించే వారు. మనుషులను ప్రేమించే వారు. ఇప్పుడా సద్భావన ఎందుకు మృగ్య మౌతున్నదంటే, కాలం మారి పోయి కాదు. కాని కాలం దాపురించీ కాదు. మనలో ఉండాల్సిన దేదో మనం కోల్పోవడం చేత. గుండెలో తగినంత తేమ లేక పోవడం చేత. మనం మనుషుల కంటె కూడా రూపాయి నోట్ల లాగానో, రూపాయి బిళ్ళల లాగానో బతకడానికి తెగ యిష్ట పడి పోతూ ఉండడం చేత. కాదంటారా ?

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda